🔴 ధ్యాన సాధనలో కుండలినీ శక్తి పాత్ర.🔴
..."కుండలిని" అనే పదము, "కుండల" అనే సంస్కృత పదము నుండి వచ్చింది. కుండలం అనగా చుట్టలుగా చుట్టబడిన అని అర్ధం. మహా చైతన్య వంతమైన ఈ కుండలినీ శక్తి, మూలాధార చక్రమందు వశిస్తూ యున్నది. ఈ మహా శక్తి, చైతన్యవంతమైతే...మూలాధారము నుండి పయనించే సుషుమ్నా నాడి యందు ప్రవేశించి ఊర్థ్వ గమనము చెందుతుంది.
ఈ కుండలినీ శక్తి అనేక పద్ధతుల ద్వారా చైతన్యం చెందితే, ఈ ప్రయాణంలో మజిలీలుగా ఉన్న అన్ని చక్రాలనూ (శక్తి కేంద్రాలను ) స్పృశిస్తుంది. అలా అన్ని చక్రాలనూ స్పృశిస్తూ, భేదిస్తూ...చివరకి సహస్రారాన్ని చేరుతుంది ఈ మహాశక్తి. ఈ చక్రం ఆత్మ సాక్షాత్కార స్థానం.
అన్ని ఆధ్యాత్మిక శక్తులు ఈ సహస్రారంలో వికసించబడి ఉంటాయి కదా!
వెనుబాము పొడవునా, 7 ప్రధాన శక్తి కేంద్రాలు లేదా 7 ప్రధాన చక్రాలు విస్తరించి ఉంటాయి. ఈ చక్రాలు, మనుజుని యొక్క భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక జీవితానికి ఆధారభూతం. ఈ చక్రాలు మన శరీరమందలి నాడీ కూటముల వద్ద ఉంటాయి. ఈ చక్రాలు నాడుల ద్వారా అనుసంధానించబడతాయి.
కుండలినీ సాధనలో, కుండలినీ శక్తి ఊర్థ్వగమనం చెందుతున్నప్పుడు, మన శరీరం శక్తివంతంగా, సృజనాత్మకంగా, సకల సమన్వయంగా మారుతుంది.
ప్రతి చక్రము కూడా భౌతిక శరీరంలోని ఒక లేదా కొన్ని అంతస్రావీ గ్రంథులతోనూ, కొన్ని శరీర భాగాలతోనూ అనుసంధానంగా ఉంటుంది. ప్రతి చక్రము కూడా...మన శరీరమందలి నాడీ వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటుంది. ప్రతీ చక్రానికి కొన్ని లక్షణాలు, కొన్ని గుణాలు ఉంటాయి. ఆయా చక్రాలను చైతన్యవంతం చేయగలిగితే, మన వ్యక్తిత్వం తత్సంబంధ గుణాలు పెంపొందించబడుతాయి.
సాధన - దివ్యానుభూతులు :
పిండ ధర్మానుసారం సాధన :
సాధనయందు ప్రముఖముగా రెండు పద్ధతులు కలవు. ఒకటి సాకార సాధన అయితే, రెండవది నిరాకార సాధన. నిరాకార సాధకులు కేవలం ధ్యానము ద్వారా....ధారణా శక్తిని పొంది...తద్వారా సమాధి వైపు పురోగమించగలరు. ఈ సాధకులకు విభిన్న తంత్రములు, పరికరములు ఆవశ్యకత లేదు. ధ్యాన, ధారణ, సమాధులే వారికి నియమిత మార్గములు. ఏదో ఒక రోజున ఆ మార్గము సాధకుని నిర్గుణ నిరాకార సమాధి స్థితికి తీసుకొని వెళ్ళగలదు. రాజ యోగము అన్నిటి కన్నా ఉన్నత మార్గము.ఈ మార్గములో ఆత్మ సాక్షాత్కారము సులభముగా పొందవచ్చును. భక్తి మార్గములో కూడా ఆత్మ సాక్షాత్కారమునకు మహత్వ స్థానమీయబడినది. భక్తుడు - భగవానుల ఏకత్వమే దీనికి కారణము. అప్పుడు శ్రేష్ట సాధకుడు, స్వయముగా ఆత్మ సాక్షాత్కారమును పొందును. ప్రతి భక్తునకూ...అదే చరమావస్థ. భక్తి మార్గములో తమ తమ ఇష్ట దేవతను ధ్యానము చేయడం....అత్యావశ్యకముగా భావించబడినది. జ్ఞాన ప్రాప్తిని పొందుటకు.....నిరంతర ధ్యానమవసరము. ఈ విశ్వములో ఉన్నటువంటి అస్థిత్వములన్నిటి చరమావస్థను స్వయముగా పొందడమే జ్ఞానము. వర్ణమాలలో చివరి అక్షరము "ज्ञ". ఈ చరమావస్థను పొందడం జ్ఞానం.
No comments:
Post a Comment