Wednesday, November 8, 2023

శ్రీ మహాభారతం ➖➖➖✍️ 290 వ భాగం #సంసార - నావ:

 050323c1259.06/070323-3.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀290.

                 శ్రీ మహాభారతం 
                   ➖➖➖✍️
                   290 వ భాగం

#సంసార - నావ:

ఈ ప్రకారము పాపములు పోగొట్టుకున్న మానవుడు మితముగా భోజనం చెయ్యడం, ఇంద్రియనిగ్రహం, అరిషడవర్గాలకు దూరంగా ఉండడము వంటివి చేసి బ్రహ్మపదముకై ప్రయత్నించాలి. అప్పుడు మానవుడు సంసార నది ఆవలి ఒడ్డుకు చేరగలడు. బుద్ధిమంతుడు తన ప్రజ్ఞ అను నావను ఉపయోగించి సంసారమనే నదిని దాటి ఆవలి తీరము చేరగలడు. సంతోషము, భయము, కోపము లేని వాడు, బుద్ధి, ధైర్యము, అప్రమత్తత ఉన్నవాడు, ధర్మము తప్పనివాడు, ఇంద్రియ నిగ్రహము కలవాడికి నాశనంలేదు. ఒక్కోసారి మనం చేసే అధర్మకార్యాలు ధర్మంగా అనిపిస్తాయి అప్పుడు శాస్త్రములు పఠించి ధర్మనిర్ణయం చేయాలి. బుద్ధిమంతుడు జ్ఞానము సముపార్జించడానికి వాక్కును, మనస్సును నియంత్రించుకుంటాడు. అట్టివాడు వేదవిదుడైనా, వేదములు చదవకపోయినా, ధర్మాత్ముడైనా , పాపాత్ముడైనా, పైన చెప్పినపద్ధతులు పాటించిన ఈ జరామరణాలతో కూడిన ఈ సంసారాన్ని అవలీలగాదాటకలడు. యోగము అనే రధముకు సదాచారము చక్రము. ప్రాణము కాడికొయ్య. అపానము అక్షము (ఇరుసు). ఉపాయము అపాయము అనేవి నొగలు. జ్ఞానేంద్రియములు అశ్వములు. సర్వతంత్రము అనేది అశ్వములను తోలు చర్నాకోలు. త్యాగము పగ్గములు. సాధకుడు ఈ యోగము అను రధము ఎక్కి మోక్షమార్గమున పయనిస్తాడు. క్రమముగా పంచభూతములను గెలిచి, అహంకారమును పక్కకు నెట్టి, బుద్ధిని పెంపొందించుకుని ప్రకృతిసిద్ధములైన వికారములను పోగొట్టుకుని చివరకు ఈ భూమిని జయించి చివరకు యోగసిద్ధిని పొంది ప్రకాశిస్తాడు. మానవుడు తనలోని అహంకారమును జయించిన అది మనస్సును, పంచభూతములను, బుద్ధిని జయించే మార్గాన్ని సుగమంచేస్తుంది ఇదే యోగమార్గము. ఇంద్రియములను ప్రపంచవిషయముల మీదకు పోనీయక మనస్సును అంతర్ముఖం చేసి అను సంధానించడమే సాంఖ్యము అంటారు. సాంఖ్యము యోగము వేరువేరు కాదు రెండూ ఒకటే. సారంలేని సంసారముకు కారణం మమతలు, మమకారాలు. సాంఖ్యులకైనా, యోగులకైనా మమతలు వదలడం ముఖ్యము.


#భూతములలో తారతమ్యములు:

