సమాజం లో అన్ని విధాలా సంతృప్తికరమైన జీవనం గడుపువారు, తమకు ఉన్నదాంట్లో కొంత ఇచ్చి, ఆర్తులను ఆదుకోవడం ఉత్తమ లక్షణం. చాలా మందికి ఎంత సంపద ఉన్నా దానం చెయ్యడానికి మనసొప్పదు, కానీ ఎవరైనా ఇస్తే తీసుకోడానికి ముందే సిద్దమైపోతారు. ఇచ్చే చేతికే తీసుకునే అర్హత ఉంటుందనే విషయం మరువకూడదు... ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరి ముందు చాచడానికి ఇష్టపడకుండా, కేవలం ఇవ్వడానికి ఉపయోగించే చేతులను అభయహస్తాలు అంటారు..
.అవసరార్థులను గుర్తించి తదనుగుణంగా చేసే దానానికే ఔచిత్యం ఉంటుంది...అంతేకానీ అనర్హులకు ఎట్టిపరిస్థితుల్లోనూ దానం చెయ్యకూడదు, దాన్ని అపాత్రదానం అంటారు.... దానం అనేది మనం ఎవరికో చేస్తున్న ఉపకారం కాదు, అది మన జీవితాన్ని చరితార్థం చేసుకునే సదవకాశం మాత్రమే..... 1.మరణ భయంతో ఉన్న వారికి ఓదార్పు ఇవ్వడం 2.రోగులకు వైద్యం చేయించడం 3. పేదవారికి ఉచిత వైద్య అందించడం 4. ఆకలితో అలమటించే వారికి మరియు మూగజీవాలకు కడుపు నింపడం, దాహార్తి తీర్చడం.వీటిని చతుర్విధ దానాలు అంటారు... నేడు నేత్రదానం, రక్తదానం,అవయవ దానాలు మరణం అంచున ఉన్న వారికి ప్రాణాలు పోస్తున్నాయి.... ఎవరైనా తమ స్తోమతను మించి గొప్పలకు పోయి దానాలు చేసి కష్టాలు తెచ్చుకో కూడదు. అలాగే తమకు చెందని వస్తువులు దానం చెయ్యకూడదు. దానం చేసేవారు నిర్మల మనస్సుతో ఫలితం ఆశించకుండా దానం చెయ్యాలి. దానం చేసిన తర్వాత మరిచిపోవాలి.ఎవరికీ చెప్పకూడదు, దాన్ని గుప్త దానం అంటారు.వాటికి విలువ ఎక్కువ ఉంటుంది.....గొప్ప గొప్ప దానాలు చేయలేక పోయినా, మనసావాచా ఇవ్వగలిగింది ఇస్తే, ఆ సంతృప్తిని మాటల్లో వర్ణించలేం. పెద్దల నుంచి వారసత్వంగా ఆస్తులే కాదు, దానం అనే దొడ్డ గుణాన్ని పుణికిపుచ్చుకుని, ఆచరించాలి. అదే ఇహలోకంలో మనకు, పై లోకంలో మన పితృదేవతలకు సద్గతులను కలుగజేస్తుంది...... పోలిన రామకృష్ణ భగవాన్... రాజమండ్రి.
No comments:
Post a Comment