ధర్మాచరణ వలన ప్రయోజనం
ధార్మిక జీవితం సాగించేవారికి ఒడిదుడుకులను ఎదుర్కోవడం, అలానే అధర్మాన్ని అనుసరించేవారు సుఖంగా జీవించటం మనం చూస్తుంటాం. అందుకని ధర్మాచరణ వలన ప్రయోజనమేమిటని కొందరు ప్రశ్నిస్తుంటారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ధర్మాన్ని అనుసరించే వారికి చివరికి బాధలు, కష్టాలు తొలగిపోయి విజయం, సుఖమయమైన జీవితం లభిస్తుంది. అలాగే అధర్మంగా ప్రవర్తించే వారి సంతోషం తాత్కాలికమే. చివరికి వారికి దుఃఖం కలుగ చేస్తుంది.
శ్రీరామచంద్రునికి అరణ్యవాస సమయంలో కష్టాలు తప్పలేదు. కాని చివరికి శత్రువును వధించి, చక్రవర్తిగా పట్టాభిషిక్తుడై అనేక సంవత్సరాలు పేరు ప్రఖ్యాతులతో జీవించాడు. అందుకు విరుద్ధంగా రావణాసురుడు మొదట్లో సుఖాన్ని అనుభవించినా చివరికి నాశనమయ్యాడు. అంతేకాదు, శాసశ్వతంగా అపఖ్యాతి పాలయ్యాడు. అందువలన ధర్మం మాత్రమే విజయాన్ని పొందుతుంది, అలానే అధర్మం అపజయం పాలవుతుంది.
प्रायो दुरन्तपर्यन्ताः संपदोपि दुरात्मनाम् |
भवन्ति हि सुखोदर्काः विपदोपि महात्मनाम्
దురాత్ముని సంతోషం దుఃఖంగానే ముగుస్తుంది. అయితే మహాత్ముడు మొదట్లో అనుభవించే దుఃఖం చివరికి సంతోషంగానే ముగిసి తీరుతుంది. మంచివాని కష్టం, దుర్గార్గుని సుఖం రెండూ కూడ తాత్కాలికమే. అందువలన ఒక సందర్భంలోని పరిస్థితులను ఆధారంగా తీసుకుని ధర్మాధర్మ ప్రవర్తనల ప్రభావాలపై తీర్పు చెప్పకూడదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అధర్మమార్గాన్ని వీడి ధర్మమార్గాన్నే అందరూ అనుసరించాలి.
हर नमः पार्वती पतये हरहर महादेव ||
- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.
No comments:
Post a Comment