Friday, August 9, 2024

శ్రీ రమణీయం - 40🌹 👌 సాధనకు సహనం తొలి సద్గుణం 👌

[8/8, 16:47] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 40🌹
👌 సాధనకు సహనం తొలి సద్గుణం 👌
 ✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

40. సాధనకు సహనం తొలి సద్గుణం

✳️ మనసు శరీర భావనతో ఉన్నప్పుడు శరీరం తాలూకూ కష్టసుఖాలను అనుభవిస్తుంది. మండుటెండలో తిరిగినప్పుడు కష్టంగా అనిపించడం, ఎ.సి. గదిలో కూర్చుంటే హాయిగా అనిపించడం వంటివి మనసు పొందే దేహానుభవాలు. మనసు ఆలోచనలో ఉన్నప్పుడు శరీరంతో నిమిత్తం లేని సంతోష దుఃఖాలను అనుభవిస్తుంది. ఏదైనా శుభవార్త గుర్తుకురాగానే సంతోషం కలగటం, అవమానకరమైన విషయం గుర్తుకు రాగానే దుఃఖం కలగటం మన అనుభవం లోనివే. *మనసు శరీర భావనతోనూ, ఆలోచనల తోనూ కాకుండా తన సహజ స్థితిలో ఉంటే ఆత్మశాంతితో ఉంటుంది.* అంటే, ఆత్మలక్షణమైన పరిపూర్ణ శాంతిని మనసు అనుభవిస్తుంది. 

✳️ శరీరానికి కష్ట సుఖాలు క్రియలోనూ, మనసుకి సంతోష దుఃఖాలు భావనతోనూ కలుగుతున్నాయి. కాబట్టే నీళ్ళల్లో పడినట్లు కలవస్తే మనసుకు మాత్రం ఆందోళన ఉన్నా నిజంగా శరీరానికి ఏ తడి అంటదు. మనసు ఈ భావనాస్థితిని దాటితే మనోమూలంలోనే ఉన్న ఆత్మశాంతి అనుభవంలోకి వస్తుంది. ఆత్మ గుణమైన పరిపూర్ణశాంతి మనసుకు కలగటమే ఆత్మానుభవం. అదే దైవ దర్శనం.

✳️ మనం శాంతిని, తృప్తిని సుఖసంతోషాల ద్వారా పొందాలని అనుకుంటున్నాం. అందుకే జీవితంలో శాంతికోసం వెతుక్కోవాల్సి వస్తుంది. అనుకున్న పనులను చేయటం ద్వారా, శరీరాన్ని సుఖంగా ఉంచడం ద్వారా మాత్రమే మనసుకి శాంతి కలుగుతుందని మన భావన. శరీరంతో అనుకున్నవి చేయగలిగినప్పుడు, మనసుతో ఇష్టమైన విషయాలు భావన చేయగలిగినప్పుడు కలిగే అనుభూతిని శాంతి అనుకుంటున్నాము. నిజానికి శాంతి, తృప్తి మనలోని ఆత్మ సుగుణాలు. శరీర క్రియలతో, మనోభావనలతో పని లేకుండానే అవి మన సొంతం. పగలంతా అనేక శరీరక్రియలతో కష్టసుఖాలను అనుభవిస్తున్నాము. స్వప్నంలో దేహంతో పని లేని అనేక మానసిక భావనలతో కూడిన సంతోష దుఃఖాలను పొందుతున్నాము. కానీ గాఢనిద్రలో వేటితోనూ పని లేకుండానే శాంతిని ఆస్వాదించగలగడం మనలోని ఆత్మతత్వానికి నిదర్శనం.

✳️ జీవితంలో మనం కోరుకునే తృప్తి, శాంతి, మనలోనే సిద్ధంగా ఉన్నప్పుడు మరి ఈ వెంపర్లాట ఎందుకంటే... అజ్ఞానం చేత. జ్ఞానం అంటే ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియడం. మెలకువలో నిజమనిపిస్తున్న వరకూ అనేక భావనలతో ఉండే మనసుకి సుషుప్తిలో ఉనికే ఉండటం లేదు. మనకు ఇప్పుడు అనుభవంలో లేని ఆత్మను గురించి విచారణ చేయలేము. కనుక మనకి అనుభవంలో ఉన్న దేహం గురించి, ఆ అనుభవాలను పొందే మనసును గురించి విచారించి సత్యాన్ని అర్థం చేసుకోవాలి.

✳️ ఈ దేహం ఒకటి ఉంది కనుక దానికి అవసరాలు తీర్చక తప్పదు. అన్నం, నీరు, బట్టలు వంటి ప్రాథమిక అవసరాలు విధిగా సమకూర్చి తీర్చాల్సిందే. ఆకలి తీరితే శరీరం శాంతిస్తుంది. కానీ రుచులు కోరే మనసు మాత్రం శాంతించడం లేదు. ఆకలి, శరీర రుచులు కోరే మనసు మాత్రం శాంతించడం లేదు. ఆకలి శరీర అవసరమైతే, రుచి మనసుకు కలిగే కోరిక. ప్రకృతి ధర్మాలైన శరీర అవసరాలను తీర్చడం సముచితమైనా మితం లేని మానసిక కోర్కెలను తీర్చాలనుకోవడం శాంతిని దూరం చేసే విషయం. ఎంతటి జ్ఞానికైనా అన్నం తింటేనే కడుపు నిండుతుంది. కనుక శరీర పోషణ, రక్షణలు మనకు అత్యావశ్యకం. అశాంతి కారకాలైన కోర్కెల ఉధృతి తగ్గాలంటే మనసుకి సహనం చాలా అవసరం. సుఖ సంతోషాల ద్వారా మనం పొందాలని వెంపర్లాడుతున్న శాంతి మనలోనిదేనన్న సత్యం తెలిస్తే వెతుకులాటలేని పవిత్ర జీవనం ఏర్పడుతుంది. 