ఇక భూత్యములలో తారతమ్యములు చెప్తాను విను. భూతములు రెండు విధములు. స్థావరములు, జంగములు. స్థావరములు అంటే కదలనివి. జంగములు శ్రేష్టమైనవి. జంగములు వీర్యము, అండము, బీజము, స్వేదము మొదలైన వాటి నుండి పుడతాయి. వీటిలో రెండు కాళ్ళ జీవులు, నాలుగు కాళ్ళు, అనేక పాదములు కలిగిన జీవులు ఉంటాయి. ఈ జీవులలో రెండుకాళ్ళు కలిగిన మానవులు మేలు. ఈ మనుష్యులలో జాతి ధర్మములను పాటించే వారు మేలు. వారిలో బ్రాహ్మణులు ఉత్తములు. బ్రాహ్మణులలోవేదాధ్యయనము చేయు వారు ఉత్తములు. వేదాధ్యయనము చేయు వారిలో ప్రవచనము చేయు వారు గొప్పవారు. వారిలో ఆత్మజ్ఞానము కలవారు శ్రేష్టులు. అటువంటి వారు స్వధర్మమును పాటించేవారు, మంచి సంకల్పం కలవారు, దైవారాధకులు అయి ఉంటారు. అటువంటి వారినే బ్రాహ్మణులు అంటారు. అటువంటి వారు అందరి చేత నమస్కారములు, ఆదరము పొందుతాడు. అటువంటి వారితో సమానులు ఈ భూమి మీద ఎవరు ఉండరు. అటువంటి బ్రాహ్మణులను ఆధారం చేసుకునే ఈ ప్రపంచము ధర్మమార్గంలో నడుస్తుంది. అటువంటి బ్రాహ్మణుడు నిర్మలమైన జ్ఞానము కలిగి ఉండాలి, నిష్ఠాగరిష్టుడై ఉండాలి, తనువేదము విధించిన కర్మలను నిష్ఠతో నెరవేర్చాలి. అలాంటి వాడికి ఎలాంటి సందేహములు లేక నిర్మల మనసుతో జీవిస్తాడు. ఈ చరాచరజగత్తును సృష్టించిన మహతత్వాన్ని చేరు కోవడానికి తపసును మించిన సాధనములేదు. బ్రాహ్మణులకు మైత్రి వంటి ధర్మము మరొకటి లేదు. మైత్రీధర్మము సక్రమంగా పాటిస్తే ఇక మిగిలిన కర్మలతో పని లేదు. మైత్రీధర్మము వివేకమును ఇస్తుంది అని వ్యాసుడు శుకుడితో చెప్పాడు.


#బ్రహ్మపదము:

శుక్రుడు వ్యాసుడితో… “మునీంద్రా ! పరమ బ్రహ్మపదము పొందుటకు అవసరమైనది యజ్ఞములా ? యోగమా ? సాంజ్ఞమా ? జ్ఞానమా ? వీటిలో ఏది ముఖ్యమో వివరించండి?”  అని అడిగాడు. 

“నీవు చెప్పినవి అన్నీ మంచివే. తపస్సు, ఇంద్రియ నిగ్రహము, రాగద్వేషములు, లోభములను పక్కన పెట్టే నేర్పు, దృఢమైనవిద్య వీటి వలన కూడా పురుషుడు బ్రహ్మపదమును పొందవచ్చు. ప్రయత్నంమీద ఇంద్రియములను నిగ్రహించ వచ్చు. మనస్సును నిగ్రహిస్తే ఇంద్రియము పని చేయడము మానివేస్తాయి. అప్పుడు బ్రహ్మప్రాప్తి పొందడము సులువు. బుద్ధి మనకు కనిపించదు, వినిపించదు కాని బుద్ధివలన మనము పరమాత్మను చూడగలము తెలుసుకోగలము. వినయము, విద్య కలిగిన బ్రాహ్మణుడియందు, ఆవులందు, ఏనుగులందు, వీధికుక్కలందు, కుక్కమాంసము తినువారియందు సమదర్శనము కలవారు బ్రహ్మపదవికి అర్హులు. చరాచరజగత్తులో అన్ని జీవరాశులందు భగవంతుడు ఆత్మస్వరూపుడై వెలుగుతూ ఉంటాడు. ఆ పరమాత్మయందు అన్ని జీవరాశులు సంచరిస్తున్నాయని తెలుసుకున్న వాడు పరబ్రహ్మపదమును పొందగలడు. ఆత్మ క్షరమైనది, జీవుడు అక్షరుడు. జీవిలో మృత్యువు పొంచి ఉంటుంది కనుక క్షరమైనది. అక్షరమనగా మరాణానంతరము పొందే స్వర్గప్రాప్తి అదియే అమృతము. పండితుడైన వాడు అన్నిటినీ సమానంగా చూస్తాడు. ఈ లోకాలను కాలము శాసిస్తుంది. కాలమును జయించిన వాడు పరబ్రహ్మ పదమును పొందగలడు. ఈ శరీరము తొమ్మిది ద్వారములు కలిగిన ఒక పురము. అందులో ఆత్మ వెలుగుతూ ఉంటుంది. యోగులు ఆ ఆత్మను అక్షరము, అమృతము అంటారు.

