Tuesday, April 2, 2024

త్రిపుర రహస్యం గ్రంథంగా రావడం వెనుక ఆసక్తికర కథ!

 త్రిపుర రహస్యం గ్రంథంగా రావడం వెనుక ఆసక్తికర కథ!

పూర్వం సరస్వతీ నదీ తీరంలో సుమంతుడు అనే బ్రాహ్మణుడు భార్యతో కలిసి నివశించేవాడు.. అతడు దుర్గాపూజోపాసనా పరాయణుడు. భార్యను పేరుతో పిలువకూడదని నిషేధం ఉండటం వలన, అతడు భార్యను ‘అయి' అని పిలుస్తుండేవాడు. వారికి ఒక కుమారుడు కలిగాడు. అతని పేరు 'అలర్కుడు'. ఆ పిల్లవాడు కూడ తల్లిని 'ఐ', 'ఐ' అని పిలుస్తుండేవాడు. ఆ పిల్లవాడి పూర్వజన్మ కర్మ వల్ల అయిదేండ్లకే పెద్ద జబ్బు చేసింది. ఆ వ్యాదితో బాధపడుతూ తల్లిని, 'ఐ', 'ఐ' అని నిరంతరం స్మరిస్తూ మరణించాడు.

అతడు తరువాత హారితాయన వంశములో జన్మించి, 'సుమేధుడు' అనే పేరుతో విలసిల్లాడు. అతడు భగవంతుడైన పరశురాముని చేరి సేవిస్తూ ఒకరోజు ఇలా అడిగాడు

 "భగవానుడా! సంసారతాపంచేత తప్తులై, దీనులై ఉన్న మనుషులు మొదలుకొని జీవులకు పరమశ్రేయస్సును కలిగించుటకు శ్రేష్ఠమైన సాధనం ఏంటి? అది నేను వినదగినది అయితే దయచేసి దానిని నాకు చెప్పండి" అని.

 అపుడు ఆయన చిరునవ్వుతో "కాలక్రమంలో చెపుతాను" అన్నారు. తరువాత పదహారు సంవత్సరాలు గడిచాయి. తరువాత సుమేధుడు పూర్వం తాను అడిగిన విషయమును గుర్తుచేసి, దానిని చెప్పమని పరశురాముని ప్రార్థించాడు.

అపుడు ఆయన తనకు దత్తగురువు చెప్పిన విషయమును స్మరించాడు. "త్రిపురాదేవియొక్క రహస్యము"ను శివుడు విష్ణువుకు ఉపదేశించాడు. విష్ణువు తన అంశములో జన్మించిన దత్తాత్రేయునకు దానిని బోధించాడు. దత్తగురువు దానిని భార్గవునకు ఉపదేశిస్తూ, దీనిని ఇతరులకు బోధించద్దు, హారితాయనుడైన సుమేధుడు భక్తితో నీకు శిష్యుడై నిన్ను సేవిస్తాడు.. అతడు దీనిని నీద్వారా విని గ్రంథముగా రచిస్తాడు అని చెప్పాడు. ఆ విషయమును గుర్తుచేసుకుని పరశురాముడు సుమేధునితో, "వత్సా! సర్వము కాలవశమున కలుగుచుండును. రేపు పుష్య నక్షత్రములో ఆ విషయమును బోధించుటకు ఉపక్రమిస్తాను" అని చెప్పాడు.

తరువాత వారు సాయంకాలములో సంధ్యాకాల జపమును పూర్తిచేసుకుని, స్వాత్మశక్తిని ధ్యానిస్తూ రాత్రి సుఖంగా నిద్రించారు. మరునాడు ఉదయం సుమేధుడు శుభముహూర్తంలో పనులను పూర్తిచేసుకుని సుఖాసీనుడై వున్న గురువును చేరి సాష్టాంగ దండప్రణామం చేసి, లేచి అంజలి గావించి వినమ్రుడై నిలిచి ఉన్నాడు. పరశురాముడు ఎదుట ఉన్న హేమపీఠముపై పుష్పములను దోసిటితో ఉంచి, శ్రీబాలాత్రిపురసుందరియొక్క మూడు విధములుగా ఉన్న రూపమును, మంత్రతంత్ర చర్యాక్రమమును, ముద్రాదులు, ఆచారక్రమం మొదలైనవన్నీ సుమేధునకు ఉపదేశించి, "వత్సా! ఇది పరమ బ్రహ్మము. దీనిని ఆలస్యం చేయకుండా సాధింపుము. తరువాత నీకు త్వరలోనే పూర్ణపదమును చెబుతాను" అని చెప్పాడు. అంతటితో హారితాయనుడు ఆయనకు మూడుసార్లు ప్రదక్షిణం చేసి నమస్కరించి సెలవు తీసుకుని శ్రీశైలము వెళ్ళాడు.

శ్రీశైలంలో సుమేధుడు భ్రమరాంబాదేవియొక్క సన్నిధిలో చక్కని కుటీరాన్ని నిర్మించుకొని, ఫలములే ఆహారముగా స్వీకరిస్తూ ఇంద్రియములను, మనస్సును నియమించి మొదట తొమ్మిది నెలలు తరువాత అయిదు నెలలు ఆ తరువాత మూడు నెలలు భక్తిశ్రద్ధలతో గురువు చెప్పినట్లుగా శ్రీబాలాంబికను ధ్యానిస్తున్నాడు. తరువాత ఒకరోజు రాత్రి కలలో అక్షమాలాపుస్తక అభయవరదపాణియై నాలుగు భుజములతో, మూడు నేత్రములతో, చంద్రకళావిలసితమైన ముకుటముతో పది సంవత్సరాల వయస్సు గల కుమారీ రూపంలో, మహాసౌందర్యముతో 'శ్రీబాలాంబిక' సాక్షాత్కరించింది. స్వప్నంలోనే హరితాయనుడు ఆమెకు సాష్టాంగ దండ ప్రణామం చేసి లేచి అంజలి ఘటించాడు. తరువాత విచిత్రార్థ పద మనోహరమై ఛందోబద్ధమైన స్తోత్రంతో ఆమెను స్తుతించాడు. ఆనంద పారవశ్యంలో కన్నులు అశ్రువులతో నిండగా ఏమీ మాట్లాడలేక, చూడలేక ఊరక నిలిచి ఉన్నాడు. పరమేశ్వరి, 'వత్సా!' అని మధురంగా పిలిచి వాని మూర్ధమునందు హస్తమును ఉంచింది. ఆ కరస్పర్శచేత అతడు బ్రహ్మానందమయుడు అయ్యాడు. అపుడు ఆ మహాదేవి, “వత్సా! నీవు కోరిన సిద్ధి లభించింది. ఇక గురువు వద్దకు వెళ్ళు. ఆలస్యం చేయక” అని పలికి అంతర్థానమైంది.

కానీ సుమేథుడు ఒక్కసారిగా నిద్రనుంది ఉలిక్కిపడి లేచాడు. అదంతా కల అని అనుకున్నా చివరికి గురువుకు చెప్పాడు. గురువు ఎంతో సంతోషించి సుమేథుడికి త్రిపురా రహస్యం గురించి చెప్పాడు. దాన్ని జాగ్రత్తగా రక్షించమని కోరాడు. ఇదీ త్రిపురా రహస్యం గ్రంథరూపానికి వెనుక ఉన్న విషయం.

No comments:

Post a Comment