*తనకు తానే బంధువు*
మీకు అసలైన బంధువు ఎవరు ? మరెవరో కారు, మీకు మీరే బంధువు. భవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు - " आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपु रात्मनः " | మనకు ఎవరు మంచి చేస్తే వారు మనకు బంధువులని మనం సామాన్యంగా భావిస్తాము. కానీ మనకు ఏది మంచి ఏది చెడు అని ప్రశ్నించుకుంటే సంసారబంధనం నుండి విముక్తి లభించటమే మంచి అని సమాధానం వస్తుంది.
సంసారం బంధనం నుండి విముక్తి ఎవరి ద్వారా లభిస్తుంది అంటే, ఎవరి ద్వారా వారికే లభిస్తుంది అని శ్రీ శంకర భగవత్పాదులవారు ఈ విధంగా చెప్పారు - " उद्धरेदात्म नात्मानं मग्नं संसार वारिधौ " | అంటే సంసార సాగరంలో పూర్తిగా మునిగిపోయిన వాడు తన ఉద్ధారానికి తానే ప్రయత్నించాలి, మరో మార్గంలేదు. అయితే ఎవరికి వారు తమను తాము ఎలా ఉద్దరించుకుంటారు ? అని అంటే బాహ్యవిషయాల నుండి మనస్సుని మరలించి, ఆత్మ విచారణలో నిమగ్నం చేయటంద్వారా అది సాధ్యమవుతుంది. ఇలా జరగాలంటే ప్రాపంచిక విషయాలపట్ల వైరాగ్యాన్ని అలవరుచుకోవాలి. ప్రాపంచిక విషయాలు ఎండమావులవంటివని గ్రహించినప్పుడే వైరాగ్య భావనమేర్పడుతుంది.
గురువుగారి బోధనలు, వేదాంత విచారం వంటివి వైరాగ్య భావానికి అవసరం. గురువుగారి దయ కారణంగా వైరాగ్య భావం పరాకాష్టకు చేరుకుంటే, ఆత్మదర్శనానికి రంగం సిద్దమయినట్లే. అలా ఆత్మసాక్షాత్కారాన్ని పొందటమే జీవిత లక్ష్యం. ప్రతియొక్కరు ఈ లక్ష్యాన్ని నెరవేరటం కోసం ప్రయత్నించాలి .
सा विद्या या विमुक्तये అని పెద్దల వచనం, అంటే మోక్షహేతువైన విద్యయే విద్య. ఈ విషయాన్ని ఎవ్వరు మరచిపోకూడదు. ఆత్మదర్శనానికి దోహదం చేయని జ్ఞానం జ్ఞానమే కాదు. ఈ సూత్రాన్ని అర్ధం చేసుకుని ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ప్రతి యొక్కరూ ప్రయత్నించాలి.
--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.
No comments:
Post a Comment