ఆత్మతత్వమును సత్కర్మలు చేస్తూ వైరాగ్యముతో జీవించే యోగి మాత్రమే తెలుసుకోగలడు. అటువంటి యోగులకు కామము, క్రోధము, భయము, నిద్ర, లోభములు ఉండవు. యోగులు వాటిని వదిలి వేస్తారు. పండితుడు కామ సంబంధిత కోర్కెలను సంకల్పములను వదిలి కామమును జయిస్తాడు. సత్వగుణ సంపదతో నిద్రను, మోహమును జయిస్తాడు. గురువులను, పెద్దలను, పండితులను పూజించడము వలన లోభమును వదిలి వేస్తాడు. ఇంద్రియములను నిగ్రహించి కోపమును జయిస్తాడు. దృఢమైన మనసుతో భయాన్ని జయిస్తాడు. ఏ ఒక్క ఇంద్రియము అదుపు తప్పినా యోగి యొక్క ప్రజ్ఞ మొత్తము నాశనం ఔతుంది. కనుక ఇంద్రియములను అదుపులో ఉంచుకోవాలి. మనసును అదుపులో ఉంచుకోవాలి. ద్వేషించినా సన్మానించినా ఒకటిలా స్వీకరించాలి. జనావాసాలలో ఉంటూ ఇది సాధించడము అసాధ్యము కనుక జనావాసమును వదిలి అరణ్యములకు పోయి కొండగుహలలో నివసిస్తూ సాధన చేయాలి. యోగి అయిన వాడు విలువైన బంగారమును, విలువ లేని మట్టిని సమానంగా చూడాలి. కర్మమార్గమును ప్రవృత్తిమార్గమని అంటారు. ప్రవృత్తిమార్గము ఇహలోక బంధములను కలిగిస్తుంది. నివృత్తిమార్గము ఆ బంధములను విడతీస్తుంది. కనుక జ్ఞానులు కర్మమార్గమును వదిలి జ్ఞానమార్గమును అనుసరిస్తారు. కొందరు కర్మమార్గము మేలని అనుకుంటారు. వారు జనన మరణములను తప్పించజాలరు. కర్మవలన చిత్తశుద్ధి కలుగుతుంది కాని అది అవిద్య, మాయకు లోబడి ఉంటుంది. కనుక కర్మలను త్యాగము చేయుట మోక్షమునకు మార్గము” అని చెప్పాడు వ్యాసుడు.


#ఆశ్రమధర్మాలు:

శుకుడు..  “తండ్రీ ! విద్య ఎటువంటి వారికి అబ్బుతుంది? వివరించండి” అని అడిగాడు. 

“అరణ్యములో వానప్రస్థులు జీవిస్తారు. వారు భిక్షాటనతో జీవించాలి, ప్రజల మధ్యతిరగడం మానివేయాలి. మానము, అవమానము సమానంగా భరించాలి. అప్పుడు ఆధ్యాత్మ విద్య అలవడుతుంది” అని వ్యాసుడు చెప్పాడు. 

శుకుడు.. “తండ్రీ! ఎటువంటి వారికి కర్మలు విడుచుట సాధ్యము కాదు అంటారు కదా ! వారు ఏమి చేయాలి ?” అని అడిగాడు. 

వ్యాసుడు “కుమారా! బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థాశ్రమంలో ఉన్న వారు, యతులు, వారివారికి విధించిన కర్మలను నిర్వర్తించాలి. మోక్షమార్గముకు ఈ నాలుగు ఆశ్రమాలు నాలుగు మెట్లవంటివి. మనిషి ఆయుర్ధాయము శతాయుష్షుగా నిర్ధారించిన అందు 25 సంవత్సరములు బ్రహ్మచర్య ఆశ్రమంలో గురువుకు సేవలు చేస్తూ వేదవిద్య అభ్యసించవలెను. బ్రహ్మచర్యాశ్రమంలో విషయవాంఛలకు దూరంగా ఉండాలి. విద్యాభ్యాసము పూర్తిచేసుకుని గురుదక్షిణ ఇచ్చి గురువుగారి అనుమతితో వివాహము చేసుకోవాలి. గృహస్థాశ్రమంలో బందువులను ఆదరిస్తూ, అతిథిసత్కారాలు చేస్తూ, సత్యమునే పలుకుతూ, భార్యాపుత్రులను ఆదరిస్తూ, పుత్రులను విద్యావంతులను చేయాలి. ఇలా కర్తవ్యనిర్వహణ చేస్తూ మరొక 25 సంవత్సరాలు గడపాలి. తరువాత వానప్రస్థ్యం స్వీకరించి కందమూలములు తింటూ, తాపసులను సేవిస్తూ, వారికి పెట్టగా మిగిలిన ఆహారాన్ని భుజిస్తూ తపమాచరిస్తూ మరొక 25 సంవత్సరాలు గడపాలి. ఆఖరి 25 సంవత్సరాలు సన్యాసాశ్రమం స్వీకరించి కర్మలను విడవాలి. సన్యాసాశ్రమంలో తలను నున్నగా గొరిగించుకుని, ఎవ్వరితో కలహించక, వృక్షముల నీడన జీవించాలి. ఈ కాలంలో జనావాసాలలోకి వెళ్ళకూడదు. ఒంటరిజీవితము గడుపుతూ, కామ క్రోధాలకు లోబడక, స్తుతి నిందలన సమంగాస్వీకరించాలి. లభించిన దాన్ని తిని, ఎక్కడబడితే అక్కడే నిద్రపోవాలి. సకల భూతముల అందు దయకలిగి ఉండాలి. అలాంటి వాడు యతి అని పిలువబడతాడు” అని వ్యాసుడు చెప్పాడు.


