Friday, March 15, 2024

ఎవరిని వారే ఉద్ధరించుకోవాలీ.* *భగవద్గీత చెప్పిన అభ్యుదయ సిద్ధాంతం.

 *ఎవరిని వారే ఉద్ధరించుకోవాలీ.* 

 *భగవద్గీత చెప్పిన అభ్యుదయ  సిద్ధాంతం.* 

 ఆత్మోద్ధరణ చెందాలంటే సప్త సూత్రాల ఆలంబనగా సాధకులు ముందడుగు వేయాలి. 

ఆధ్యాత్మిక జీవన వాహిని- అనంతమైన మధుర మనోజ్ఞ తరంగిణి. ఆధ్యాత్మికత అనేది భావన కాదు, జీవన సంవిధానం. 

చింతనా మార్గంలో ఎవరికివారు సాగించే అలుపెరగని ప్రయాణం.

 ఆధ్యాత్మిక ధోరణి అంటే కేవలం పూజాది అభిషేకాలకు పరిమితమైంది కాదు.

 అంతకుమించిన, అవ్యక్తమైన దార్శనిక శక్తి. జీవన పరివర్తనకు, ఏకత్వం నుంచి అనేకత్వానికి కొనసాగించే మధుర యాత్ర- ఆధ్యాత్మిక చింతన. 

సప్త సూత్రాల సమన్వితంగా ప్రతి వ్యక్తిలో ఆధ్యాత్మికత దీప్తిమంతమవుతుంది. 

నిశిత దృష్టి, నిజాయతీ, నిశ్శబ్దం, నిర్మోహం, నిర్భయం, నిరంతర చింతన, నిర్విచారం- అనే ఏడు అంశాల ప్రాతిపదికన ఆధ్యాత్మిక ప్రగతి ప్రణాళిక ఆవిష్కారమవుతుంది. 

ప్రతి వ్యక్తికీ సమున్నత ఉపకరణం బుద్ధి. కర్మల్ని అనుసరించి బుద్ధి ఆకృతి దాలుస్తుంది. అల్ప బుద్ధులతో అనల్పమైన విషయాల్ని సాధించడం అసాధ్యం. 

విశాల దృక్పథం, సద్బుద్ధి, సాత్విక దృక్కోణం వ్యక్తుల్ని ఆదర్శమూర్తులుగా ప్రకటిస్తాయి. వీటిని సాధించాలనే లోతైన దృష్టి అవసరం. 


నీతి నిజాయతీలనేవి బాహ్యంగానే కాదు. ఆంతరంగికంగా ఎవరికి వారు ప్రదర్శించినప్పుడే ఆధ్యాత్మికత స్వచ్ఛ స్ఫటికంగా ప్రకాశిస్తుంది.

 సంకుచిత భావనలను విడనాడి, సంఘర్షణాత్మక వైఖరిని నిలువరించి స్పష్టతతో మసలుకోవాలి. 

‘నిశ్శబ్దం నిండిన హృదయం పరమాత్మకు నెలవు’ అన్నారు రామకృష్ణ పరమహంస.

 మనసులో అలజడులనే సవ్వడులు లేకపోతే, ప్రతి మదీ మందిరమైమంగళదాయకమవుతుంది.


 శాంతి నిండిన మనసు ఆహ్లాదభరితమై, ఆధ్యాత్మిక వనమై గుబాళిస్తుంది. రాగద్వేషాలకు అతీతంగా మసలుకోవడం ఆధ్యాత్మిక పయనంలో ముఖ్య సూత్రం.

 ప్రతికూలతల్ని అధిగమించి, విపరీత శక్తుల్ని ఎదుర్కొని సమదర్శనంగా ప్రగతి బాటలో ప్రయాణం చేసినప్పుడు మనోహరమైన మజిలీలు మనల్ని పలకరిస్తాయి.

 నిర్మోహంగా వ్యవహరించడం ద్వారా జీవన్ముక్తుడై సాధకుడు ఆధ్యాత్మిక జగత్తులో ప్రకాశిస్తాడని జగద్గురు ఆదిశంకరులు పేర్కొన్నారు.

 స్వపరభేదాలు లేని సమ్యక్‌ దృష్టి, సమగ్రభావన వ్యక్తుల్ని విలక్షణంగా తీర్చిదిద్దుతాయి. 

‘అనవసర భయాలతో జీవితాన్ని కుంగదీసుకోవద్దు. జీవితం అనేది భయపడటానికి కాదు. 

జీవన మధురిమల్ని సదా ఆస్వాదించడానికి’- అంటారు శ్రీఅరవిందులు. 

ఏ పరిస్థితినైనా ఎదుర్కోగల ఆత్మస్థైర్యం, గుండె నిబ్బరం ఆధ్యాత్మిక చింతనలో ఎల్లప్పుడూ అభిలషణీయం.

 పిరికితనం అనేది మరణంతో సమానమని వివేకానందుడు చెప్పిన హితోక్తి.

 జీవనయాత్రలో ఎదురయ్యే ప్రతి సంఘటననూ దైవం నిర్దేశించినదిగానే స్వీకరించాలి.

 ధైర్యం,సాహసంఅనేవివ్యక్తులకు సహజ భూషణాలుగా అమరినప్పుడు వాళ్లు తేజోమూర్తులుగా ప్రకాశిస్తారు.

No comments:

Post a Comment