ధ్యానం... ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నతమైన పదం, ప్రక్రియ. ఏ సాధకుడైనా, ఏ రకమైన సాధన చేసినా అతడు చేసి తీరవలసిన సాధన ధ్యానం. క్రమ పరిణామంలో అంచెలంచెలుగా స్థాయి పెంచుకుంటూ చేరుకోవలసిన శిఖరం ధ్యానం. ఆ తరవాత ధ్యానం ద్వారా సాధనకు అతీతమైన సమాధి స్థితిలోకి వెళ్లిపోవడమే. మరి ఆ ధ్యానాన్ని ఎలా అందుకోవాలి, ఎలా సాధన చేయాలి, అసలు ధ్యానమంటే ఏమిటి? ఆధ్యాత్మికమార్గంలో సాధకులకు అందని ద్రాక్షలా ఊరిస్తూ, అందుకోక తప్పదని శాసిస్తుందది.
గురువు మంత్రోపదేశం చేస్తాడు. సాధనకు, గమ్యానికి మార్గం చూపిస్తాడు. గమనం మాత్రం మన బాధ్యతే. తండ్రి కుమారుణ్ని పట్టుమని కొన్ని అడుగులు మాత్రమే వేయిస్తాడు. మరిన్ని అడుగులు తోడుంటాడు. కింద పడతాడేమోనని నిఘా పెడతాడు. ఆ పై వదిలేస్తాడు. గురువూ అంతే. జపం చేయమంటాడు. ధ్యానం చేయమంటాడు. మరెన్నో యోగాలు, యాగాలు... సరే. అన్నీ ఒక క్రమపద్ధతిలో, కొన్ని క్రియలకు ప్రక్రియలకు లోబడి ఉంటాయి. మరి ధ్యానం మాటేమిటి? కొంత సంక్లిష్టమైన అంశం. అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్నా ఆచరించటం అంత సులభమేమీ కాదు.. ఆదిత్యయోగీ..
కళ్లు మూసుకుని కుదురుగా కూర్చోవటం ధ్యానం కాదు. కేవలం ఆలోచనలను ఆపటమూ ధ్యానం కాదు. ధ్యానానికి కూర్చున్న ఆ క్షణాల్లో మన మనోస్థితి, దాని నిశ్చలస్థితి, ధ్యేయ వస్తువుపట్ల మక్కువ, ఆర్తి, దాన్ని కూడా అధిగమింపజేసే ధ్యాన నిమగ్నత... ముఖ్యం! అందుకు ఎంతో ప్రయత్నం, మరెంతో పరిశ్రమ కావాలి. ధ్యానం మాదిరి, ధ్యానమనేది మనకలవడే క్షణాల కోసమే ఈ వేదన, శోధన, మధన. యుగాలు, జన్మాంతరాల తపోసాధన ఆ క్షణాల కోసమే.
కానీ ఎలా? అందరూ ఊహిస్తున్నట్లు సాధకులు కూర్చునేది, కూర్చున్నంతసేపు చేసేది ధ్యానం కాదు. ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ- ఇవేమీ కాదు. అవన్నీ దానికై ప్రయత్నం, శోధన, ప్రసవ వేదన. మరి ఏది ధ్యానం? ఇది కాదు- మరేది? అది ఏదైనా అదెలా? మనం ధ్యానానికి ఏ పద్ధతిని ఎన్నుకున్నా మనసు సహకారం చాలా అవసరం. మనసును మచ్చిక చేసుకోవడం, మనసును నియంత్రించటం, తగిన స్థానంలో నియమించటం... పెళ్లి ఇష్టం లేదంటూ మంకుతనం చేస్తున్న ఆడపిల్లను గోముగా, సున్నితమైన లాలనలతో దారిలోకి తెచ్చుకున్నట్లు మనసును నొప్పించక, తానొవ్వక అన్నట్లు లొంగదీసుకోవాలి. లేదంటే బెడిసి కొడుతుంది. నొప్పింపక తప్పదు అనుకోవడానికి లేదుగానీ ఒప్పింపక మాత్రం తప్పదు. ఎందుకంటే ఆ ఆకతాయి మనసు శమించాలి. అందుకు మళ్లీ మనసే కావాలి. మనసునే వాడుకోవాలి.
