Sesha Sharma:
*🧘♂️08- శ్రీ రమణ మార్గము🧘♀️*
*నీవెవరివో నువ్వు కనుక్కో*
*అధ్యాయం - 8*
*అందరికీ ఆహ్వానమే!*
‘తలంపులు లేని మనసు' గురించి మీకు ఒక ఆహ్వానం వచ్చిందనుకోండి. ఏం చేస్తారు? అంగీకరించి వెళ్తారా, నిరాకరిస్తారా లేక తికమకపడతారా? మీరు నిరాకరించే అవకాశమే యెక్కువగా ఉంది. ఎందుకు? మన జీవిత విధానంలో మన బుద్ధి మనల్ని నడిపిస్తూ ఉంది. బుద్ధి కూడా మనసే. జ్ఞాపకం, తర్కం, విచక్షణ, కోరుకొనడం, ఎంచుకొనడం, ఏకాగ్రతలకు ప్రాముఖ్యం అంతా కల్పించబడింది. మనది తలంపుల ప్రపంచం. మనసులోని నిక్షిప్తమైన వాసనలు సంస్కారాల వలన తలంపుల ప్రవాహం మన మెలకువతో మొదలవుతుంది. ఆగకుండా సాగుతుంది. కొన్ని తలంపులు మళ్లీ మళ్లీ వస్తాయి. కొన్ని కార్యక్రమాలకు సంబంధించి, కొన్ని తలంపులు, తలంపులు లేవు అని భయం వలన వస్తాయి. మనల్ని యెప్పుడూ ఒంటరిగా వదలవు. మనకు నిరంతరం తోడుగా తలంపులుంటాయి. అవి ఆహ్లాదంగా ఉన్నంతవరకూ, అవి మనల్ని విజయంవైపు నడిపించే వరకూ మంచిదే. కానీ పరిస్థితులు వ్యతిరేకంగా మారినపుడు, దుష్ట భావనలు దాడి చేసినపుడు, నిరాశా, నిస్పృహలు అలుముకున్నపుడు, మనసు తలంపులను ఆపివేసి మూసివేయడం గురించి మనకు యేమైనా తెలుసునా?
ఈ పరిస్థితికి పూర్తిగా వ్యతిరేకమైనది. 'తలంపులు లేని మనసు' స్థితి. అంటే దీని అర్థం యేమిటి? దాని గురించి యెందుకు ఖాతరు చెయ్యాలి. ఆ స్థితికై యెందుకు ప్రయత్నించాలి? ఆ స్థితిలో మనసు చాలా చురుకైనది, సంపూర్ణ శక్తి గ్రహింపు గలది. ప్రక్కదారులే లేనిది, స్థిరమైనది, అంతేకాక పూర్ణమౌనంగా ఉండేది. అహంకారం అంటే అర్థం అయి తెలుసుకోవడం వలన, మూలంలో లయం అయిపోవడం వలన సహజంగా నిలచిన మౌనం అది. మామూలుగా అయితే తలంపులు ఆకాశంలో మబ్బుల్లా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మానసిక ఆకాశంలో నల్లని, తెల్లని మేఘాల గుంపులు గుంపులుగా కదులుతూ ఉంటాయి. ఆలోచనలు శ్వాసలా సహజంగా వాటంతట అవే వస్తూ పోతూ ఉంటాయి.
మౌనంలో తలంపులు బోధ చెప్పడానికి, మాట్లాడడానికి, సందేహ నివృత్తి చేయడానికి, పని చెయ్యడానికి, దినదిన కార్యక్రమాలకు అవసరం అయిన
తలంపులు వాటికవే వస్తాయి. అవసరం తీరగానే పోతాయి. మిగతా సమయాల్లో అవసరం ఉండదు కాబట్టి తలంపులేమీ ఉండవు. మామూలుగా అయితే తలంపులను ఆపడం యెంత కష్టమో, ఆ మౌనస్థితిలో అవసరం లేని తలంపులను తెచ్చుకోవడం అంత కష్టం అని భగవాన్ అంటారు. అలాగే అజ్ఞాన అవస్థ అయిన గాఢనిద్రలో తలంపులు లేవని అది మౌనస్థితికి సమానమని పొరపాటున కూడా యేమారకూడదని హెచ్చరిస్తారు. గాఢనిద్రలో తలంపులు లేకపోవడము, మనసును తెలుసుకోవడం వలన జరగడం లేదు. మనస్సు నిద్రపోవడం వలన మాత్రమే తలంపులు లేవడంలేదు. ఆ మనస్సు మలినములు ఉన్నదే, అందుకే నిక్షిప్తమైన తలంపులు మనసు లేవగానే వస్తాయి. పూర్ణమౌన స్థితిలో ఉన్నది మలినంలేని నిర్మల శుద్ధ మనసే. అందుకే యెలాంటి తలంపులు నిక్షిప్తమై ఉండవు, ఉండలేవు, రావు. శూన్యమే, పూర్ణమే అది. నిద్రావస్థ వచ్చిపోయే ఒక మారే అవస్థ మాత్రమే. ఈ అవస్థలో అనుభవిస్తున్న ఆనందం తాత్కాలికమే. మెలకువ రాగానే, షరా మామూలే, ఆలోచనలే ఆలోచనలు, గుంపులు గుంపులు.
