శ్రీరమణీయం
"సత్యాన్ని మాటల ద్వారా విని మనసుతో సులభంగా కనిపెట్టటం సాధ్యమే కదా ?"
"సత్యం వాక్కుకు, మనసుకి అందనిది. ఒక శాస్త్రవేత్త చాలాకాలం పరిశోధన చేసి ఒక కొత్త విషయం కనుక్కుంటాడు. కొత్త విషయం ఎక్కడి నుండో వచ్చి పడలేదు. అది మనసులో నుంచే ఉద్భవించింది. తన మనసులో నుండే వచ్చింది కాబట్టి అది అంతకుముందే వచ్చి ఉండవచ్చు కదా ! కానీ అది అలా జరగదు. సత్యం తనంతట తానుగా స్ఫురించే వరకు మనం వేచి ఉండాల్సిందే. శాస్త్రవేత్తకు సైన్స్ పరంగా తనలోనే ఒక నూతన అంశం ఎలా ఆవిష్కరించబడిందో, ఒక సాధకుడు పొందాలనుకునే భగవదానుభవం కూడా ఏదో ఒకరోజు తనలోనే ఆవిష్కరించబడుతుంది. శాస్త్రవేత్త అయినా, సాధకుడైనా సత్యాన్వేషణ కోసం ప్రయత్నం చేస్తూ పోతే ఏదో ఒక రోజు ఫలితం దానంతట అదిగా వ్యక్తమవుతుంది. అంతేగాని ఏ సాధనలోనైనా ఫలితం మనసుకి వాక్కుకి ముందుగానే గోచరించేది కాదు !"
"దైవాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటంలో సాధకుడు ప్రధానంగా ఎదుర్కొనేవి ఏమిటి ?"
"1.దైవం తనలోనే ఉన్నట్లు సత్యం తెలియకపోవడం. 2.దైవానుభవం అంటే తన హృదయంలో జరిగేదేనన్న విశ్వాసం కలుగకపోవటం. 3.దైవానుభవం జరిగేవరకు సహనం వహించే ఓపిక లేకపోవటం !"
"దైవం అంటే సత్యం. సత్యం అంటే ఉన్నదని అర్ధం. దైవం అనే సంపద మనలోనే ఉంది. ఈ విషయంలో మనందరం ఆస్థిపరులమే. కానీ అనుభవపరులమే ఇంకా కాలేదు. దైవం విషయంలో జ్ఞానం కలుగకపోయినా, ఆ దైవం మనలోనే ఉన్నదనే సత్యంపై విశ్వాసం రావాలి. మనలోనే ఉన్న ఆస్థి ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు మనకు తెలియకుండా పోదన్న ధీమా ఉండాలి. అలాంటి స్వాంతన వచ్చినప్పుడు దైవం అనుభవంలోకి రాలేదన్న వెలితి పోతుంది. దైవాన్ని త్వరగా తెలుసుకోవాలన్న ఆదుర్దా తగ్గుతుంది. అప్పుడు సాధన ప్రశాంతంగా సాగుతోంది !"
No comments:
Post a Comment