మనసును శ్వాసతో అనుసంధానం చేయాలి. ధ్యాన సమయంలో శ్వాస క్రియతో ఉచ్ఛ్వాస నిశ్వాసాల క్రమంలో శ్వాసవెంట నడుస్తున్న (మనం నడిపిస్తున్న) మనసు, నిశ్వాస యథాలాపంగా ఆగినచోట దాని చేయిపట్టుకుని నడుస్తున్న మనసు ఆగుతుంది. ఆగాలి. ఎంతసేపు?
సాధన, ముఖ్యంగా ధ్యానం పట్ల అవగాహన, పరిణతి మీద- అది ఆధారపడి ఉంటుంది. ఆ ప్రత్యేక క్షణాన, నిశ్వాస ఆగిపోయిన ఆ నిర్గుణ, నిర్వికార క్షణాన... ఆ క్షణాన్ని క్షణాలుగా ఎక్కువసేపు ఆపగలిగే సాధన... మనం చేయవలసి ఉంది. సంకల్పాలు సద్దుమణిగి, మనసుతో పూర్తిగా విడివడిపోయిన ఆ క్షణం, లేదా అరక్షణం, లేదా క్షణలేశం, క్షణకణికం మనల్ని ధ్యానంలోకి నడిపిస్తుంది. అదే మనం ధ్యానం చేయాల్సిన అంశం. ఆ క్షణమే ధ్యాననిమగ్న సమయం. క్రమ పరిణతితో ధ్యానాన్ని కూడా విస్మరించిన, అధిగమించిన నిరామయ మహాశూన్యం. శూన్యం కూడా కాని అఖండ... అహం బ్రహ్మాస్మి స్థితి!..
ధ్యానం ఎంతో మేలు!
రోజువారీ పనులతో విసుగెత్తిపోయినప్పుడు కొద్దిరోజులు ఎక్కడికైనా వెళ్లి విశ్రాంతి తీసుకుంటే కొత్త హుషారు పుట్టుకొస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గి మానసిక ప్రశాంతత నెలకొంటుంది. అయితే యాత్రలతో లభించే ఇలాంటి ప్రయోజనాలు కొద్దిరోజులే ఉంటాయి. కానీ ధ్యానం, యోగాతో ఒనగూడే సానుకూల ప్రభావాలు చాలాకాలం వరకూ కొనసాగుతున్నట్టు తాజాగా బయటపడింది.
ధ్యానం, యోగా వంటి ఏకాగ్రతతో కూడిన పద్ధతులు శారీరకంగా, మానసికంగా ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి, నొప్పి వంటివి తగ్గటానికి తోడ్పడతాయి. అంతేకాదు.. శరీరంలో వాపు ప్రక్రియను తగ్గించటంతో పాటు రోగనిరోధకశక్తిని పెంపొందించటానికీ దోహదం చేస్తాయి. ఈ విషయంలో ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. రిసార్ట్‌లకు వెళ్లి కేవలం విశ్రాంతిగా గడిపిన వారిలోనూ.. ధ్యానం, యోగా పద్ధతులను పాటించినవారిలోనూ ఒత్తిడి, కుంగుబాటు గణనీయంగా తగ్గినట్టు బయటపడింది. విచిత్రమేంటంటే.. ధ్యానం, యోగా చేసినవారిలో ఈ సానుకూల ప్రభావాలు 10 నెలల తర్వాత కూడా కనబడుతుండటం. విశ్రాంతిగా గడిపినవారిలో ఇవి కొద్దికాలం పాటే కొనసాగాయి. అంతేకాదు యోగా, ధ్యానంతో రోగనిరోధకశక్తి సైతం మరింత ఎక్కువగా మెరుగుపడింది. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా జీవించటానికి తోడ్పడే సంక్లిష్ట జన్యు మార్పులనూ ఇవి ప్రోత్సహిస్తుండటం గమనార్హం. అందువల్ల విశ్రాంతి కోసం రిసార్ట్‌లకు, యాత్రలకు వెళ్లేవారు కాసేపు ధ్యానం, యోగా మీద కూడా దృష్టి పెట్టటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. దీంతో దీర్ఘకాలం మానసిక, శారీరక ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని చెబుతున్నారు...
No comments:
Post a Comment