Friday, December 22, 2023

నేను పోతే.......?

 *నేను పోతే.......?*

'భోజ మహారాజు ఒకనాడు తన ఆస్థాన పండితులతో
"మోక్షానికి పోగలిగే వాడెవ్వడు?" అని ప్రశించాడట.

యజ్ఞయాగదులు చేస్తే మోక్షానికి పోవచ్చునని కొందరు,
' జ్ఞానం పొందితే పోవచ్చునని కొందరు,
భక్తితో పోవచ్చునని కొందరు, మంచివారితో స్నేహం చేస్తే పోవచ్చునని కొందరు ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పసాగారు.

అదే ఆస్థానంలో ఉన్న మహాకవి కాళిదాసు లేచి "నేను పోతే పోవచ్చు" అని అన్నాడు.

ఆ మాట తక్కిన వారికి కోపం తెప్పించింది.
"మాకు లేనిది ఏమిటి? కాళిదాసుకు ఉన్నది ఏమిటి? అతనొక్కడే మోక్షానికి పోతానంటాడేంటి? అని చిరాకు పడ్డారు.
.
ఇతడేనా మోక్షానికి పోయేవాడు" అంటూ ఆరోపణలు కూడా మొదలయ్యాయి.

భోజుడు కాళిదాసు వంక ప్రశ్నార్థకంగా చూశాడు.

అప్పుడు కాళిదాసు లేచి "మహాప్రభూ! "నేను" "నేనే" అనే అహంకారం, గర్వం పోతే, ఎవడైనా సరే మోక్షానికి పోవచ్చు అన్నాను..

అంతేగాని నేను పోతానంటూ చెప్పడం నా ఉద్దేశ్యం కాదు" అని వివరించాడు.

'భోజ మహారాజుతో సహా సభాసధులందరూ కాళిదాసుని మెచ్చుకున్నారు.

మిత్రులారా...
 దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది మనిషి ఎప్పుడైతే "నేను" "నేనే" అనే గర్వాన్ని,  అహంకారాన్ని వదిలేస్తాడో అప్పుడే భగవంతుడిని చూడగలడు,  భగవంతుడిని చేరుకోగలడు...
ఈ చిన్న విషయాన్ని మర్చిపోయి నేను అన్ని పూజలు చేశాను, నేను ఇన్ని వ్రతాలు చేశానని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు దయచేసి అవి మానండి..
 అప్పుడే జీవితం బాగుంటుంది.🙏

No comments:

Post a Comment