*జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్య మహాస్వామిజీ భారత స్వాతంత్ర్యదినం (15-08-1947) సందర్భంగా భారతజాతికి ఇచ్చిన మహా సందేశం…*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*స్వాతంత్రము - సాధన*
➖➖➖
మన భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన ఈ అద్భుత దినాన, సనాతనులమైన మనమందరమూ భగవంతునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆధ్యాత్మికోన్నతిలో మనం ఇలాగే ముందుకు సాగిపోవాలని మన బుద్ధిని ప్రచోదనం చెయ్యమని ఆ దేవదేవుణ్ణి వేడుకుందాము. కేవలం దైవకృప వల్లనే మనం కష్టపడి సాధించుకున్న ఈ స్వేచ్ఛని కాపాడుకోగలం, శాంతిగా సామరస్యంగా బ్రతకగలం.
ధర్మానికి ప్రతిరూపమైన భగవంతుని చక్రాన్ని మన జాతీయ జండాలో ఉంచడం మన అదృష్టం. ‘దేవనామప్రియః’ అన్న పేరుతో ప్రఖ్యాతి వహించిన సామ్రాట్ అశోకుడు పాటించిన విలువలను ఆ ధర్మచక్రం మనకు గుర్తుచేస్తుంది. గీతలో శ్రీకృష్ణుడు ప్రతిపాదించిన ఆధ్యాత్మిక క్రమశిక్షణ గురించి ఆలోచింప చేస్తుంది ఆ చక్రం. ధర్మానికి ప్రతిరూపంగా ఉన్న ఆ చక్రం గురించి భగవాన్ శ్రీకృష్ణుడే స్వయంగా గీతలోని మూడవ అధ్యాయంలోని పదహారవ శ్లోకంలో “ఏవం ప్రవర్తితం చక్రం” అని చెప్పారు. ఇదే అధ్యాయంలోని పద్నాలుగు, పదిహేనవ శ్లోకంలో “మానవుడు అన్నము వలన పుట్టును, అన్నము వర్షము వల్ల కలుగును. వర్షము యజ్ఞము వలననే సంభవించును. వేదములు యజ్ఞము గురించి తెలుపును. వేదములు అక్షర రూపమైన పరబ్రహ్మ నుండి పుట్టాయి”. కాబట్టి పరబ్రహ్మము వైదిక ప్రక్రియలలో ప్రతిపాదించబడినది అని ఈ ధర్మచక్రము మనకు తెలుపుతుంది. ఈ స్వాతంత్ర్యము మనకు భగవంతుని అనుగ్రహం వల్ల ధర్మము, ధనము, ఆత్మానందము, మోక్షము ప్రసాదించగలదు.
మన జాతీయ జండాలో మూడు రంగులున్నాయి. కాషాయము, తెలుపు మరియు ఆకుపచ్చ. ఇవి మనకు శత్రువుల నుండి రక్షణ కొరకు సైనిక సంపత్తిని, సుఖసంక్షేమముల కోసం ధనమును, సరి అయిన పరిపాలన కోసం జ్ఞానమును తెలియజేస్తున్నాయి. ఆకుపచ్చ రంగు జగన్మాత అయిన దుర్గాదేవి, కాషాయం ధనానికి, శ్రేయస్సుకు ఆధారము అయిన మహాలక్ష్మి, తెలుపు జ్ఞానస్వరూపిణి అయిన సరస్వతి దేవికి ప్రతీకలు. అలా మూడు శక్తులకు ప్రతీకలైన రంగులను జాతీయజండాలో చేర్చడం సంతోషదాయకం.
మన భారతదేశం స్వాతంత్ర్య సిద్ధి కోసం చాలా కాలం పోరాటం చేసింది. పరమాత్ముని అనుగ్రహం వల్ల, మహాత్ముల ఆశీస్సుల వల్ల, ఎందరో ప్రజల త్యాగం వల్ల మనకు స్వాతంత్ర్యం లభించింది. ఈ స్వాతంత్ర్య సిద్ధితో మన దేశం కరువు కాటకాల నుండి, సాంఘిక అసమానతల నుండి బయటపడి ప్రజలందరూ స్నేహభావంతో, దయాళువులై బ్రతకాలని సర్వవ్యాపకుడైన ఆ భగవంతుణ్ణి మనమందరం ప్రార్థిద్దాము.
ఇప్పుడు మన దేశం పరాయి పాలన నుండి బయటపడింది. మనం కూడా స్వతంత్రంగా బతకడానికి ప్రయత్నిద్దాము. మనల్ని మనం అర్థం చేసుకుంటే మనం స్వతంత్రులమైనట్టే. మన ఇంద్రియాలను మనం నియంత్రించుకోలేకున్నాము. మనల్ని ఎల్లప్పుడూ బాధపెట్టే తృష్ణని, కోపాన్ని జయించలేకున్నాము. ఏది ఎంత మోతాదులో లభించినా మనకు సంతృప్తి ఉండదు. ప్రాపంచిక విషయాలు మనకు బాధను కలిగిస్తాయి. ఇటువంటి బాధలవల్ల మన మనస్సు ఆందోళన చెందుతుంది. వీటి నుండి బయటపడడమెలా? అని చింత మొదలవుతుంది. అలా ఆరాటపడుతున్న మనసుని మనం నియంత్రించాలి. ఒక్కసారి మనస్సు నిదానపడితే మనకు ఇక ఏదీ కావాలనిపించదు. అటువంటి మానసిక స్థితిని మనం అలవరచుకోవాలి.
మనస్సును నియంత్రించుకోవడానికి రోజూ కొంత సమయం కేటాయించుకొని భగవంతుణ్ణి ధ్యానించాలి. క్రమంగా మన మనస్సు శాంతిని పొంది, కోరికను కోపాన్ని నియంత్రించుకోవడానికి అవసరమైన శక్తి లభిస్తుంది. అటువంటి భగవధ్ధ్యానం చేసేవారికి ఆధ్యాత్మిక ఉన్నతి చాలా త్వరగా లభిస్తుంది. కనుక అలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవారే స్వతంత్రులుగా ఉండగలరు.
తన భార్య తక్క మిగిలిన స్త్రీలందరిని తల్లి లాగా గౌరవించాలి. సృష్టిలోని ప్రతీ ప్రాణిని మనతో సమానంగా భావించాలి. ప్రాణం పొయే పరిస్థితి వచ్చినా నిజమే పలకాలి. అంతఃకలహాలను పూర్తిగా నిర్మూలించాలి. జ్ఞానార్జనకు ప్రతి ఒక్కరూ సాధనే చేస్తూ, ఆధ్యాత్మిక ఉన్నతిని పొందుతూ అందరితో సహృద్భావంతో మెలగాలి. ప్రపంచమంతా శాంతి సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించాలి.
``
ధర్మో రక్షతి రక్షితః
🌷🙏🌷
No comments:
Post a Comment