#అంతర్యాగము:

వ్యాసుడు శుకునికి అంతర్యాగము గురించి వివరించసాగాడు… “కుమారా ! అంతర్యాగము చేసే యోగి తన ప్రాణములను తన అంతరాత్మలో హోమము చేస్తాడు. అప్పుడు అతనికి పాపములన్నీ తొలగి పోతాయి. ఆత్మ ఒక పక్షి వంటిది. ఆకాశంలో ఎవ్వరికీ కనిపించక ఎగురుతూ ఉంటుంది. అది గుడ్డులో నుండి పుడుతుంది. కేవలము యోగులు మాత్రమే దానిని చూడగలరు. కాలము ఒక చక్రము వంటిది, దానికి అంచులు 6 ఋతువులు, 12 మాసములు పదునైన పళ్ళుగా ఉంటాయి. కాలచక్రము విశ్వమంతా వ్యాపించి గిరగిరా తిరుగుతూ ఉంటుంది. మనశరీరంలో ఉండే జీవుడే రధము. దానికి సారధి మనసు, ఇంద్రియములు అశ్వములు. ఇంద్రియములు అనే అశ్వములు అదుపు తప్పితే రధము దారి తప్పుతుంది కనుక ఇంద్రియములను అదుపులో ఉంచుకోవడము అవశ్యము. మోక్షమును కోరు యోగి సర్వసంకల్పములు విడిచి చిత్తమును సత్వగుణము నిలపాలి, మితాహారము తినాలి. అప్పుడు గాలి లేని చోట పెట్టిన దీపంలా చిత్తము స్థిరముగా ఉండి ప్రకాశిస్తుంది. కుమారా ! శుకమునీంద్రా ! వేదాంతసారమును మధించి ఆ వెన్నను నీకు ఇచ్చాను. నీవు దానిని యోగులకు ఇవ్వు. అన్ని దానముల కంటే విద్యాదానము శ్రేష్ఠమైనది కనుక నీవు దానిని అందరికీ పంచి పెట్టు. ఇంకా నీకు ఏవైనా సందేహాలు ఉంటే ఆడిగి తెలుసుకో” అన్నాడు. 

శుకుడు…  “తండ్రీ! ఇప్పటి వరకూ విన్నదే నాకు సరిగా అర్ధము కాలేదు. కనుక నాకు ఇంకొంచము వివరించండి” అని అడిగాడు శుకుడు. 

వ్యాసుడు… “ఈ సృష్టికర్త పంచభూతములలో అంతటా తానే నిండి ఉండి వాటిని ఈ లోకములో నియోగిస్తాడు. తిరిగి ఈ పంచభూతములను తనలో లీనము చేసుకుంటాడు. ఈ కార్యము నిరంతరము సాగుతూనే ఉంటుంది.

