Wednesday, December 20, 2023

**** "ఆడు"వారు కాదు, "ఆడించేవారు" !

 "ఆడు"వారు కాదు, "ఆడించేవారు" !
💐💐💐💐💐💐💐💐💐💐💐

పొద్దున్నే లేచి, మావూలుగా...
నా "ఎక్స్ పోర్ట్ - ఇంపోర్టు" బిజినెస్ లో పడ్డా...

అంటే అదేదో పెద్ద వ్యాపారం అనుకునేరు... "హస్తభూషణం"..అదే, సెల్ ఫోను, చేతిలో పట్టుకుని, వాట్సాప్ లోంచి ఫేస్ బుక్ లోకి, దీంట్లోంచి - దాంట్లోకి, 
చేసే ఎత్తిపోతల పథకాన్నే, మా ఊళ్ళో...
"ఎగుమతి - దిగుమతి వ్యాపారం" అంటాం !

దమ్మిడీ సంపాయించేది లేదు గాని, రోజంతా తెలీకుండానే గడిచిపోతుంది ! 

ఇంట్లోవున్న సాఫ్ట్ వేర్ ఉజ్జోగులు, సాయంత్రం 
ఏ ఐదింటికో, ఆరింటికో, డూటీ దిగిపోతారు కానీ...
నేను రిటైరయ్యాక, చేస్తున్న ఈ "వర్క్ ఫ్రం హోం" 
ద్వారా చేసే ప్రజాసేవ వల్ల, మనకి మాత్రం, రాత్రి పదకొండు దాకా "ఓవర్ టైం" తప్పదు...ఎటొచ్చీ డబ్బులిచ్చేవాడే లేడు !

💐💐

సరే మనం సోష వచ్చేదాకా, సోషల్ మీడియాలో 
చదివి, చూసి, విని, సంపాదించిన లోకజ్ఞానాన్ని కొంతైనా నా అర్ధాంగికి పంచుదామని వంటింటి ప్లాట్ఫారం దగ్గిర బిచానా వేశా...

"ఏంటీ, మళ్ళీ కాఫీ కావాలా ?"

"నీ చేత్తో ఏవిచ్చినా..."

"వెయిట్, వెయిట్" అన్నట్టు అరచేత్తో మూకాభినయం చేసింది. 

"ఇది విన్నావా ?" అని మొదలెట్టి, ఆరోజు పొద్దున్నించీ నేను సంపాదించిన రాజకీయ, సామాజిక, సినిమా, క్రీడారంగ, ఆరోగ్య, పరిజ్ఞాన విషయాలన్నిటినీ లుంగచుట్టి, ఆవిడకి చెప్పెయ్యాలని నాకు ఒకటే ఉబలాటం !

మళ్ళీ వంటలు, భోజనాలు అయిపోయాక, తను 
తన ట్యాబ్ పట్టుకుని, గదిలో తపస్సులోకి వెళ్ళిపోయిందంటే, నాక్కూడా తన కాల్షీటు దొరకదు !

ఆ ట్యాబ్ నిండా, చీరలు - నగల ఆన్ లైన్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్లు, ఆయుర్వేద భిషక్కుల సశస్త్ర దండయాత్రలు, దగ్గూ, రొంపా దగ్గిర్నించీ, కాన్సర్ దాకా ఏది, ఎప్పుడు, ఎందుకు, ఎలా వస్తుందో, వాటికి మొగుళ్ళు ఎంతవరకూ కారకులో, విడమర్చి చెప్పే, అల్లోపతీ డాక్టర్లూ, ముక్కోటి దేవతల స్తోత్రాలు, రంగురంగుల అమ్మవార్ల బొమ్మలూ, దండకాలు, చాగంటి, సామవేదం వంటి వారి ప్రవచనాలు, అక్కడక్కడ, మిరపకాయ బజ్జీల మీద, గురక మీద, గరికపాటి వారి పజ్జాలు, మా పిల్లల, మనవల ఫొటోలు, వీడియోలు, లెక్కకు మిక్కిలిగా, దండిగా, మెండుగా ఉంటాయి. మళ్ళీ సాయంత్రం 'టీ టైము' దాకా, బయటికి రాదు. మజ్జలో ఓ కునుకు మామూలే !

అంచేత, ఇలా తను వంట చేసుకుంటున్నప్పుడే తగులుకుంటే, అక్కడే కూచుని, మన రాజకీయ,
ఆర్థిక, సామాజిక విశ్లేషణలన్నీ ఊదరగొట్టేస్తే, 
ఓ పనైపోతుంది..మనకీ కడుపు నొప్పి తగ్గిపోతుంది !

