*బంధాలు- బంధనాలు - ముక్తి *
స్థిరంగా నిలబడి ‘ఒక అడుగు నువ్వువేస్తే నేను ఒక అడుగు వేస్తాను’ అంటే- ఆ బంధం నిలబడదు. బంధాలు పరస్పర అవగాహన, సహకారాలుంటేనే నిలుస్తాయి. ఏ సంబంధం నిలబడాలన్నా ఆదాన ప్రదానాలు ముఖ్యం. అది లోపిస్తే సాంద్రతను కోల్పోతాయి. జీవితంలో సంబంధాలు అసలు ఎందుకు ఏర్పడతాయని ఎవరూ ఆలోచించి ఉండరు. ఒకేలాంటి అభిరుచులవల్లో, ఇరుగు పొరుగువారై ఉండటమో, పిల్లల కారణంగానో అనుకుంటారు. వయసు పెరిగాక, అనుభవం గడించాక అర్థమవుతుంది- సంబంధాలు యాదృచ్ఛికంగా ఏర్పడవని, దానికి ఏదో ఒక కారణం ఉంటుందని.
ఒకరి ఎదుగుదలకు మరొకరు సహకరించుకోవడం కోసం మనుషులు కలుస్తారు. కొన్ని సంబంధాలు అద్భుతంగా ఉంటే, మరికొన్ని ఉన్నట్లు కనిపిస్తాయి. బాధలకు అవే కారణమూ అవుతుంటాయి. ప్రతిదీ ఒక పాఠం నేర్పుతుంది ఎదిగేందుకు. ఒక జీవిగా ఎదగాలంటే అనుభవం అవసరం. జీవితంలో ఎన్నో దశలు... ఎందరో తారసపడుతుంటారు. లక్ష్యం నెరవేరగానే వెళ్ళిపోతారు.
మహాభారతంలో కురుక్షేత్రానికి ముందు నకులుడు భీష్ముడితో తప్పించలేని ఈ కురుపాండవ ఘర్షణకు అసలైన కారణ మేమిటన్నప్పుడు- ‘అన్యోన్యత లోపిం చడమే. దాని వల్ల అపార్థాలు పెరుగుతాయి’ అంటాడు భీష్ముడు. క్షమాగుణం బలమైన స్థిరమైన బంధాలకు తోడ్పడుతుంది. అన్ని సంప్రదాయాలకు చెందిన సాధువులు నిరంతరం క్షమించే గుణం కలిగి ఉండటమే ప్రేమ అంటారు. అదే బంధాలకు మూలం.
పై కప్పును నిలబెట్టేందుకు ఏర్పరచే నాలుగు స్తంభాలు ఎడంఎడంగానే ఉండాలి స్థిరంగా ఉంచడానికి దగ్గరికొస్తే కప్పు కూలిపోతుంది. స్వేచ్ఛలోనే బంధాలు వికసిస్తాయి. బంధనంలో ముడుచుకుపోతాయి. సంబంధం ఎప్పుడూ ఒక ఒడంబడిక కాదు. అవగాహనతో ఏర్పడేది. అవగాహనకోసం వినాలి. అర్థమయ్యేలా తెలియబరచాలి. ఏ బంధంలోనూ ఆశలన్నీ సంపూర్ణంగా నెరవేరవు.
ఒక సంబంధం తెగిపోయినంత మాత్రాన మరేం జరగదు. ఇతర సంబంధాల విషయాలకు సంబంధించిన బాధ్యత మిగిలే ఉంటుంది. ‘మన చేతుల్లో ఏముంది’, ‘మిగిలిందేమిటి’, ‘సంతోషమే లేదు’ అనుకుంటూ మనిషి తరచూ చలించిపోతుంటాడు. కోల్పోయిన సంబంధాల మీదే దృష్టి నిలిపినప్పుడు కొనసాగాల్సిన సంబంధాలకు న్యాయం చేయడం కష్టమవుతుంది. నిన్నటి బాధల తలపులతో విలువైన వర్తమానాన్ని జారవిడుచుకోకూడదు.
బోధించడమైనా, నేర్చుకోవడమైనా, సంబంధాలను బలపరచుకోవడమైనా- ఎందులోనైనా... శ్రద్ధగా వినేవారే ఇతరులకంటే ముందుంటారు. ఒక మంచిశ్రోత మాట్లాడే మాటల్నే కాదు, మాటలకందని భావాల్నీ గ్రహించగలుగుతాడు. దానికి ‘మనసు’ పెట్టాలి.
ప్రతి పురాణగాథ సంబంధాలకు దర్పణం పడుతుంది. ఈర్ష్యలు, అసూయలు, కోపతాపాలు సంబంధాలను ఎలా నాశనం చేస్తాయో వివరిస్తుంది. బంధాలు బలంగా కొనసాగాలంటే ఇతరులను అర్థం చేసుకుంటే సరిపోదు. నువ్వు అర్థం చేసుకున్నావనే నమ్మకం అవతలివారిలో కలగాలి. అది అవతలివారు తెలుసుకోవాలంటే నువ్వు వారి కోణంలో వ్యక్తపరచగలగాలి. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని చెప్పడం ఒకటైతే, ‘నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని’ అనేది మరొక విధం.
ఎవరి దృష్టిలో వారు వ్యక్తపరిస్తే అవతలివారి మనసు గెలుచుకోవచ్చు. ఎదుటివారి కోణంలో తెలియజెప్పినప్పుడు వారి హృదయాన్నే గెలవవచ్చు.
అందరి హృదయాల్లో స్థిరముగానున్న పరమాత్మను గుర్తిస్తేనే ముక్తి సిద్ధమవుతుంది. సత్వగుణము - సమత్వ భావన - స్వరూపజ్ఞానము - సర్వస్య శరణాగతి - తత్వదర్శనము - తురీయనిష్ఠలచే పరమాత్మ స్థితిని అనుభూతి చెంది ముక్తులగుటకే మానవ సంబంధాలన్నీ అని గ్రహించి బంధరహితులై మోక్షమునందాలి.
No comments:
Post a Comment