తాబేలు తన అవయవములను తనలోకి తీసుకున్నట్లు సృష్టికర్త తనలోకి సృష్టిని తానే లయము చేసుకుంటాడు. పరమాత్మను మాయ ఆవరించినప్పుడు ఈ సృష్టి జరుగుతుంది. మాయ తొలగి పోగానే ఈ సృష్టి అంతా పరమాత్మలో లయం ఔతుంది. ముందుగా పంచభూతములు, ఇంద్రియములు, విషయములు సృష్టించబడతాయి. జ్ఞానేంద్రియములు ఐదు, మనస్సు ఆరవది, బుద్ధి ఏడవది, ఎనిమిదవ వాడు జీవుడు ఇతడే క్షేత్రజ్ఞుడుగా ప్రకాశిస్తుంటాడు. మనసులో తలంపులు పుడతాయి. ఆ తలంపుల మంచిచెడులను బుద్ధి నిర్ణయిస్తుంది. ఆ తలంపులను ఇంద్రియములు ఆచరిస్తాయి. ఈ ప్రక్రియ అంతంటికి క్షేత్రజ్ఞుడైన అంతరాత్మ సాక్షీభూతంగా చూస్తూ ఉంటుంది. సత్వంతో ఉండడము సత్వగుణ లక్షణం. ఎల్లప్పుడూ దుఃఖంతో ఉండడము రజోగుణలక్షణం. ఏ పనీ చేయక సోమరిగా ఉండడము తమోగుణ లక్షణము. ఈ గుణాల ఆధారంగా ఇంద్రియములు పని చేస్తుంటాయి. ఇంద్రియములు, విషయములు, మనసు, బుద్ధి, ఆత్మ క్రమంగా ఒకదాని కంటే ఒకటి ఎక్కువ. బుద్ధి అంతటా విస్తరించి ఉంటుంది. వినడము, చూడడము, రుచి చూడడము, వాసన చూడడము, స్పర్శించడము లాంటి పనులను ఇంద్రియముల ద్వారా బుద్ధి నిర్వహిస్తుంది. ఈ బుద్ధి ఒకసారి పొంగిపోతుంది, మరొక సారి కుంగిపోతుంది, మరొకసారి సుఖదుఃఖములు లేకుండా నిశ్చలంగా ఉంటుంది. ఈ బుద్ధి స్వభావము ఎరిగిన సాధకుడు ఇంద్రియాసక్తి వదిలి ఆత్మ దర్శనము చేసుకుంటే అతడికి సుఖము, దుఃఖము కలుగవు. అత్తిపండులో ఉన్న పురుగులు పండుకు ఎటువంటి హాని చేయవు. ఆత్మలో ఉన్న విషయవాంఛలు ఆత్మను అంటవు. సాలెపురుగు తన నుండి దారమును సృష్టించినట్లు సత్వ, రజో, తమో గుణాలు సుఖ దుఃఖములను కలిగిస్తుంటాయి. ఆత్మ వాటికి సాక్షీభూతంగా ఉంటుంది. ఆత్మ నాశనం లేనిది కనుక పురుషుడు సత్వరజోతమో గుణములను వదిలి ఆత్మానుసంధము చేసుకుంటే మోక్షము లభిస్తుంది. బ్రాహ్మణుడికి ఇంద్రియనిగ్రహము ఒక సంపద లాంటిది. ఇంద్రియనిగ్రహము కల బ్రాహ్మణుడికి భయము, శోకము, గర్వము, సంతోషము కలుగవు. మనస్సును నిగ్రహించడము, ఆత్మగురించి తెలుసుకోవడము వివేకవంతుల లక్షణము. ఈ లక్షణముతో మోక్షమును పొంద వచ్చు.


#పరమ ధర్మము:

శుకుడు… “ధర్మములన్నింటి కంటే పరమధర్మము ఏది ?” అని అడిగాడు. 