పాపం, అన్నీ వింటున్నట్టే ఉంటుంది, ఎంత మేరకు 
ఆ చెవుల్లోంచి బుర్రలోకి వెడతాయో తెలీదు !
కొబ్బరికాయ పెద్దదిగానే వుంది, లోపల గుంజు 
ఎంతుందో తెలీట్లేదు ! కురిడీ ఐపోయిందేమో కూడా...
😛😛

"అయిననూ, పోయి రావాలె హస్తినకు" అన్నట్టుగా, మొన్న జరిగిన ఎన్నికల్లో ఏఏ పార్టీలు, ఏఏ హామీలిచ్చాయో, ఎవరికి ఎంతెంత బలం ఉందో, 'ఎగ్జిట్ పోల్స్' ఏమి చెప్పాయో, చివరాఖరికి ఎవరు గెలిచారో, 
ఏ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయ్యాడో దగ్గిర్నించీ, 
ఆ రోజు చదివిన జోకులు, సినిమా కబుర్లదాకా..అన్నీ ఛడా - మడా చెప్పేశాను.

కడుపుబ్బరం కొంత తగ్గి, లుంగీ కొంచెం టైటుగా బిగించాల్సొచ్చింది !

అన్నిటికీ తల ఊపుతూనే ఉంది.
"అబ్బా...", "అలాగా ?.., "అబ్బో...", "ఎందుకు ?" "ఏమిటి?", "ఎలా ?" లాంటి హావభావాలు తన ముఖకవళికల ద్వారా 'మైం' చేస్తూనే ఉంది.

"చెప్పేవాళ్ళకి..వినేవాళ్ళు లోకువ" కదా ?
పైగా, వినేవాళ్ళు ఆసక్తిగా వింటుంటే, రెచ్చిపోడం అలవాటైపోయింది ! "హరికథా పితామహుడు"  
ఆదిభట్ల నారాయణ దాసునైపోతా !
🎻🎻🎻🎼🎼🎼

ఇంక నేను పులైపోయాను. దేశానికి స్వాతంత్రం 
వచ్చిందగ్గిర్నించీ, ఇప్పటిదాకా..దేశానికి ఎవరెవరు ఏవేంజేశారో...ఏవేంచెయ్యలేదో పూసగుచ్చాను.

💐💐

"నా వంట ఐపోయింది, మీరు స్నానం చేసొచ్చేస్తే, వడ్డించేస్తాను. ఇద్దరం కలిసి భోంచేసెయ్యచ్చు, 
త్వరగా రండి" అంది.

ఓహో...నేను పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ చేసిందగ్గిర్నించి, 
లంచ్ టైం దాకా, "ఉపన్యాసకేసరిని" 
("ఉపన్యాసానికే..సరి" ట !) ఐపోయానన్నమాట !

ఔన్లే, మన వాగ్ధాటికి తగ్గ, భరించగలిగిన, సమ ఉజ్జీ
"శ్రోతలు కావలెను", కదా !

'ఇప్పుడు ఈవిడ దొరికిందిగా, అందుకే...అలా...
అదన్నమాట !' అని మీసాలు సవరించుకున్నాను.
😎😎

💐💐

"క్యాబేజీ కూర చాలా బావుందోయ్, నోట్లో వేసుకుంటే కరిగిపోతోంది. పనసపొట్టు కూర్లాగ, ఆవపెట్టి చేస్తే, అదుర్స్ ! ఎంతైనా నువ్వు భలే మెత్తగా తరుగుతావు, రుచిగా కూడా చేస్తావు..." అన్నాను.

అటువైపునించి పెద్దగా స్పందన రావట్లేదు !

వంట, రుచులు ఎలా వున్నా, కొంచెం పొగడాలనీ,
కొత్తచీర కట్టుకొచ్చినప్పుడు, 'వావ్, సూపర్' అనాలనీ, మా గురువుగారికి వాళ్ళ గురువుగారు చెబితే, ఆయనొచ్చి నాకు చెబితే, నేనిక్కడ యథాశక్తి ప్రయోగిస్తున్నానన్నమాట !
😌😌🤫🤫

"క్యాబేజీ, ఉల్లిపాయలు, కేరట్టూ తరిగింది మీరే..
నేను కాదు ! గుర్తులేదా ?"

