Saturday, August 3, 2024

****సెవన్టీ ప్లస్ (70+) నాటౌట్

 *సెవన్టీ ప్లస్  (70+) నాటౌట్*

నాకు ఆకుకూరలలో తేడా తెలియదు. ఆ విషయం అమ్మేవాడికి తెలియకూడదని గంభీరంగా మొహం పెట్టి అడుగుతా! “చుక్కకూర ఉందటోయ్?" అంటూ అటు ఇటు చూస్తూ.
అలా అడగ్గానే "మీముందే ఉంది కదండీ,  మీక్కావాల్సినన్ని తీసుకోండి అంటాడు."

అన్నీ ముందే ఉంటాయి కానీ క్యారంబోర్డుకి అటు ఇటు ఉన్నట్టు అమ్మేఅతను ఆ చివర నేను ఈచివర.  
తీసివ్వడానికి అతను ఇవతలకి రాడు, నేనేమో ఆ ఆకుకూరల గుట్టలో చుక్కకూర కనిపెట్టలేని అసమర్థుడిని.

పోనీ ధైర్యం చేసి ఏదో ఒకటి తీయగానే  "మీరు చుక్కకూర అడిగారుగా, తోటకూర తీస్తారే?" అంటాడు. 
"అబ్బె..తాజాగా అనిపిస్తేనూ... చూస్తున్నా! అని తడబడి తప్పించుకుంటా. 

సర్లే, ఈసారికి ఇది తోటకూర అని తెలిసిందిగా, తీసుకెళ్తే సరి , వచ్చేసారి చుక్కకూర సంగతి చూద్దాం! అనుకుని ఇంటికివెళ్తే 
"అదేమిటీ ! చుక్కకూర తెమ్మంటే తోటకూర తెచ్చారు?"

"తినాలనిపించి తెచ్చాలే!" అని నా సమర్థింపు.

అలాగే ఏ కూర ని ఎలా ఎన్నిక చేయాలో అన్న అంశం లో కూడా నేను అంతoత మాత్రమే!

ఉదాహరణకు బెండకాయలు చివర విరవాలిట! దానికి వాడు ఒప్పుకోడు.
సొరకాయ గుచ్చాలిట ... లేతదనం తెలియడం కోసం! నాకు గోళ్లు ఎప్పుడూ ఉండవు. ఒక రవ్వ పెరగ్గానే తీసేస్తూంటా! 

దొండ తెస్తే సగం పండిపోయుంటాయి అంటారు. దోస తెస్తే అబ్బా ... సగం చేదు లే! అన్ని తిట్లు.  ములక్కాడలు ముదుర్లని, మామిడికాయలు పుల్లగా లేవని విమర్శలకు గురవుతుంటా!

ధర్మా మీటర్! అదొక పితలాటకం!
ఎలా చూడాలో ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ పాదరసం ఎక్కడుంటుందో నా ఈ సుదీర్ఘ జీవిత ప్రస్థానంలో ఇప్పటికీ తెలియదు. పైగా అందరూ నన్నే చూడమంటారు ... నా బుర్ర పాదరసం లా పనిచేస్తుందని వాళ్ళ అభిప్రాయంకాబోలు!

హోటల్స్ ,హాస్పిటల్స్ ఇలా చాలా చోట్ల డోర్స్ మీద పుష్, పుల్ ఈ రెండూ రాస్తారు కదా!
ఇక్కడే నేను Confuse అవుతా! ఖచ్చితంగా Pull  అన్న చోట తోస్తా, Push ఉన్నది లాగుతా! సరిగ్గా అప్పుడే ఎవరో రావడం, ఆ డోర్ తగలడం, వాళ్లు చూపుల్తోనే నన్ను అసహ్యించుకోవడం సర్వసాధారణం!