వ్యాసుడు… “ఇంద్రియ నిగ్రహము, ఏకాగ్రత, అన్నింటి కంటే ఉత్తమధర్మము. మనసుతో ఇంద్రియములను నిగ్రహించి తరువాత బుద్ధిని దానికి అను సంధానము చేయాలి. అప్పుడు పరతత్వాన్ని దర్శించ వచ్చు. మొక్కలు తమకు పూచిన పూలకు వాసన చూడ లేవు. వృక్షములు తన ఫలములను తాను భుజించదు. అలాగే అంతరాత్మ తన నిజస్వరూపమును చూడ లేదు. ఇలా ఇంద్రియ నిగ్రహంతో మనస్సును బుద్ధితో అనుసంధానము చేసి పరతత్వమును దర్శించి శాంతిని పొందాలి. మనిషి పతనానికి మూలము లోభము. దాని పుట్టుక ఎవరికి తెలియదు. లోభము అనే మడుగుకు సంకల్పము అనేది గట్టు. క్రోధము దానిలోని బురద. కోరికలు ఆ మడుగులో సంచరించే పాములు. ఆ మడుగు మోహము అనే గడ్డి, మొక్కలు, నాచుతో కప్పబడి ఉంటుంది. అజ్ఞానులు దానిని కనుగొనజాలరు. సత్యము అనే సాధనతో ఆ మడుగు నిజస్వరూపమును తెలుసుకొనగలడు. కనుక నీవు ఆ లోభముకు లోనుగాక ప్రసన్నాత్ముడవై కొండ మీద నుండి కింద ఉన్న వారిని చూసినట్లు ఈ లోకాన్ని దర్శించు. కనుక అన్ని ధర్మలలోకి ఇంద్రియ నిగ్రహము ఉత్తమధర్మము. కుమారా ! బ్రాహ్మణతత్వము వేదవేదాంగలు చదివినా, యజ్ఞయాగాదులు చేసినా లభించదు. కేవలం ప్రశాంతతతోనే బ్రాహ్మణత్వము సిద్ధిస్తుంది. పరులకు భయపడక, పరులను భయపెట్టక సమదృష్టితో జీవించే వాడే బ్రాహ్మణుడు. బంధములలో పెద్దబంధము కామము. కామాన్ని వదిలిన మబ్బు వీడిన చంద్రుడి మాదిరి ఆత్మ ప్రకాశిస్తుంది. కామాన్ని జయించి పరతత్వోపాసనా తత్పరుడైన పురుషుడు సుఖము, సమృద్ధి పొదుతాడు. నాది అన్నభావము లేకనే ఏది మనకు ప్రియము కలిగిస్తుందో, దేనిని భుజించకున్నా మనసుకు తృప్తి కలుగుతుందో, ఏది పొందకున్నా బలము కలుగుతుందో అటువంటి పరతత్వాన్ని వేదముల సాయంతో దర్శించాలి. విషయవాంఛలు, కర్మ బంధాలు, త్రిగుణాలు వదిలిన బ్రాహ్మణుడికి ముసలితనము లేదు, మృత్యువు అతడి దరిచేరదు. ఈ దేహము వేరు, అందులోని దేహి వేరు. ఈ సత్యమును వేదాధ్యయనము చేసిన ప్రశాంతచిత్తులు మాత్రమే దర్శించగలరు. సూర్యుడు నీటిలో బింబరూపములో కనిపిస్తాడు. అలాగే ఆత్మ కూడా బుద్ధిలో ప్రతిబింబ రూపములో కనబడుతుంది. సత్వగుణ ప్రధానులకు ఇది గోచరమౌతుంది. రాత్రి పగలనక సూర్యుడు నిరంతరము ప్రకాశిస్తుంటాడు. అలాగే పరమయోగికి వివేకము అవివేకము ఉండదు. నిరంతరము జ్ఞానముతో ప్రకాశిస్తుంటాడు. అతడికి ఇంద్రియములు ఉన్నా లేనట్లే. అతడు ప్రపంచంలో తిరుగుతూనే సమాధిస్తితిలో ఉంటాడు. మోహము అనే బీజము నుండి కామము అనే చెట్టు మొలకెత్తుతుంది. దానికి ఏమరుపాటు అనే నీరు పోసి పెంచుతుంటారు. ఆ చెట్టుకు ఆకులు అసూయ, కాండము అభిమానము, శోకములు శాఖలు, అనేక విధములైన చింతలు ఉపశాఖలు. పూర్వ జన్మ కర్మల ఫలితంగా ఆ చెట్టు వృద్ధి చెందుతుంది. ఆ చెట్టుకు ఆశలు అనే తీగలు అల్లుకుని ఉంటాయి. ఆ చెట్టుకు కాసిన పండ్లకై దాని పైకి ఎక్కిన వాడు ఎవరైనా నశిస్తాడు. అలాకాక త్యాగము అనే కత్తితో ఆచెట్టును సమూలంగా నరికిన వాడు సకల విధ దుఃఖముల నుండి విముక్తుడు కాగలడు.

కుమారా ! ఈ శరీరమే ఒక నగరము అయితే ఈ నగరానికి ప్రభువు బుద్ధి, మనసు మంత్రి, ఇంద్రియాలు పురజనులు, శబ్ధ, స్పర్శ, రూప, రుచి, గంధాదులు అక్కడి పురోహితులు. ఈ రాజ్యాన్ని త్రిగుణాలు అనే దొరలు పాలిస్తూ అనుభవిస్తుంటాయి. రాజైన బుద్ధి వివేకము లేక త్రిగుణాలకు బానిసైన నశిస్తుంది, జయించిన శాశ్వత సుఖమును పొందుతాడు” అని వ్యాసుడు శుకునికి చెప్పాడని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment