🕉సార్ధక జీవితం.
మనిషి జీవితం రాగబంధాలతో కూడింది. రజోగుణమే రాగం. స్థూలంగా చెప్పాలంటే- ఇది నాది, వీరు నా వారు, ఇది నా ఆస్తి మొదలైన మమకారాలతో కూడిన భావమే రాగం. అది ఉన్నచోట ద్వేషం కూడా ఉంటుంది. సమాజంలో కొందరిని తనవారిగా భావించినప్పుడు, మరికొందరు పరాయివాళ్లుగా మారతారు. తనవాళ్ల కోసం పాటుపడే సమయంలో పరులను పక్కన పెట్టడం వల్ల సమాన దృష్టి కొరవడుతుంది. ఇలా తనవాళ్ల పట్ల పెరిగిపోయే అనురాగాలు మనిషిని బంధిస్తాయి. ఎప్పుడూ తనకోసం, తనవాళ్ల కోసం తపించడంలోనే శక్తియుక్తులన్నీ కర్పూరంలా హరించుకుపోతాయి. ఇలాంటి భావబంధాలను, భవబంధాలను తొలగించుకొమ్మని చెబుతుంది వేదాంతం.
అసలు మనిషి ఆయుర్దాయమే అతి స్వల్పం. నిండు నూరేళ్లు బతకడమే ఎంతో కష్టం. ఆ నూరేళ్లలోనూ బాల్యక్రీడలతో బాల్యం హరించుకుపోతుంది. చదువుసంధ్యలతో కౌమారదశ ముగిసిపోతుంది. విషయసౌఖ్యాలతో యౌవనం మాయమవుతుంది. నిరంతర చింతతో వృద్ధాప్యం గడుస్తుంది. అర్ధభాగం నిద్రకు, అర్ధభాగం ఇతర వ్యవహారాలకు ఆహుతి కాగా మనిషి ఆత్మానందం కోసం ఎంత కాలాన్ని వెచ్చిస్తున్నాడనేది ప్రశ్నార్థకమే. అందుకే శంకర భగవత్పాదులు చర్పటపంజరికా స్తోత్రంలో ‘ఓ మూఢమతీ! గోవిందుణ్ని భజించు! నీ కాలం మూడినప్పుడు నిన్ను ఆ గోవిందుడు తప్ప ఎవరూ కాపాడలేరు. నీవు చదివిన వ్యాకరణ శాస్త్రం నిన్ను అంత్యకాలంలో కాపాడదు. కనుక శాస్త్రాలు వల్లెవేయడం కాదు, సాధనతో భగవంతుడికి సమీపంగా ఉండటానికి ప్రయత్నించు’ అన్నారు.
మనిషి జన్మించే సమయంలో ప్రసవవేదనను కలిగించి తల్లిని కష్టపెడతాడు. పుట్టిన తరవాత పెరిగేదాకా తల్లితో సేవలు చేయించుకుంటాడు. పెరిగి పెద్దవాడైన నాటినుంచి సాంసారిక బంధాల్లో అష్టకష్టాలు అనుభవిస్తాడు. అనారోగ్యాలతో, ఆపదలతో దుర్భరంగా కాలాన్ని వెళ్ళదీస్తాడు. అందుకే శంకరభగవత్పాదులు- ఈ సంసారం ‘దుస్తారం’ (అతికష్టంతో దాటదగిన సముద్రం). కనుక ఓ మురారీ! నన్ను కాపాడు!’ అని ప్రార్థించారు.
చీకటిలో నడుస్తున్నవాడికి దారి తెలియదు. అజ్ఞానాంధకారంలో తిరిగేవాడికి జ్ఞానోదయం కానే కాదు. జ్ఞానకాంతికోసం వెదకాలి. చీకటిలో చిరుదివ్వెను వెలిగించాలి. మృత్యువు నుంచి అమృతత్వాన్ని తోడుకోవాలి. అదే మనిషి చేయవలసిన పని. నేనెవరు, నీవెవరు... అందరిలోనూ ఉన్న ఆత్మ ఎవరు, లోకంలో శాశ్వతంగా నిలిచేదేమిటి? ఏది నశించేది, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం? ఈ ప్రశ్నలు ఉదయించాలి. వాటికి సమాధానాల కోసం అన్వేషించాలి. అదే నిజమైన జీవితం!
ఈ ప్రపంచంలో మనిషి జీవితం ఒక కల వంటిది. ‘కల’ ఎలా కొంతసేపు మురిపించి, నిద్ర మేల్కొన్న తరవాత కనబడకుండా పోతుందో అలాగే ఈ ప్రపంచం కూడా కొన్ని యుగాల వరకే పరిమితం. ఇది ఎల్లకాలం ఇలాగే ఉండదు. అదే వేదాంత భావన.
ప్రపంచమే అశాశ్వతమైనప్పుడు ప్రపంచంలో కొంతకాలమే బతికి ఉండే మనిషి అశాశ్వతుడే కదా! అశాశ్వతమైన ఈ మానవజన్మను శాశ్వతానందాన్ని కలిగించే విషయాల కోసం ఉపయోగించాలే కానీ, క్షణిక సౌఖ్యాల కోసం వినియోగిస్తే ఇక సార్థకత ఎలా ఉంటుంది?
🕉🙏
No comments:
Post a Comment