*🧘♂️71 - శ్రీ రమణ మార్గము🧘♀️*
*శ్రీ రమణ మహర్షి సందేశం పునర్జన్మ ఉన్నట్టా? లేనట్టా?*
*హృదయ సంపన్నులు*
లోకంలో అక్కడొకరూ, ఇక్కడొకరూ క్షణాల మీద పూర్తిగా మారిపోతారు. ఇక్కడీ భూమిపై మనకు అదృశ్యమైన శక్తి ఏదో తిరుగుతున్నదనీ, మనమంతా ఆ శక్తిలో భాగమేననే స్ఫురణ అలాంటి వారికే కలుగుతుంది. అప్పుడిక తనని గురించి తాను ఆలోచించుకునే వ్యవధి ఉండదు. తనకున్న కొద్దిపాటి వస్తు సామాగ్రీ, ధనమూ తనకు సరిపోవడమే కాక అంతకన్నా మరింత సంపాదించాలనిగానీ మూటకట్టాలని గానీ అనిపించడం మానేస్తుంది. తోటి మనిషినీ చుట్టూ వున్న సృష్టినీ పీడించి ఏదో పోగేయాలనే కాంక్ష కరిగిపోతుంది. ఎవరైనా, ఏదైనా ఉచితంగా ఇస్తామని వచ్చినా, అంతర్గతంగా తనవంటి భాగ్యవంతుడు లేడనే నిశ్చయాని కొచ్చిన ఈ మనిషికి, ఆ బహుమానాలు పొందాలని ఉండదు. ఆత్మానందమే ప్రధానమైన అలాంటి వ్యక్తికి వస్తు సేకరణ, ధనాపేక్ష వంటి వాటి మీద దృష్టి నిలవదు.
తిరువణ్ణామలై రమణునికి భక్తులెవరు ఏది ఇవ్వజూపినా, వాటిని ఆయన త్వరగా వదిలించు కోవడానికి ప్రయత్నించేవాడు. ఆయన స్వభావం ఎరుగని వారు కాస్త బాధ పడేవారు. అయినప్పటికీ ఆయన వాటిని ఏదో విధంగా వదిలించుకుంటూనే వుండేవారు.
ఒకమారు ఒక మధ్య వయస్కుడు చేతి కర్ర ఒక దానిని తెచ్చి, అది రమణుడి సమక్షంలో పెట్టి, ఒంగి నమస్కరించి ఎదురుగా కూర్చున్నాడు. కాసేపయిన తరువాత సవినయంగా లేచి నుంచొని ఆ చేతి కర్ర మంచి గంధపు చెక్కతో చేసినదనీ దానిని మహర్షి స్వీకరించాలనీ కోరాడు.
రమణులు చిరునవ్వుతో నువ్వే ఉంచుకో అన్నాడు. నిజానికి ఆశ్రమంలో రమణుడికి “చెందిన” వస్తువులనే వాటిని కాపాడడం చాలా కష్టంగా ఉండేది. తనదంటూ ఒకటున్నదనే ఆలోచనే లేని రమణులు, ఎలాగూ దేనినీ పట్టించుకునేవారు కాదు. ఉమ్మడి సొత్తులా అది అక్కడ అందరి ఎదురుగా పడి ఉంటే - ఎవరో ఒకరికి ఆ కర్ర తమ సొంతం చేసుకోవాలనిపిస్తుంది. రమణుల వారిని అడిగో, అడక్కుండానో తీసేసుకుంటారు. కర్ర పరాయి వారి చేతుల్లోకి వెళ్ళిందనే విషయాన్ని గమనించిన వ్యక్తి మనసు ఎలాగూ బాధపడుతుంది.
అందువల్లే రమణుడు “నువ్వే ఉంచుకోరాదూ?” అన్నాడు. కానీ అతడు ఆ కర్రను రమణుడు స్వీకరించాలని పట్టుబట్టడం మానలేదు. రమణుడు యుక్తిగా - “ఇది నేనిచ్చిన ప్రసాదంగా ఉంచుకోమని" సలహా ఇచ్చాడు. ఆ వ్యక్తి అంతకన్నా యుక్తిగా - “అయితే మీరు ముందు దానిని స్వీకరించి మీ ఆశీర్వాదాలతో నాకిప్పించండి”. రమణుడు ఆ కర్రనందుకుని దాని నొకమారు ఆఘ్రాణించి - “చాలా బాగుందని” అంటూ దానిని ఆ వ్యక్తికి తిరిగి ఇచ్చాడు. “నీ వద్దనే ఉంచు. దీనిని నువ్వు చూసి నప్పుడల్లా నేను నీకు గుర్తుకు వస్తుంటాను కదా” అన్నాడు చిరునవ్వుతో.