"ఏంటీ..నేనా..తరిగానా..ఎప్పుడూ..ఎక్కడా..ఎలా, 
హౌ ?" అని హాశ్చర్యపోయాను !
😱😱

"తమరు రాజకీయ పురాణం మొదలెట్టి, మొదటి అధ్యాయంలో వుండగానే, క్యాబేజీ, ఉల్లిపాయలు, కేరెట్లూ, కూరల బల్ల, పెద్ద చాకు, ఇచ్చాను...
పదో అధ్యాయం పూర్తయ్యేలోపు, అన్నీ చక చకా తరిగేశారు, గుర్తులేదా ? అయినా..మీరు 'ట్రాన్స్' లోకి వెళ్ళిపోయి, నార్త్ అమెరికా నించి నార్త్ కొరియా దాకా ప్రయాణం చేసొచ్చేలోపు, క్యాబేజీ, ఉల్లిపాయలు, కేరెట్లూ తరగడం అయిపోతుంది కదాని, మీకు అప్పగిస్తే..కేబేజీని పనసపొట్టు కొట్టినట్టు 'ఖైమా' కొట్టేస్తారు..కళ్ళూ -ముక్కూ తుడుచుకుంటూనే, ఉల్లిపాయల్ని చీల్చి ఛండాడేస్తారు..
కేరెట్లని టకటకలాడించేస్తారు..నాకూ ఓ పనైపోతుంది కదాని, మీముందు పెడుతుంటాను. నాకసలే ఆ క్యాబేజీ, కేరెట్లూ, తరగాలంటే, వేళ్ళు నొప్పులు, ఉల్లిపాయలు తరగాలంటే, చిరాకు కూడాను ! అంతకీ, టమేటాలు మాత్రం నేనే తరుక్కుంటాను." అంది !!!

నేను తెల్లమొహం వేసి, "నేను 'ట్రాన్స్' లో ఉండగా 
ఇంకేం చేయించావ్, నా చేత ?" అన్నా.

"మీకు అలవాటేగా, ఫ్రిజ్ లోంచి సగం పాడైపోయిన కొత్తిమీర, సగం ఎండిపోయిన కరివేపాకు, పచ్చిమిరపకాయలు తెచ్చి మీ ముందు పెడతాను...

మీరు జింపింగ్ ని తిట్టి, వాడెవడో సింగ్ ని పొగుడ్తూ, అవన్నీ బాగు చేసి, ఒబ్బిడిగా కవర్లో వేసి, పాడైన వాటిని ట్రాష్ లో పడేసి, పచ్చిమిరపకాయలకి ముచికిలు కూడా తీసి, నీట్ గా ఫ్రిజ్జిలో పెడతారు, ఐనా, మీకు తెలీదా...ఏంటి, మీరు మరీనూ... ?"

"నువ్వు నా ప్రవచనాలు వింటున్నావో, లేదో గాని,
నాచేత ఇవన్నీ చేయిస్తున్నావన్నమాట ! 
బహుశా, నా ఈ తెలివితేటలు చూసే, మీ నాన్న,
నీకోసం నన్ను సెలెక్ట్ చేశాడు !"

"మళ్ళీ మా నాన్న మాటెత్తితే బావుండదు.."

"సరే సరే...ఇంతకీ రెండు గంటలపాటు నేను చెప్పిన వాటిలో నీకు అర్థమైన పోయింట్లు, రెండు మూడు ఒదులు..."

"ఏముంది, ఒకటి...బంగారం ధర తగ్గింది, 
రెండు..రేవంత్ రెడ్డి మా అందర్నీ బస్సుల్లో ఉచితంగా పుట్టింటికి పంపిస్తానన్నాడు..."

"ఆ రెండేనా, నీ బుర్రలోకి వెళ్ళినవి ?"

"హంసలాగా నీళ్ళు ఒదిలేసి, పాలు మాత్రమే తాగమన్నారు, పెద్దలు. మిగిలిన చెత్త విషయాలు నాకెందుకు ? మా అమ్మని, అక్కల్ని చూసి చాల్రోజులయింది. రేపు నన్ను బస్టాండ్లో దింపండి చాలు ! వాళ్ళందర్నీ చూసి, వారం రోజుల్లో వచ్చేస్తా.. ఇల్లు జాగర్త !"

"మరి ఇంట్లో వంటా - వార్పూ ?"

"అయ్యో..దానికేం భాగ్యం ?  
మీరా..నడిచే విజ్ఞాన సర్వస్వం..మీ పిల్లలా...
కొండమీద కోతినైనా, ఆన్ లైన్లో పురమాయించి తెప్పించగల సమర్థులు ! ఇంక దేనికి లోటు ? నేను, ఓవారంరోజులపాటు, ఆర్జిత శలవుమీద వెళ్ళినా, పర్లేదు...ఏ లోటూ రాదు...ఆల్ ది బెస్ట్ !"

"😲😲😲😶😶😶🤐🤐🤐"

"మీరు 'ఆడు' వారు కాదు, బాబోయ్..ఆడించేవారు !"
అని స్వగతంగా అనుకుని, "నా పేరు, 'వీరభద్రయ్య' కాదు, ఒట్టి 'బద్రయ్యే', 'బ' కి ఒత్తు లేదు..." అనే పాత "దొంగరాముడు" సినిమాలో రేలంగి డైలాగ్ గుర్తు తెచ్చుకుని, మీసాలు కిందకి పెట్టుకున్నాను !
😞😞

వారణాసి సుధాకర్.
💐💐

No comments:

Post a Comment