నేను బి.యస్. సి మాథ్స్. కాని కొన్ని లెక్కలు అయితే బొత్తిగా సున్నా!
మీ టీవీ ఎన్ని అంగుళాలు అంటాడు ఒకడు, ఫ్రిడ్జ్ ఎన్ని లీటర్లు అడుగుతాడు మరొకడు! ఎన్నో తెలిసి ఏడిస్తేగా! కాస్త టెక్నికల్  నాలెడ్జ్ ఉన్న మా క్రిష్ణా రావు లాంటి వాళ్లని తీసుకెళ్లి కొనుక్కున్నవి అవన్నీ! వాడుకోవడం తప్ప వివరాలేమీ నా బుర్రకెక్కవు!

ఇక సిలిండర్  లో గేస్ అయిందంటే భయం.
కొత్త సిలిండర్ సీల్  తీసే టెక్నిక్ ఏదో ఉంటుందట! మా ఆవిడకి ఏది రాకపోయినా ఇది మాత్రం మహాబాగా వచ్చు. ఠక్కున తీసేస్తుంది. నాకా కిటుకు చెప్పనేలేదు. పైగా బలవంతంగా తీస్తుంటే పేలిపోతుందేమోనని భయం, చెమటలు. 
నాదృష్టిలో సిలిండర్ నాకో గుదిబండ!

అలాగే సామెతలలో నా మటుకు నాకు కొన్ని మహా తికమకగాఉంటాయి.

ఉదాహరణకు 'అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరమా' లేక  'ఆది నిష్టూరం  కంటే   అంత్యనిష్టూరమా' ఏది మేలు?

అలాగే 'కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలుక పోయిందా?' 'ఉన్న నాలుకకి వేస్తే కొండ నాలుక పోయిందా??'

'ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములా లేక రివర్సా' .. ఇలా సామెతల విషయంలో కూడా ముందు వెనకలవుతూ తప్పుచెప్పి అభాసుపాలయ్యా చాలాసార్లు !

కొత్తగా ఈ మధ్య  కట్టిన బాత్రూమ్ముల్లో స్టీల్ పంపులుంటాయి.
అవి ఏదో ఒకవైపు తిప్పాలి వేడి, చన్నీళ్లకు. నేనెప్పుడూ అటో ఇటో తిప్పగానే పైన ఉన్న  షవర్ లోంచి గబుక్కున వచ్చి బట్టలు తడిసిపోతాయి! తడిసిన బట్టలతో బయటకు వచ్చిన నన్ను చూసి మా ఎనిమిదేళ్ళ మనవడు అదేపనిగా నవ్వుతాడు!

ఒక్కోసారి సడెన్ గా వేడినీళ్లు పడి ఒళ్ళు మండిన సందర్భాలూ లేకపోలేదు. వెధవ టెక్నాలజి!

ఇక ఈప్రపంచంలో “ఆద్యంతాలు“ కనిపెట్టలేనిది ఒకటి ఉంది.

 అదే సెలో టేప్. మొదలు ఎక్కడుందో చివరెక్కడుందో తెలియదు!  కష్టపడి “మొదలు" అనుకుని పట్టుకుని కట్ చేసి అతికించి చూద్దును కదా! తర్వాత భాగం అప్పటికే అతుక్కుపోయి మళ్లీ మొదలు కనపడదు. మళ్లీ కుస్తీ!

చెప్పాలే గాని..ఇలా ఇంకా ఎన్నెన్నో....

నేనొక్కడినే రైతుబజార్ కి వెళితే ఆవిడ తీసుకు రావద్దు అన్న కూరలు, పండ్లు తెచ్చేస్తాను. తెమ్మని చెప్పినవి మరిచి పోతాను.

ఇలా కాదని లిస్ట్ రాసిస్తుంది. అది భద్రంగా జేబులోనే ఉంటుంది. అది ఉందనే విషయం గుర్తు ఉండదు!

స్కూటర్ మీద వెళ్ళి ఎన్నిసార్లు హెల్మెట్ మరిచి పోయానో?

ఇలా రాసుకుంటూ పోతే మరీ నా అప్రయోజకత్వాన్ని బహిరంగం చేసుకోవడమే అవుతుందేమో!!

*అయినా పైకి గొప్పగా "సెవెన్టీ + నాటౌట్! అని చెప్పుకుంటామే గానీ ... మన బాధలెన్నో?*😞

No comments:

Post a Comment