Friday, March 15, 2024

త్రిపురా రహస్యము -- పురుష ప్రయత్నము

 త్రిపురా రహస్యము - 23
~

స్వామి దత్తాత్రేయ  విరచిత ఆత్మ జ్ఞాన యోగము 

13. పురుష ప్రయత్నము - 2  

గారడీ వాడికి తెలిసిన మాయ చాలా తక్కువ. ఈ కొంచానికే మానవులు తట్టుకోలేకుండా ఉన్నారు. అలాంటప్పుడు సర్వజగద్రక్షకుడైన పరమేశ్వరుని మాయ నుంచి తప్పుకోవటం ఎవరి తరము ? ఈ మాయ పరమేశ్వరుని ఆశ్రయించి ఉంటుంది. అతనికి లోబడి ఉంటుంది. పాముకోరలలో ఉన్న విషంలాగా ఈ మాయ పరమేశ్వరుడితోనే ఉన్నప్పటికీ, దీనివల్ల ఆయనకు హాని ఏ మాత్రం ఉండదు. పరమేశ్వరుని అనుగ్రహం పొందినవాడు కూడా ఈ మాయకు లోను కాడు. 

అందుచేత, ఆయన్ని ఆరాధించి ప్రసన్నం చేసుకున్నవాడు జ్ఞానాన్ని పొంది మోహం నుండి విముక్తుడౌతాడు. శ్రేయస్సును పొందటానికి అనేక మార్గాలున్నాయి. అయినప్పటికీ పరమేశ్వరానుగ్రహాం లేనిదే అవి ఏవీ ఫలించవు. కాబట్టి ముందుగా ప్రపంచ కారణమైన పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. తరువాత మోహాన్ని నశింపచేయటానికి యోగసాధన చెయ్యాలి.  

రాజా ! ఈ జగత్తంతా ఒక కార్యం. మరి దానికి కారణం అంటూ ఉండి తీరాలి. అంటే జగత్తుకు ఒక కర్త ఉండి తీరాలి. అయితే ఆకాశము, పరమాణువులు. ఇవి అవయవాలు గలవికాదు. వాటికి కర్తలేడు. అంటారు. అయితే జగత్తుకు మాత్రమే కర్త ఉన్నాడు అనటం సరియైనది కాదు. ఏవేవి వేద్యములో అంటే తెలియదగినవో అవన్నీ కార్యములే. దీని ప్రకారము ఆకాశము, అణువు కూడా వేద్యములే. అందుచేత వాటికి కూడా ఒక కర్త ఉన్నాడు. కాబట్టీ పృధివ్యాధులకు కర్త ఉన్నాడు.  

సృష్టికి ముందు సత్తూ లేదు. అసత్తూ లేదు. అంతా చీకటిగా ఉండేది. అప్పుడు శూన్యం లోనుంచి జగత్ కర్త ఈ జగత్తును సృష్టించాడు. సృష్టిలో ముందుగా ఆకాశం ఉద్భవించింది. దాని నుంచి వాయువు, దాని నుంచి అగ్ని దాని నుంచి జలము, దాని నుంచి భూమి ఉద్భవించాయి. అయితే జగత్తుకు కర్తలేడు. అనే ఆగమం కూడా ఒకటి ఉంది. 

అయితే దీన్ని ఇతర ఆగమాలతో ఖండించటం జరిగింది. కాబట్టి ఇది ప్రమాణం కాదు. (చార్వ్యాక మతంలో పంచభూతాలలో ఆకాశం లేదు.) 

రాజా ! క్రియ అనేది బుద్ది పూర్వకం. బుద్ధి ఉన్నప్పుడే క్రియ జరుగుతుంది. బుద్ది లేకపోతే క్రియలేదు. ప్రపంచ సృష్టి చెయ్యాలి అంటే జ్ఞానం కల ఒక వస్తువు ఉండాలి, జ్ఞానంలేని జడపదార్థాలు ఏమీ చెయ్యలేవు. కుండను తయారుచెయ్యాలంటే కుమ్మరి కావాలి, అంతే కాని బొమ్మలో ఉన్న కుమ్మరి కుండను తయారు చెయ్యలేడు. 

ఆగమాలు ప్రపంచ సృష్టికర్త మహాజ్ఞాని అని ఉద్దోషిస్తున్నాయి. ప్రపంచంలోని ఏ పనిని చూసినా అది బుధ్ధితో జ్ఞానంతో కూడినదే అనిపిస్తుంది. ఈ రకంగా ఆగమాల ప్రకారము జగత్తంతా ఒక కర్త చేత సృష్టించబడింది. ఆ కర్త మామూలు వాళ్ళకన్న విలక్షణుడు. ఊహించటానికి వీలులేని ప్రపంచాన్ని సృష్టించిన ఆ కర్త  మహాశక్తి సంపన్నుడై ఉండాలి. అంత శక్తి గలవాడు కాబట్టి, తనను శరణు జొచ్చిన వారిని రక్షించ గలుగుతున్నాడు. 

కాబట్టి ఓ నాధా ! మనోవాక్కాయ కర్మలతో శక్తివంతుడైన పరమేశ్వరుణ్హి శరణు వేడు. నాధా ! మనస్పూర్తిగా సేవిస్తే ప్రభువులకే మనమీద దయ కలుగుతంది కదా ! అలాంటప్పుడు భగవంతుడికి కలగదా? అయితే ఒక్క విషయం, రాజుల కోరికల మేరకు మనం పనులు చేస్తాము. అప్పుడు వారు మన కోరికలు తీరుస్తారు. మరి భగవంతుడికి కోరికలు ఉండవు కదా ? అతడికి మన సేవ వల్ల లాభం ఏమిటి ? అంటావేమో ? పరమేశ్వరుడు భక్తవత్సలుడు. అతడు తనని సేవించని వారి కోరికలు కూడా తీరుస్తాడు.  

అలాంటప్పుడు తనను ఆరాధించే భక్తుల కోరికలు తీర్చడా ? రాజులు నిర్ధయులు  కృతఘ్నులు. భగవంతుడు అలా కాదు. అతడు దయాసింధువు. కరుణామూర్తి. అతడికి ఒక కట్టుబాటు ఉంది. అలా కాకపోతే రాజ్యాలకు మల్లేనే ఈ లోకం కూడా ఏనాడో నశించిపోయేది. రాజులకు కట్టుబాట్లు లేకపోవటం వల్లనే రాజ్యాలు నశిస్తున్నాయి. కాబట్టి ఓ రాజా ! నువ్వు కుతర్మాన్ని వదిలి పరమేశ్వరుణ్ణి శరణువేడు. అతడే నీకు శ్రేయస్సు కలగచేస్తాడు. అయితే నువ్వు మాత్రం శ్రేయస్సు కావాలని అతడిని సేవించవద్దు. అని చెప్పింది హేమలేఖ.....🙏

J N RAO 🙏🙏🙏

No comments:

Post a Comment