ఎవ్వనిచే జనించి...!!
రమణభగవానులు ఏదో పుస్తకం చదువుకుంటూ వుంటే,
ఒక భక్తుడు ఆసక్తిగా అడిగాడు- భగవాన్! అది ఏం పుస్తకం? అని.
"నా జీవితచరిత్ర" అన్నారు భగవాన్.
తీరా ఆ భక్తుడు ఆ పుస్తకం వైపు చూస్తే, అది కేనోపనిషత్తు.
ఆశ్చర్యపోయాడు ఆ భక్తుడు.
భగవాన్ అబద్ధం చెప్పాడు అని అనగలమా?
వారు పరమ సత్యమే చెప్పారు-
కేన అంటే ఎవ్వనిచే.
ఎవ్వనిచే ఈ సకలచరాచరమంతా ఉనికి కలిగి ఉన్నదో
వాడే నేను అని భగవాన్ చెప్పినట్లైంది.
కాబట్టి అటువంటి కేనోపనిషత్తును సరళ వ్యావహారిక భాషలో నేను వ్రాసుకున్నదానిని అందరితో పంచుకుంటున్నాను...
పైగా శ్రీకాళహస్తి క్షేత్రంతో సంబంధం ఉన్న ఉపనిషత్తు అని తెలియడం వలన, కించిత్ ప్రాంతాభిమానం తోడైనందు వలన ఈ ఉపనిషత్తును మాత్రమే ఎన్నుకొని వ్రాయడానికి ప్రోత్సాహం అయ్యింది.
* * *
ఎవ్వనిచే జనించు? జగమెవ్వని లోపల నుండు? లీనమై
ఎవ్వనియందు డిందు పరమేశ్వరుడెవ్వడు? మూలకారణం
బెవ్వడ? నాది మధ్యలయు డెవ్వడు? సర్వము తానైన వా
డెవ్వడు? వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్.
* * *
శిష్యుడు:
ఎవ్వనిచే మనస్సు చరిస్తోంది?
ఎవ్వనిచే ప్రాణం సంచరిస్తోంది?
ఎవ్వనిచే వాక్కు పలుకుతోంది?
ఎవ్వనిచే కళ్లు చూస్తున్నాయి?
ఎవ్వనిచే చెవులు వింటున్నాయి?
గురువు: 'అది' దైవం.
మనసుకు మనస్సుగా
ప్రాణానికి ప్రాణంగా
వాక్కుకు వాక్కుగా
కన్నుకు కన్నుగా
ఉన్నది.
కాబట్టి ఇంద్రియాల వెనుక ఉండి
ఇంద్రియాలను నడిపే శక్తియే ఆత్మ.
కన్నుకు దేని వలన చూచే శక్తి కలిగిందో
దానిని కన్ను చూడలేదు.
మనసుకు దేనివలన తలచే శక్తి కలిగిందో
దానిని మనసు తలవలేదు.
అందువల్ల 'అది'(ఆత్మ) ఎలాంటిదో
దాని గుఱించిన వివరమేమీ మాకు తెలియదు.
కేవలం అనుభవానికి మాత్రమే సంబంధించిన
ఆ పరతత్త్వాన్ని ఎలా ఇతరులకు అవగతం అయ్యేలా చెప్పాలో
మాకు తెలియడం లేదు.
తెలుసు అనడానికి
తెలియదు అనడానికి
'అది' అతీతంగా ఉన్నది.
అని మా పెద్దలు చెప్పగా విన్నాం.
* * *
దేని వలన వాక్కు ప్రకటనం అవుతుందో
దేనిని వాక్కు తెలుపలేదో
అదే దైవం.
ఇక్కడ లోకులు చేత ఆరాధింపబడేది
దైవం కాదని తెలుసుకో.
దేని వలన మనసుకు తలచేశక్తి కలుగుతుందో
దేనిని మనసు తలవలేదో
అదే దైవం.
ఇక్కడ లోకులు చేత ఆరాధింపబడేది
దైవం కాదని తెలుసుకో.
దేని మూలంగా కళ్లు చూస్తున్నాయో
దేనిని కళ్లు చూడలేవో
అదే దైవం.
ఇక్కడ లోకులు చేత ఆరాధింపబడేది
దైవం కాదని తెలుసుకో.
ఏది చెవుల ద్వారా వినబడదో
దేని వలన చెవులు వినగలుగుతున్నాయో
అదే దైవం.
ఇక్కడ లోకులు చేత ఆరాధింపబడేది
దైవం కాదని తెలుసుకో.
దేని వలన ముక్కుకు వాసన చూసే శక్తి కలిగిందో
దేనిని ముక్కు వాసన చూడలేదో
అదే దైవం.
ఇక్కడ లోకులు చేత ఆరాధింపబడేది
దైవం కాదని తెలుసుకో.
* * *
శిష్యుడు:
గురువుగారూ!
నేను ఆత్మను బాగా తెలుసుకున్నాను.
గురువు:
నేను ఆత్మను బాగా తెలుసుకున్నాను
అని నీవు అంటున్నావంటే,
నీకు ఆత్మ గుఱించి తెలియలేదు అని అర్థం.
నాకు తెలుసు అనటానికి
నాకు తెలియదు అనటానికి
ఏ తెలివైతే ఆధారంగా ఉన్నదో
ఆ తెలివే తాను.
ఈ తత్త్వంలో ఉన్న విచిత్రమేమంటే-
తెలుసు అన్నవాడు తెలియనివాడు.
తెలియదు అన్నవాడు తెలిసినవాడు.
నిజానికి 'నాకు తెలియదు' అన్నవాడే
అమరత్వాన్ని పొందుతాడు.
ఇప్పుడే ఇక్కడే ఆత్మను పొందడం గొప్ప లాభం.
లేకపోతే అదే గొప్ప నష్టం.
ఆత్మని పొందనివాడు జగత్తులో భేదాన్ని చూస్తాడు కాబట్టి
అతడు మృత్యువుకు బలి అవుతాడు.
ఆత్మను పొందినవాడు సర్వత్రా అభేదాన్ని దర్శిస్తాడు కాబట్టి
అతడు అమరుడవుతాడు.
* * *
No comments:
Post a Comment