✳️ అలానే పవిత్రమైన జీవనవిధానం అలవర్చుకుంటే మనసు సత్యాన్ని గ్రహించి ఆత్మానందాన్ని పొందగలుగుతుంది. ఈ పవిత్ర జీవనం కోసమే మన పెద్దలు ధర్మం ఆచరించమన్నారు. ఆధ్యాత్మిక సాధన ఏదీ శాంతిని తృప్తిని ఇవ్వదు. పురాణాలు, శాస్త్రాలు, అవతార పురుషుల జీవితాలు మనకు సహనాన్నే బోధిస్తున్నాయి. భారతీయ హృదయానికి ఆయువు పట్టులాంటి సహనాన్ని వదిలి ధ్యానం చేయాలని అనుకోవడం అత్యాశే అవుతుంది. 

✳️ శ్రీకృష్ణ భగవానుడు, సాక్షాత్తు విష్ణువు. 12వ ఏటనే గోవర్ధన పర్వతం ఎత్తాడు. బ్రహ్మకు సైతం అంతు చిక్కని శక్తిని ప్రదర్శించాడు. అయినప్పటికీ ఆయన వచ్చిన పనులన్నీ పూర్తి చేయడానికి 120 సంవత్సరాల కాలం జీవించాల్సి వచ్చింది. మన జీవన పరమార్థమేమిటో, వచ్చిన పనిఏమిటో మనకు తెలియక పోవచ్చు. కానీ అవతరించిన దైవానికి అవన్నీ తెలుసు. సహనం నేర్పటం కూడ అవతార రహస్యంలో భాగం కనుక వారుకూడా కాలానుగుణంగానే వ్యవహరించారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడి మనసులు వేరైనా అనుసరించిన ధర్మం, ఆచరించి చూపిన సచ్ఛీలం ఒక్కటే. శ్రీరాముడ్ని పూజించటం అంటే రాముడి సద్గుణాలను అలవర్చుకోవడమే అందులోని అంతర్యం. మనలోని దుర్గుణాలను ముందుగా జయిస్తేనే సమాజంలో దేన్నైనా జయించడానికి అర్హత లభిస్తుంది. అదే ఇంట గెలిచి రచ్చగెలవడం అనే నానుడిలోని అర్థం. లౌకిక జీవనంలో శుభకరంగా భావించే వివాహాన్ని కూడా పారమార్ధిక జీవనంలో పాపంగా పేర్కొన్నారు. ఇది మన పారమార్ధిక జీవన ఆవశ్యకతను, ప్రాముఖ్యతను తెల్పుతుంది. జీవితంలో ధర్మాచరణ ద్వారానే మనం ఈ దోషాలన్నింటిని పరిహరించగలం.
[8/8, 16:47] +91 73963 92086: ✳️ భౌతిక జీవనానికి తక్కువ ప్రాధాన్యతనిచ్చి అంతర్గత జీవనాన్ని అత్యుత్తమ జీవనంగా చాటిచెప్పిన దేశం మనది. ఏ విషయంలోనైనా ఫలం కోసం కాలం వచ్చేవరకూ వేచిఉండటం సహనం. మనం ఋషుల్లాగా సమాజాన్ని, లౌకిక జీవనాన్ని వదిలివెళ్లి సాధన చేయలేము. కనుక బాల్యం నుండి వృద్ధాప్యం వరకు అన్ని దశల్లోనూ ధర్మజీవనం గడపడం ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక ఉన్నతికి చేరగలుగుతాము. కానీ నేటి మన పోకడలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. ఒకప్పటి మన సమాజంలోని ప్రేమాభిమానాలు ఇప్పుడు వ్యామోహాలుగా మారుతున్నాయి. పాశ్చాత్య విధానాల అనుకరణ మనకు లౌకిక, ఆధ్యాత్మిక జీవితాల్లో శాంతిలేకుండా చేస్తుంది. బాల్యంలో మొదలైన ఫ్యాషన్ల మోజు యవ్వనప్రాయానికి విచ్చలవిడితనంగా మారుతుంది. మన సంస్కృతిలో ఎంతో ఉన్నతమైన వైవాహిక వ్యవస్థలో కూడా దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శాంతిని దూరం చేసే విధానాలవైపు పరుగులు పెడుతూ... ధాన్యం - దైవం వంటి ఆధ్యాత్మిక సాధనలకు పూనుకోవడం వృథా ప్రయాసే అవుతుంది.

✳️ కలుపు మొక్కలను తీసివేయకుండా సేద్యం ఎలా సాధ్యం కాదో మనలోని దుర్గుణాలను తొలగించకుండా శాంతిని, తృప్తిని పొందటం సాధ్యం కాదు. ఆధ్యాత్మిక జీవితమైనా, లౌకిక జీవనమైనా సాఫీగా సాగాలంటే సహనం అనే తొలి సద్గుణం అవసరం. మనసు ఉధృతికి కళ్లెం వేసే సహనం లేకుండా ధ్యానంగానీ, జపం గానీ సిద్ధించవు. అందుకే మనం నిత్య జీవితంలోనే సహనాన్ని అలవర్చుకుంటే ఆధ్యాత్మిక సాధనకు అవసరమైన మార్గాన్ని సుగమం చేసుకోగలుగుతాము.

🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment