@ కళా సాధన @
"నా పై దయతో ఈ వంట గది ఒక్కటీ వదిలేసారు అన్నయ్యా! మిగిలిన గదులు నిండా పుస్తకాలే"
సముద్రం అనే కథలో పాపినేని శివశంకర్ ఒక పాత్ర నోట పలికించిన మాటలివి
దాదాపుగా పుస్తక ప్రేమికులు ఉన్న ప్రతి ఇంటిలో ఎవరో ఒకరి నోటి వచ్చే మాటలే ఇవే.....
మర్చిపోయాను.... ఇంకో మాట కూడా చాలా తరుచుగా వినిపిస్తుంది ఆ ఇళ్ళలో
"అసలు అలా పుస్తకాలు చదివడం వల్ల ఏమొస్తుంది!" అని
గాలి పీలిస్తే ఏమొస్తుంది
ప్రాణం నిలుస్తుంది
నీరు తాగితే ఏమొస్తుంది
జీవం వస్తుంది
ఆహారం తీసుకుంటే ఏమొస్తుంది
బలం వస్తుంది
కదా.....!
పుస్తకాలు చదివినా అంతే....
మనస్సు తెప్పరిల్లుతుంది
హృదయపు ఆర్తి చల్లారుతుంది
మెదడు వికశిస్తుంది వివేకంతో....
జవజీవాలతో తొణికిసలాడుతుంది చిత్తం
రుచి చూసిన వాడికే తెలుస్తుంది
సాహిత్య పఠనంలోని రసానందం
కాదు కాదు చితానందం
"మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీవీచికల దూగు
రాయంచ చనునే తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు
కోయిల జేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక
మరుగునే సాంద్ర నీహారములకు
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పాన విశేష మత్త
చిత్త మేరీతి నితరంబు జేర నేర్తు!
వినుత గుణశీల, మాటలు వేయునేల?
అంటాడు పోతన తన భాగవతంలో భగవద్ సాన్నిధ్యం లోని పరమానందపు అంతిమ అవస్థ గురించి.
నేనూ అదే అంటాను పుస్తక పఠనం లోని
రసానందపు అంతిమ స్థితి గురించి
ఏమొస్తుందా పుస్తకాలు చదివితే
అర్థం లేనివనిపిస్తుంది అహం స్వార్థం.
పెల్లుబుకుతుంది విశ్వ మానవాళి పై ప్రేమ
హంగులు ఆర్భాటాలు ఆడంబరాలు వ్యర్థం అనిపిస్తుంది. మానవత్వం మనిషితత్వం చిగురు తొడుగుతుంది నీలో నాలో మనలో
జీవించడం ఒక కళ... ఆ కళా సాధనే పుస్తక పఠనం
సేకరణ.
....వినయశ్రీ.
No comments:
Post a Comment