0920. 1-4. 120323-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*శుచిత్వము..
➖➖➖✍️
*కుశల కర్మలు అంటే మంచి పనులు. అకుశల కర్మలు అంటే చెడ్డ పనులు.*
*ప్రతి మనిషి మనస్సులో, ఆలోచనల్లో ఈరెండూ ఉంటాయి. పుట్టుకతోనే ‘వీరు మంచివారు’ ‘వీరు చెడ్డవారు’ అని విభాగించుకుని పుట్టరు. వ్యక్తిగా, సామాజికంగా పెరిగిన కొద్దీ మనలో ఈ భావాలు పెరుగుతాయి.*
*కుశల కర్మలు మనకి శాంతిని ఇస్తాయి. అకుశలాలు చివరికి దుఃఖాన్నే తెచ్చిపెడతాయి.*
*అయితే మనిషి దుఃఖంలేని కుశల మార్గంలోనే నడవడం ఏదో ఒక క్షణంలోనో, రోజులోనో జరిగే పని కాదు. ఎంత సాధన చేసి మంచిగుణాలు అలవర్చుకున్నా ఏదో క్షణంలో బుద్ధుడు చెప్పినట్లు చిటికె వేసినంత కాలంలో– అకుశలం వచ్చి ఆవహించేస్తుంది.*
*కాబట్టి మనిషి కుశల చిత్తంతో మెలగాలంటే నిరంతరం అదే ధ్యాసలో ఉండాలి, నడవాలి•*
*ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఎందరో భిక్షువులు ఎంతెంతో సాధన చేసినవారు కూడా ఆ చిటికెల కాలంలోనే దారి తప్పేవారు.*
*ఈ విషయంలో ఎందరో బుద్ధుని దగ్గరకు వచ్చి...”భగవాన్! మా చిత్తాన్ని నిలుపుకోలేకపోతున్నాం. ఏదో క్షణంలో చెడ్డ భావాలు వచ్చి పడుతున్నాయి.
వానినుండి ఎలా బైటపడగలం?” అని అడిగేవారు.*
*అప్పుడు బుద్ధుడు... “మీరు అందుకోసం నిరంతరం పది సాధనా మార్గాల్లో ఉండాలి!” అంటూ వాటి గురించి చెప్పాడు.*
*అప్రమత్తంగా ఉండటం, సోమరితనంతో గడపడం, అతిగా కోరుకోవడం, ఎంత లభించినా ఇంకా, ఇంకా కావాలి అనే అసంతృప్తి, నిరంతరం నిర్లక్ష్యంగా ఉంచే అజాగ్రత్త, ఏ విషయాన్నైనా లోతుగా గ్రహించకపోవడం వల్ల కూడా అవగాహనాలేమి, చెడ్డవారి స్నేహం, వీటితోపాటుగా జాగరూకతను నిరంతరం పెంచుకోకపోవడం చెడ్డవారిని అనుసరిస్తూ, అకుశల కర్మలే శిక్షపొందుతూ ఉంటే.. ఈ పది కార్యాల వల్ల మనిషితో అకుశల ఆలోచనలు పెరుగుతాయి. అకుశల ఆచరణలు జరుగుతాయి.*
*అలాంటి వానికి సంపద నష్టం, కీర్తి నష్టం, ప్రజ్ఞ నష్టం, సకలం నష్టం. దీనివల్ల దుఃఖం.*
*”అలాగే కుశల ధర్మాలు పెరగాలంటే ప్రమత్తతను వీడి అప్రమత్తతతో సోమరితనాన్ని వదిలి ఉండాలి.* *పట్టువదలని సాధనలో ఉండాలి. అధిక కోర్కెల్ని వదిలి, బతకడానికి సరిపడు మితమైన కోర్కెలు (అల్పేచ్ఛ) కలిగి ఉండాలి. సంతృప్తి కలిగి, జాగరూకతతో మెలగాలి. ప్రతి విషయం పైనా మంచి అవగాహన పెంపొందించుకోవాలి.*
*మంచిని చేకూర్చే మంచి మిత్రులతోనే స్నేహం చేయాలి. మంచివారిని అనుసరించాలి. మంచి కర్మల శిక్షణ పొందాలి. ఈ పది కార్యాల వల్ల మనిషిలో కుశల ఆలోచనలు పెరుగుతాయి. కుశల ధర్మాలు ఉద్భవిస్తాయి. కుశలాచరణ కలుగుతుంది. అలాంటి వారికి సంపద నష్టం కాదు. కీర్తికి నష్టం రాదు. ప్రజ్ఞ దిగజారిపోదు. దుఃఖం దరికే రాదు.”అని చెప్పాడు బుద్ధుడు.*
*ఇలా ప్రతి వ్యక్తి తనను తాను తీర్చిదిద్దుకుంటే, అది వ్యక్తికి, సంఘానికి, దేశానికి, ప్రపంచానికి మేలు అని బోధించిన తధాగత బుద్ధునికి జేజేలు!*
**************
*వేదప్రవర్తకుడైన పైలమహర్షికి ఉదంకుడను ఉత్తమ శిష్యుడు ఉండెడివాడు. అతడు బ్రహ్మతేజస్సు కలవాడు మహాతపస్సంపన్నుడు. గురుదేవతా అనుగ్రహం వలన అణిమాద్యష్టసిద్ధులు జ్ఞానము పొందిన మహానుభావుడు ఉదంకుడు.*