అవిభక్త భారతదేశంలోని కరాచీ పట్టణానికి చెందిన కాలేజీ ప్రిన్సిపాల్ బూటానీ అనే పెద్ద మనిషి అందమైన నగిషీతో కూడుకున్న దారు పేటికలు, ఒక దానిలో ఒకటి అమర్చే వీలున్న సెట్ ఒక దానిని తెచ్చి - అరుణాచల రమణుడి ముందు పెట్టాడు. రమణుడు వాటి పనితనాన్ని చూసి చాలా ఆనందించాడు. కానీ అవి తన వద్ద ఉండాలనే కోరిక లేనందువల్ల, ఆ మరుక్షణమే - "ప్రిన్సిపాల్ గారూ, మీరు నాకని తెచ్చిన ఈ బహుమానాన్ని మరెవరికైనా నేను ఇచ్చేస్తే మీరేమీ అనుకోరుగదా? అని అడిగాడు. బూటానీ మహాశయుడు కూడా అంతర్గతంగా విరాగే అయినందువల్ల - “అలాగే చేయండి - నాకెట్లాగైనా సంతోషమే” నన్నాడు. రమణుడు వాటిని అక్కడికక్కడే మరో భక్తుడికిచ్చేశాడు.
హృదయంలో అసలైన “భాగ్యం” నెలకొంటే కొరత అనేది ఉండదు. అలాంటి స్థితి సిద్ధించడానికి రమణ మహర్షి అవాల్సిన అవసరం లేదు. చిత్తశుద్ధి వుంటే సామాన్యులైనా ఈ స్థితిని అందుకోవచ్చు.
ఆనాటి కరాచీ పట్టణంలోనే - ఒకసారి ఒక వ్యాపారి కొడుకు కనిపించకుండా పోయాడు. సింధు రాష్ట్రంలోని భీరియా గ్రామంలో సాధు పరుషుడైన ఒక సామాన్య వర్తకుడు ఉన్నాడనీ, వధూరామ్ అనే ఆ భక్తుణ్ణి ప్రార్థిస్తే - అతడేదో మార్గం చూపిస్తాడని ఎవరో వ్యాపారికి నమ్మకంగా చెప్పారు. దిక్కూ దరీ తోచని స్థితిలో ఆ వ్యాపారి అలాగే ప్రార్థించి నిద్రించిన వేళలో - వధూరామ్ కలలో కనిపించి ఆచూకీ తెలియజేయడం జరిగింది. వ్యాపారికి కలలో కనిపించినప్పటికీ - వధూరామ్ కి స్వయంగా ఈ విషయాలేమీ తెలియవు.
కానీ తనకు కలలో ఇచ్చిన సూచనల ననుసరించి వ్యాపారి వెళ్ళి వెతకగా అతడి కొడుకు దొరకనే దొరికాడు. కృతజ్ఞతా పూర్వకంగా ఆ వ్యాపారి - వధూరామ్ తన ఇంటికి వచ్చే ఏర్పాటు చేసి అల్పాహార విందు ఇచ్చి - సంతోషం కొద్దీ వధూరాము ఒక పొడుగాటి మెత్తని అల్పాకా కోటూ, ఖరీదైన షర్టూ, అందమైన టోపీ బహూకరించాడు. సామాన్యుడైన వధూరామ్ అలాంటి ఆహార్యాన్ని తనంతట తాను కొని ధరించగలిగిన స్థితిపరుడు కాదు.
కానీ వధూరామ్ మానసిక స్థితి అసాధారణమైనది. అతని మనసులో పేదరికం లేదు; అందులో మరేదో అలౌకికమైన “భాగ్యం” నిండి ఉన్నది. “ధోవతీ, పై అంగ వస్త్రం మాత్రమే ధరించే నేను ఈ విలువైన దుస్తులు ఏమి చేసుకుంటానని” నిరాకరించ బోయాడు. కానీ ఆ వ్యాపారి ఇతడి మాటలు చెవిన పెట్టకపోయేటప్పటికి ఇక అతడి మనసు కష్టపెట్టకూడదని అనుకొని - వాటిని తీసుకున్నాడు వధూరామ్. వ్యాపారి ఇంటి నుండి బయలుదేరి బయటికి వచ్చిన తరువాత వధూరామ్క దోవలో ఒక ఫకీర్ కనిపిస్తే - ఆ బహుమానాలన్నింటినీ - అతనికి బహూకరించేశాడు !
భౌతిక ప్రపంచంలోని భాగ్యం ఎంత సమకూర్చుకున్నా మనసుకు కొరత తీరేది కాదు. సంపన్నులైనా మరింత సంపద కోసం ప్రయత్నిస్తూనే వుంటారు. హృదయ సంపన్నుడే వస్తుజాలానికి అతీతుడవగలడు.
No comments:
Post a Comment