Tuesday, February 7, 2023

ఆత్మజ్ఞానము ద్వారానే మోక్షప్రాప్తి

 *ఆత్మజ్ఞానము ద్వారానే మోక్షప్రాప్తి*

ప్రపంచంలో ఆస్తికులందరూ కోరుకునేది, కావలసినది మోక్షము. అదే మనజీవిత పరమావధి కూడాను. మోక్షము ఏ సాధనముల వలన సిద్ధిస్తుంది అంటే ఉపనిషత్ సిద్దాంతముల వలననే లభ్యమవుతుంది. వీటినే వేదాంత శాస్త్రం అని కూడా వ్యవహరిస్తారు. नान्यः पंथा विद्यतेयनाय | అని శృతి వచనం - అత్మ స్వరూపుడైన పరమాత్మను తెలుసుకోగలిగేది, ముక్తిని పొందగలిగేది ఆత్మ జ్ఞానము వల్లనే తప్ప వేరు మార్గం లేదు అన్నారు. వేద వ్యాసులవారు కూడా ఆత్మజ్ఞానం వల్లనే మోక్షప్రాప్తి సాధ్యము అని చెప్పారు.
జ్ఞానం వల్ల మాత్రమే మోక్షప్రాప్తి అని ఎట్లా చెప్ప కలుగుతారు అని ఒక సందేహము. జ్ఞానము వల్లనే మోక్షమా? కర్మానుష్ఠానము వలన కూడా సాధ్యమే కదా, జ్ఞానం లేనివాడు కూడా మోక్ష సాధన చేస్తున్నాడు కదా, జన్మ లేనిదే మోక్షము ఎట్లా కలుగుతుంది? కర్మ ఫలం అనుభవించేది, పుణ్య కర్మలనాచరించేది మోక్షసాధన కొరకే కదా అని అనేక రకములైన సందేహములు కలుగుతాయి. శ్రుతితో పాటు బ్రహ్మవేత్తల యొక్క సాక్షాత్కార జ్ఞానానుభవం కూడా అమసరణీయమే. ఉపాసన ర్వారా, కర్మానుష్థానము ద్వారా బ్రహ్మజ్ఞానం సాధకం అవుతుంది. భక్తి మార్గము, కర్మమార్గము ద్వారా మోక్షమునకు మార్గముకు సహాయపడుతుంది గాని మోక్షము సాధ్యము కాదు.
కర్మ మార్గములు నాలుగు విధాలుగా వుంటాయి. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు అని నాలుగు రకాలు. నిత్య కర్మలు అంటే ప్రతి దినమూ చేయవలసిన ఆహ్నిక విధులు, నైమిత్త కర్మలు అనగా నియమిత కాలములలో ఏదో ఒక ఫలమునుకోరి చేసే యజ్ఞయాగాది కర్మలు, నిషిద్ధ కర్మలనగా ఎట్టి పరిస్థితులలోనూ చేయకూడని కర్మలు.
నిత్య, నైమిత్తిక కర్మలను ఆచరిస్తే పుణ్యము కలుగుతుంది. వీటిని అచరించకపోతే ప్రత్యవాయం అనే పాపం ఫలం వస్తుంది. అంటే మన పూర్వ కర్మఫలం వలన కలిగిన పుణ్యములో కొంత తగ్గుతుంది. కామ్య కర్మలు అంటే కోరికలతో చేసిన కర్మలకు ఫలితం ఈ జన్మలోనే కలుగుతుంది. నిషిద్ద కర్మలను చేయనివాడంటూ లేడు. తెలిసో తెలియకో మనవలన చీమ, దోమ వంటివి చస్తున్నాయి. తెలియక చేసినా దాని ఫలితం పొందవలసి వుంటుంది. నిషిద్ధ కర్మలకు కూడా ఈ ఫలాన్ని ఈ జన్మలోనే అనుభవిస్తున్నాం.
పుణ్య కర్మలకు ఫలితముగా మోక్ష ఫలం వస్తుందనీ, మోక్షము ఫలానా విధంగా వుంటుందని ఎవరు చెప్పగలరు? మోక్షము ఊహా జనితమైన విషయం కాదు. సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మతత్త్యం తెలుసుకొనుటయే మోక్షం. మోక్షమును గురించి భగవత్పాదులు తమ భాష్య రచనలలో విస్తారంగా చెప్పారు. ఇదే విషయం ఉపనిషత్తులలో కూడా చెప్పబడినది. 
జన్మాంతరములలోని సంచిత కర్మలు అట్లాగనే వున్నాయి. మరి పుణ్యకర్మ ఫలాలు కూడా అట్లాగే వున్నాయి. నిషిద్ధ కర్మలు చేయని వారున్నారా. నిషిద్ద కర్మల వలన కలిగిన పాప ఫలమూ వున్నది. కాబట్టి కర్మ ఫలితంగా కలిగిన పుణ్యం ద్వారా మోక్షము లభించుటమనేది జరుగదు.
భగవద్గీతలో భగవానుడు చెప్పాడు 

सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रय: |
मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् ||

సమస్త కర్మలూ త్రికరణశుద్దిగా ఆచరిస్తూ వాటి వలన ప్రాప్తించే ఫలాన్ని, సమస్తభోగములను త్యజించి, భగవదర్పణం చేసిన కర్మ యోగి పరమాత్మయందే ఈశ్వరానుగ్రహంతో పరమపదాన్ని పొందుతాడు అని చెప్పాడు.
ఉపనిషత్తులలో కూడా పూర్వజన్మ సుకృతం వలన సజ్జనులైన వారికి (జ్ఞానులకు) ఎవరు సేవ చేస్తారో వారికి కర్మ ఫలం ప్రాప్తిస్తుంది. జ్ఞానులు మోక్షమునకు అర్హులు అని చెప్పబడింది. కాబట్టి శాస్త్రం చెప్పిన ప్రకారం ఆచరించి తీరాలి. దానికి విరుద్ధంగా చేయకూడదు. శాస్త్రాన్ని మార్చటానికి ప్రయత్నించకూడదు. మనకు సర్వదా శాస్త్రమే ప్రమాణము తప్ప వేరే ఏదియూ కాదు అని గ్రహించాలి.

--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.

No comments:

Post a Comment