ఓం నమో భగవతే రామకృష్ణాయ
స్వామి వివేకానంద జీవిత గాథ: 275
చెన్నైకి వస్తున్న దారిలో స్వామీజీకి అనేక చోట్ల నుండి ఆహ్వానాలు వచ్చాయి. ఆయనకూ దేహం అనేది ఒకటి ఉందనీ, దానికి విశ్రాంతి నిద్రా అవసరమనీ భక్తులు విస్మరించినట్లుగా తోస్తున్నది.చెన్నైలో ఆయన ప్రసంగాలు కొనసాగించవలసి ఉంది.
అద్భుతాలు వద్దు.
స్వామీజీ నాలుగేళ్ల క్రితం చెన్నైకు వచ్చివున్నప్పుడు ఒక రోజు తమ తల్లి చనిపోయినట్లు కల కన్నారు. దాన్లోని నిజాన్ని తెలుసుకోవడానికై వలంగైమాన్ లోని గోవిందచెట్టి అనే ప్రేతాత్మలతో మాట్లాడే వ్యక్తి వద్దకు ఆయనను తోడ్కొని వెళ్లారు. కల నిజం కాదని తెలిపి, స్వామీజీ ఆరాటాన్ని ఉపశమింపజేశాడు గోవిందచెట్టి. అతడు కుంభకోణ స్వాగత సభ జనసమూహంలో నిలబడి ఉండడం చూసి స్వామీజీ, అతణ్ణి పిలిచి, తరువాత తమను విడిగా కలుసుకోమన్నారు.
గోవిందచెట్టి వచ్చినప్పుడు స్వామీజీ అతణ్ణి, *"మీకు అద్భుతశక్తులు ఉన్నాయని నాకు తెలుసు. అది మీకు డబ్బూ, ఖ్యాతీ విరివిగా సమకూర్చిపెట్టడం నిజం. కాని ఆధ్యాత్మికత విషయంలో మీరు ఒక్క అడుగు సైతం పురోగమించలేదు. ఎక్కడ ప్రారంభించారో అక్కడే ఆగి పోయారు. అదే కదా నిజం? భగవదభిముఖంగా మీ మనస్సు కాస్తయినా వెళ్లిందా*?” అని అడిగారు. గోవిందచెట్టి స్వామీజీ వ్యక్తపరచిన నిజాన్ని అంగీకరించాడు.
వెంటనే స్వామీజీ,*"మీ మనస్సు భగవంతుని వైపు మరలకుంటే ఈ శక్తుల వలన ప్రయోజనం ఏం ఉంది? భగవదానందాన్ని ఒకసారి మీరు చవి చూస్తే, ఆ తరువాత ఇవన్నీ నిరర్థకాలని గ్రహిస్తారు*" అని, గోవిందచెట్టిని ఆలింగనం చేసుకొన్నారు. చిత్రం ఏమిటంటే, నాటి నుండి గోవిందచెట్టి అద్భుత శక్తులు సమసిపోయాయి. ఆయన భగవంతునికై మనోవ్యాకులతతో, సంసారాన్ని త్యజించిన వ్యక్తిలా జీవించాడు.
No comments:
Post a Comment