ఆనందం అన్నది బాహ్యమైన వస్తువులు, విషయాల్లోనే ఉన్నదని దృఢమైన విశ్వాసంతో ఉన్నాము. వాటివలననే మనకి ఆనందం లభిస్తుందని మనం గట్టిగా పూర్తిగా సిద్ధాంతీకరించుకున్నాము. అందుకే 'నేను అనే భావన' అహంకారం/ మనసు యెప్పుడూ యేదో బాహ్య విషయాలూ, వస్తువుల గురించి తలంచుతూ, ఇంద్రియాలతో గ్రహించుతూ ఉంటుంది. తాత్కాలిక ఆనందమో, దుఃఖమో పొందుతుంది. ఆనందం బాహ్యంలో ఉన్నదన్న సంబంధం వలన, మనస్సు తన సహజ స్వయం పరమానందంను మరచిపోతుంది. అందువలన, బయట ఆనందం కోసం వెదుకుతూ తలంపులతో చరిస్తుంది. తలంపులకు అలవాటయిపోతే, తన ఉనికిని, తను ఉండటాన్ని జీవించడాన్ని కూడా యీ తలంపుల వలననే అని అనుకుంటున్నాము. అందుకే 'నేననుకుంటున్నాను (ఐ థింక్)', 'నేను ఉన్నాను (సో ఐ యామ్)', 'నేను నమ్ముతున్నాను (ఐ బిలీవ్)' లాంటి పదాలతో అందరి మాటలు ఉంటాయి. తలంపులు, తలంచడమనే యెంతో గట్టి వ్యసనం నుంచి విముక్తి కలిగితే, బాహ్యమైన దాన్ని చూడక తనలోనికి చూడడం అలవాటవుతుంది. అలా కాకపోతే మౌన నిశ్చల మనసు, దాని సర్వశక్తి, సహజ పరమానంద జీవనం గురించి తెలియనే తెలియదు యెన్నటికీ భగవాన్ యొక్క మొదటి జీవిత చరిత్ర వ్రాసిన శ్రీ బి.వి. నరసింహస్వామి గారితో సంభాషణల్లో మనసు/ అహంకారాన్ని యెలా యెదుర్కొనాలో భగవాన్ తెలిపారు.
భ : బుద్ధిపరమైన వ్యక్తి, నేనను భావన/అహంకారం, వాటివలన వాటిల్లానే గ్రహించే బాహ్యప్రపంచం, విషయాలు కూడా ఒకదాని కంటే ఒకటి వేరుగా ఉండవు. గ్రహించే అహంకారం, గ్రహించబడే బాహ్య ప్రపంచం రెండూ ఉంటే ఒకేసారి ఉంటాయి. లేకపోతే రెండూ మాయం అవుతాయి, లేకుండా పోతాయి. ఏదో ఒక్కటే ఉండదు. నేను భావన, నాది, వాడు, అది, వీడు, యిది యిలా అన్నీ ఉంటే, అన్నీ ఉంటాయి, పోతే అన్నీ చేతనలో నుంచి లేకుండాపోతాయి. ఈ బుద్ధిపరమైన గ్రహించే చేతనకంటే వేరుగా చైతన్యం యేమీ లేదా?
న : ఉన్నట్లు నాకేమీ అనిపించడం లేదు.
భ : నీ గాఢనిద్రలో నీ బుద్ధి ఉండినదా? పని చేస్తున్నదా? అంటే నువ్వు ఆలోచించుతున్నావా, గ్రహించుతున్నావా, పోలుస్తూ విచక్షణ చేస్తున్నావా, జ్ఞాపకాలు ఉన్నాయా, వస్తువులు విషయాల గురించి నిర్ణయిస్తున్నావా?
న : లేదు. ఆలోచించడానికి అక్కడ విషయాలేమీ లేవు. అప్పుడు బుద్ధిపరమైన పని యేమీ జరుగలేదు.
భ : అయినా, నువ్వు ఉన్నావు, ఎంతో ఆనందంగా సుఖంగా ఉన్నావని అంగీకరిస్తావా?
న : అవును.
భ : మరి యీ నిద్రలోని అనుభవం, తలంపుకు విషయాలతో సంబంధంలేని ఆనందం యేమిటి? బుద్ధితో సంబంధంలేని యీ చైతన్యం, ఆనందం యేమిటి? నీ యొక్క (నేను) సహజస్థితి ఆనందమే అని తెలుసుకున్నావు. గాఢనిద్రలో బుద్ధికి అతీతంగా ఉన్నపుడే ఆనందం, సుఖం ఉందని తెలుసుకున్నావు. అంటే 'నేను' 'ఆనందం', బుద్ధిపరంగా గ్రహించకపోయినా రెండూ ఒకటేనని తెలుసుకున్నావా?
న : అవును. అలాగే అయి ఉండాలి. కానీ స్పష్టంగా అది నాకు అనుభవం కావడం లేదు. బుద్ధితో పనేలేని, బుద్ధికి అతీతమైన యీ పూర్ణ బ్రహ్మానందం నాకు అనుభూతి కలుగుట లేదు.
భా : ఎందుకు కలుగుటలేదంటే, యింతకాలం నువ్వు ప్రపంచం యితర విషయాలు వస్తువుల సంబంధాలతో తాద్యాత్మం చెంది వాటితోనే నిన్ను పోల్చుకుంటున్నావు.
అదే అలవాటు యెంతో బలమైన వ్యసనంగా ఉంది. పైన చెప్పుకున్నట్లు గాఢనిద్రలో ఉన్న 'నిన్ను' గురించి నువ్వు శోధించలేదు. నువ్వు నీ బుద్ధినే యెప్పుడూ వాడుతున్నావు గానీ నీ ఎరుకను కాదు.
ఈ పద్ధతి అటుదిటు మారితే, నువ్వు బాహ్య విషయాలన్నీ మూసివేసి అంతర్ముఖుడివై నీ లోనికిపోతే, నీ ఎరుకకై శోధిస్తే, నిన్ను నువ్వు కనుక్కోగలవు. అదే సత్యం, ఆత్మసాక్షాత్కారం, తెలుసుకున్నవాడు, నేను - అది వర్ణించలేనట్టిది, మనసుతో గ్రహించనట్టిది, మనసు చేరుకోలేనట్టిది. దాన్ని నామమాత్రంగా సత్-చిత్-ఆనంద అంటే ఉన్నది, చైతన్యం ప్రకాశం, పరమానందం అని చెప్పబడినది.
ఎవరైనా 'నేను'ను శోధిస్తే, పూర్తిగా బుద్ధి తలంపుల వలన జీవించే విధానం నుంచి విముక్తి పొంది, ఎరుక అనుభూతి వలన జరిగే జీవన విధానం తెలుసుకుంటారు. నేనును శోదించడం అంటే యేమిటి? తలంపుల ప్రవాహాలను ఆపటానికి భగవాన్ తెలిపిన మార్గము యేమిటి? మనకు తెలియకుండానే, మనసు నిండా యెన్నో రకాల ఆలోచనలు నిండిపోతాయి అని మనకందరికీ అనుభవమే. ఎంత వేగంగా తలంపులు కదులుతాయో వివరించడానికి భగవాన్ ఒక సంఘటన గురించి చెప్పారు.
'నేను స్కంధాశ్రమంలో ఉంటున్నపుడు, అపుడపుడు బయట ఒక బండరాయి వద్దకుపోయి కూర్చుండేవాడిని.
ఒకసారి అలా కూర్చున్నపుడు అక్కడ నాతో రంగస్వామి అయ్యంగార్తో సహా యింకా ముగ్గురు ఉన్నారు. అకస్మాత్తుగా ఆ రాయిలోని ఒక చిన్న పగులులో నుంచి ఒక చిన్న పురుగు గాలిలోనికి రాకెట్ దూసుకుపోవడం చూశాము. కనురెప్ప మూసి తెరచినంత సమయంలోనే అది యెన్నో లక్షలు లక్షల పురుగులుగా విభజన అయి ఒక పెద్ద మేఘంలా తయారై ఆకాశాన్ని కనుపించకుండా మూసివేసింది. రాతిలోనిది సూదిమొన అంత రంధ్రమే, అన్ని లక్షల పురుగులు ఒక్క క్షణంలో అందులోంచి రాలేవని మనకు తెలుసు. ఇలాగే అహంకారం కూడా లేచి రాకెట్ దూసుకుపోయి ఒక్క క్షణంలోనే విశ్వమంతా విస్తరిస్తుంది'.
'నేను యెవరు’ విచారణలో, తలంపులు మనసులో నిండకముందే, 'నేను'పై దృష్టి ఉంటుంది. ధ్యాసనంతా యీ ప్రథమ తలంపు / నేను భావన/ అహంకారంపై నిలపితే, యింక అది మిగతా ఆలోచనలు, విషయాలు, ప్రపంచంవైపు పోదు.
మనస్సు అంతర్ముఖమై, లోన ఉన్న దివ్యత్వం దాన్ని ఆకర్షించుతుంది. ఇలా మనసు తన మూలస్థానంలో కలసినందున, ప్రపంచ విషయాల్లో బలంగా చిక్కుకుని ఉన్న స్థితినుండి విముక్తి పొందుతుంది. ఒక ఆవుకు తన శాలలోనే పచ్చని గడ్డిని తినే అలవాటు చేస్తే, అది యింక బయటికిపోయి తిరిగి తినాలనుకోదు. అలాగే మూలస్థానంలో ఉన్న మనసు బ్రహ్మానందం అనుభవిస్తూ, యిక బాహ్య విషయాల్లో చరించే, తలంచే అలవాటును మానుకుంటుంది. మనసు యింక అస్తవ్యస్తంగా ఉండక, యెంతో విశాలంగా, చురుకుగా, సర్వ శక్తివంతంగా ఉంటుంది.
No comments:
Post a Comment