*365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో*
♥️ *కథ - 65* ♥️
*చదివే ముందు... చాలా సున్నితంగా కళ్ళు మూసుకోండి... మీ దృష్టిని మీ హృదయం మీదకి* *తీసుకురండి... మీ హృదయంలో తల్లి ప్రేమను అనుభూతి చెందండి.... మెల్లగా కళ్లు తెరిచి చదవడం ప్రారంభించండి...*
*మరుపును కలిగించే మందు*
నాకు ఒక మందుల దుకాణం ఉంది, ఆ రోజు దుకాణం చాలా రద్దీగా ఉంది. నేను కస్టమర్లకు మందులు ఇస్తూండగా, దుకాణానికి కొంచెం దూరంలో చెట్టు కింద ఒక వృద్ధురాలు నిలబడి ఉంది. నేను రెండు మూడు సార్లు ఆమెను చూసినప్పుడు, ఆమె నా దుకాణం వైపే చూస్తూండటం నేను గమనించాను.
నేను కస్టమర్లకు మందులు ఇస్తూనే ఉన్నాను, కానీ ఆ వృద్ధురాలి గురించి, ఆమె అక్కడ ఎందుకు నిలబడి ఉంది, ఇటువైపే ఎందుకు చూస్తోంది అన్న ఆసక్తి కలిగింది.
కస్టమర్లు తక్కువగా ఉన్నప్పుడు, నేను నా షాప్లో పనిచేసే అబ్బాయికి షాప్ కౌంటర్ అప్పగించి, ఆమె వద్దకు వెళ్లాను. ఆమెను ఇలా అడిగాను, "ఏమైంది అమ్మా, మీకు ఏదైనా కావాలా? చాలాసేపటి నుండి మీరు ఇక్కడ నిలబడి చూస్తున్నారు. బయట చాలా ఎండగా ఉంది, అందుకని మీకు అవసరమైనది ఏమైనా కావాలేమోనని అడుగుతున్నాను."
వృద్ధురాలు మాట్లాడటానికి కొంచెం సంకోచించింది.
కాస్త ధైర్యం తెచ్చుకుని ఆమె మాట్లాడటం ప్రారంభించింది, “నాయనా, నాకు ఇద్దరు కొడుకులు. ఇద్దరూ వేరే నగరంలో ఉంటున్నారు. ప్రతి వేసవి సెలవుల్లో, వారు మమ్మల్ని కలవడానికి తమ పిల్లలతో వస్తారు.
అయితే ఈసారి మాత్రం వాళ్ళు ఎక్కడో పర్వతప్రదేశాల్లో సెలవలు గడపాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈసారి వారు మమ్మల్ని కలవడానికి రారు నాయనా. నాకు ఈ విషయం నిన్న సాయంత్రమే తెలిసింది. నిన్న రాత్రి దీని గురించి ఆలోచిస్తూ చాలా అశాంతికి గురయ్యాను.... ఒక్క నిమిషం కూడా నిద్ర పట్టలేదు.
ఈరోజు మీ షాపులో మందులు కొందామని అనుకున్నాను. కానీ షాపులో జనాన్ని చూసి, ఇక్కడే వేచి ఉండి, షాపులో ఎవరూ లేనప్పుడు మందు గురించి అడగాలని అనుకుంటున్నాను.”
"అర్ధమయిందమ్మా ... చెప్పు తల్లీ.. నీకు ఏ మందు కావాలి? నేను తెచ్చిస్తాను!" అని అన్నాను.
‘‘పిల్లల్ని మరిచిపోవడానికి మందు ఏమైనా ఉందా ...?
ఉంటే తీసుకురా నాయనా..... భగవంతుడు నిన్ను ఆశీర్వదిస్తాడు..." అని అంది.
ఆపై మాటలు వినడానికి నాకు ధైర్యం చాలలేదు. నా చెవులు మొద్దుబారిపోయాయి. నేను ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా దుకాణానికి వైపుకి తిరిగాను.
ఎందుకంటే వృద్ధురాలికి కావాల్సిన మందు ఆమె కుమారుల వద్ద మాత్రమే దొరుకుతుంది, నావద్ద దొరకదు. ఇది ప్రపంచంలో ఏ మందుల దుకాణంలోనూ దొరకదు..
ఇప్పుడు నేను కౌంటర్ వెనుక నిలబడి ఉన్నాను.
నా మనసులో ఆలోచనల తుఫాను, ఆ చెట్టుకింద నిలబడి ఉన్న తల్లిని కళ్ళెత్తి చూడడానికి కూడా ధైర్యం చేయలేకపోయాను. నా దుకాణం మొత్తం ఆ అమ్మకి పనికిరాకుండా పోయింది.. ఎంత నిస్సహాయతను అనుభవించానో ఆ భగవంతుడికే తెలుసు!
ఈ వేసవి సెలవుల్లో ఎవరైనా తమ సొంతూరికి వెళ్లకుండా వేరే ప్రదేశానికి వెళుతున్నారని నేను విన్నప్పుడల్లా ఆ వృద్ధురాలి తపన నన్ను ఇప్పటికీ బాధిస్తుంది.
♾️
*అనుబంధం లేకుండా ప్రేమించడం నేర్చుకోండి, ఎందుకంటే అనుబంధం మనల్ని బాధపెడుతుంది, ప్రేమ కాదు. 🌼*
*చారీజీ*
హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
HFN Story team
No comments:
Post a Comment