ఆత్మానాత్మ వివేకము ( ఆదిశంకరుల విరచితం -- శ్లోకం 6.)
రాగాదయ: కస్మాత్ … భవన్తీతి చేత్ /
రాగం మొదలయినవి దేనివల్ల పుడతాయి అనే ప్రశ్నకి, అభిమానం వల్ల పుడతాయి అని సమాధానం.
రాగం మొదలయినవి అంటే ఏమిటో తెలిసినతర్వాత, ఈ ప్రవ్రుత్తులన్నీ, అభిమానం వల్ల పుడుతున్నాయి అని తెలుసుకోవాలి . ఏ వస్తువైనా ముందుగా మన ఇంద్రియాలకు గోచరిస్తుంది. ఆతర్వాత మనస్సులో ఆలోచన మొదలవుతుంది. ఇది నాది, దీని మీద అధికారం నాది. ఇది నా కోసమే ! అంతా నా కోసమే ! . అనేది అభిమానం. ఈ అభిమానం ప్రాణులన్నిటికీ సహజమే. ఈ అభిమానం అనేదే అసాధారణ ధర్మంగా పరిణమిస్తే అహంకారమౌతుంది .
దీనిని అనుసరించే బుద్ధి అనేది ఏ పనిచేయాలో నిర్ణయిస్తుంది. అహంకారమనేది చాలా జటిలమయినది. దీనినుండి విముక్తి అనేది కష్టసాధ్యం. పూర్తిగా అసాధ్యం కాదు .
నిష్కాపట్యాన్ని, సరళ స్వభావాన్ని ( డంబాచారం, మిధ్యాభిమానం లేకుండా వుండటం ) అలవాటు చేసుకుంటే, అహంకారాన్ని చాలావరకు అదుపులో పెట్టవచ్చు . అహంకారం అంటే తాను ఏదో పొందాలనీ. ఆ పదవికీ, ఆ భోగభాగ్యాలకీ తాను మాత్రమే అర్హుడననే భావం .
ఈ అహంకారం తగ్గినకొద్దీ రాగాదిభావాలు వాటంత అవే తగ్గుముఖం పడతాయి . రాగమనేది సాధనకు భంగకారి. లోపల అహంకారమున్నప్పుడే బయట రాగమనేది కనిపిస్తుంది. లోపల అహంకారం లేకపోతె బయట రాగమనేది వుండదు.
అహంకారమే రాగానికి మూలకారణం . అంతేగానీ, రాగం వల్ల అహంకారం పుడుతుందని అనుకోకూడదు. వీటి మధ్యనుండే అంతరం చాలా సూక్ష్మమైనది . కాబట్టి అటువంటి భ్రమకు అవకాశం వుంది .
స్వస్తి .
No comments:
Post a Comment