*ఒకరోజు గురుపత్ని అతనికి ఒకకార్యమును అప్పచెప్పినది “నాయనా! మనదేశ మహారాజైన పౌష్యుడు ధర్మాత్ముడు. ఆయన ధర్మపత్ని ఉత్తమురాలు. ఒక వ్రతము చేయటానికి నాకు ఆ సాధ్వి కుండలాలు కావాలి. ఆమెను అర్థించి అవి తీసుకొనిరా”.*
*గురుపత్ని ఆజ్ఞను శిరసావహించుటకై ఉదంకుడు వెంటనే ధర్మాత్ముడైన పౌష్యమహారాజు వద్దకు బయలుదేరినాడు. దారిలో అరణ్యమార్గములో వెళుతుండగా ఒక మహావృషభము మీదనున్న దివ్యపురుషుని చూచినాడు. అతడు సూర్యుని వలె వెలిగిపోతున్నాడు. ఆ దివ్యపురుషుడు ఉదంకునికి అనుగ్రహముతో పవిత్రమైన గోమయమును ఆరగించుటకు ఇచ్చెను. అమృతప్రాయమైన గోమయమును భుజించి గురుపత్ని ఆజ్ఞ త్వరగా నెరవేర్చుటకై ఆ మహాపురుషుని వద్ద సెలవు తీసుకొని పౌష్యుని రాజ్యమును చేరుకున్నాడు.*
*పౌష్యుడు ఉదంకునికి యథావిధి సత్కారాలు చేసి రాకకు కారణమేమియో తెలుపుమని ఉదంకుని ప్రార్థించినాడు.*
*ఉదంకుడు తన గురుపత్నిగారి ఆజ్ఞను రాజుకు తెలిపినాడు. “ఆహా! లోక శ్రేయస్సును కోరే మీవంటి తాపసులను సేవించుటకంటే అదృష్టమేమున్నది? మహానుభావా నా రాణి వద్దకు వెళ్ళి నా మాటగా చెప్పి కుండలములను తీసుకొనుము.” అని పౌష్యుడు చెప్పినాడు.*
*వెంటనే ఉదంకుడు మహారాణిగారి మందిరమును చేరుకున్నాడు. కానీ ఆయనకు ఎక్కడా పౌష్యరాణి కనబడలేదు! తిరిగివచ్చి “రాజా! నాకు మహారాణి కనబడలేదు. నీవే ఆ కుండలములను తెప్పించి ఇవ్వు” అని అడిగినాడు.*
*అప్పుడు పౌష్యమహారాజు ఇలా అన్నాడు “భూవినుత! నీవంటి త్రిభువన పావనుని అశుచివి అని ఎట్లా అనగలను? నా రాణి మహాపతివ్రత! కావున అశుచులకు కనబడదు”.*
*ఉదంకుడు ఎందులకు తనకు అశుచి వచ్చినదో ఆలోచించినాడు. తాను గురుపత్నీ కార్యమును త్వరగా పూర్తిచేసే తొందరలో ఆ మహాపురుషుడు ఇచ్చిన గోమయాన్ని భుజించిన తరువాత ఆచమించలేదని గుర్తుకు వచ్చినది. వెంటనే కాళ్ళూ చేతులు అన్ని కడుక్కుని కేశవ నామాదులతో ఆచమనము చేసి శుచియై మహారాణి అంతఃపురమునకు వెళ్ళినాడు. అక్కడ యథాస్థానములో మహారాణిని చూసి ఆమె పాతివ్రత్య మహాత్మ్యమునకు ఆశ్చర్యపోయి… “మహారాణీ! మా గురుపత్ని వ్రతార్థము మీ కుండలములు కోరి వచ్చినాను” అని ప్రార్థించినాడు.*
*ఆ పతివ్రతామతల్లి తన కుండలములు ఇట్టి తాపసులకు ఉపకరిస్తున్నాయని సంతోషించి ఉదంకునకు కుండములను ఇచ్చి పంపివేసినది.*
*శుచిత్వము సత్పురుషుల సందర్శనమునకు ప్రథమ సోపానము. ఉదంకుడు భోజనము తరువాత తొందరలో ఉండి కాళ్ళుకడుక్కుని ఆచమించనందున ఎంతగొప్పవాడైనా ఆయనకు పతివ్రత అయిన పౌష్యరాణి కనబడలేదు.*
*కావున మనమన్ని వేళలా ముఖ్యంగా సత్పురుష, దైవ సందర్శనమునకు వెళ్ళునప్పుడు శుచిగా ఉండవలయును.*
*ఇదే కారణముగా అర్జునుడు, అశ్వత్థామ బ్రహ్మాస్త్రప్రయోగమునకు ముందు శుచులై మంత్రప్రయోగము చేసినారు. బకాసురుని యుద్ధమునకు ముందు భీమసేనుడు ఆహారము భుజించి శుచిఅయ్యి తరువాతనే యుద్ధముచేసినాడు.*
*అవంతీరాజు, విక్రమార్కుడు పుష్కరిణిలో స్నానము చేసిన తరువాతనే కాళీ ఆలయములోకి ప్రవేశించినారు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment