Thursday, August 1, 2024

**** *పెళ్ళంటే మాటలు కాదు గురూ...* (ఆటా వారి అమెరికా భారతి లో వచ్చిన కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 *పెళ్ళంటే మాటలు కాదు గురూ...* (ఆటా వారి అమెరికా భారతి లో వచ్చిన కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
**************************
ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేటోడు. వాడు కొంచెం అమాయకుడు. ఇల్లు, పొలము తప్ప వేరే లోకం సంగతి ఏమీ తెలియదు. ఎవరినీ కలవడు. మాట్లాడడు. కొంతకాలానికి వానికి పెళ్లి వయసు వచ్చింది. చుట్టుపక్కల వున్న వాని ఈడు పిల్లలందరికీ ఒక్కొక్కరికే పెళ్లిళ్లు కాసాగాయి. కానీ వీళ్ళ నాయన వీని గురించి ఏమీ పట్టించుకోవడం లేదు. వానికి పెళ్లి చేసుకోవాలని వున్నా 'మా నాయనకు తెలీదా నాకు ఎప్పుడు చేయాల్నో' అనుకుంటా ఎదురు చూడసాగినాడు. నెమ్మదిగా వానికంటే చిన్నోళ్ళు కూడా పెళ్లి చేసుకుని పిల్లల్ని సంకనేసుకొని వాని ముందే తిరగడం మొదలుపెట్టినారు. దాంతో ఇంక లాభం లేదనుకొని ఒకరోజు వాళ్ళ నాయనతో "నాయనా... ఇంట్లో పెళ్లీడుకొచ్చిన కొడుకు ఒకడున్నాడు అనే విషయం గుర్తుందా లేదా నీకు. అసలు నాకు పెళ్లి చేసే ఆలోచన వుందా లేదా" అని నిలదీసినాడు.
దానికి వాళ్ళ నాయన "రేయ్... పెళ్లంటే మాటలు కాదురా... సంసారం సముద్రం లాంటిది. దానిని ఈదడం నీలాంటి అమాయకులకు అంత సులభం కాదు. ఎంతో ఓర్పు, నేర్పు, పట్టుదల వుండాల, అడుగడుగునా కష్టాలు, అనేకమైన ఒడిదుడుకులు వస్తా పోతా వుంటాయి. వాటిని ఎదుర్కొనే సత్తా నీలో వుందో లేదో తెలియక పెళ్లి చేయడానికి వెనుకడుతా వున్నా" అన్నాడు.
దానికి ఆ అమాయకుడు "నాయనా... మరి అవన్నీ నాలో పెరగాలంటే, నేను కూడా అందరిలాగా తయారు కావాలంటే ఏం చేయాల" అని అడిగినాడు. వాళ్ళ నాయన కాసేపాలోచించి "రేయ్...ఒక పని చెయ్. ఈ లోకంలో ఎవనికైనా సరే అమాయకత్వం పోయి రాటుదేలలంటే దేశసంచారం చేయాల. ఒక ఏడాది పాటు ఇల్లు వదిలి దొరికిన చోట పని చేసుకుంటూ, ఆకలేసిన చోట తినుకుంటూ, నిద్ర వచ్చిన చోట పడుకుంటూ, కనబడిన వాళ్ళందరితోనూ మాట కలుపుతూ, చూసిన ఊరు చూడకుండా, విశేషాలు వింతలు తెలుసుకుంటూ, దేశం అంతా తిరిగిరా. అలా వచ్చేటప్పుడు కప్ప లగువు, చీమ బిగువు, మనిషి మాటకారితనం... ఈ మూడింటికి అర్థం తెలుసుకొని రా. అప్పుడు నీకు తప్పెట్లు మేళాలతో... ఊరు ఊరంతా ఊరేగిస్తూ... నింగికి నేలకు పందిరేసి, ఎక్కడెక్కడి బంధువులందరినీ పిలిపించి బ్రహ్మాండంగా పెళ్లి చేస్తా" అని చెప్పినాడు.
దాంతో వాడు సరేనని తర్వాత రోజు పొద్దున్నే తలస్నానం చేసి, సద్దిమూట కట్టుకొని, అమ్మానాన్నల కాళ్లు మొక్కి దేశాటనకు బయలుదేరినాడు. ఎండకు ఎండుతా, వానకు తడుస్తా, చలికి వణుకుతా, దొరికినప్పుడు తింటా, దొరకనప్పుడు వుత్త నీళ్లు తాగుతా, ఒక్కొక్క ఊరే తిరుగుతా, అందరితో మాట కలుపుతా, నెమ్మదిగా రాటుదేలసాగినాడు.
అట్లా మూడునెలలు గడిచినాయి.
ఒకరోజు ఒక గుడి ముందు ప్రసాదం పంచి పెడతా వుంటే తాను కూడా తెచ్చుకొని ఒక బండమీద కూర్చుని తినసాగినాడు. అట్లా తింటావుంటే వాని చూపు అక్కడ ఒక చీమ మీద పడింది. ఆ చీమ చిన్నగా వున్నా దానికి పదింతల బరువున్న బియ్యపు గింజను పట్టుకొని లాక్కొని పోతావుంది. మధ్యలో చిన్న చిన్న రాళ్లు వచ్చినా, ఆకులు వచ్చినా, భూమి ఎగుడుదిగుడు వున్నా, పట్టినపట్టు వదలడం లేదు. అంత పెద్దదాన్ని అలాగే కిందా మీదా పడతా వదలకుండా లాక్కొని పోతావుంది. అది చూస్తావుంటే వానికి వాళ్ళ నాయన చెప్పిన 'చీమ బిగువు' అనే మాట మతికివచ్చింది.
'ఈరోజు నేను ఒక్కడినే. కానీ ఆ తరువాత పెళ్ళాం పిల్లలు, కుటుంబం... చూస్తుండగానే పెద్దగా మారిపోతుంది. ఖర్చులు అవసరాలు పెరిగిపోతాయి. కానీ ఏమాత్రం తొణక్కుండా చిన్న చీమ కదా ఒక్కటే తనకన్నా పదింతల బరువు వున్న బియ్యపుగింజను లాక్కొని పోతావున్నట్లు ఇంతపెద్ద కుటుంబాన్ని లాక్కొని పోవాలి' అని వానికి వాళ్ల నాన్న చెప్పిన మాటకు అర్థం బోధపడింది. పెదవులపై చిరునవ్వు మెరిసింది. హమ్మయ్య ఒకదానికి అర్థం తెలుసుకున్నాను అనుకున్నాడు.
మరలా దేశాటన మొదలైంది. మరో నాలుగు నెలలు గడిచినాయి. అట్లా పోతావుంటే దారిలో ఒక కాలువ అడ్డం వచ్చింది. దాదాపు పది అడుగుల వెడల్పు వుంది. దాంతో పంచె పైకి ఎగ్గట్టి నెమ్మదిగా కాలువలోకి దిగినాడు. ఆ ఒడ్డున ఒక కప్ప వుంది. వీడు నీళ్లలోకి దిగగానే ఆ చప్పుడుకి అదిరిపడి ఒక్కసారిగా ఎగిరి అవతలి ఒడ్డుకు దూకింది. అది చూసి ఆ అమాయకుడు ఇంత చిన్న కప్ప పది అడుగుల దూరాన్ని అంత అవలీలగా ఒక్క లగువుతో ఎట్లా దాటిందబ్బా అని ఆశ్చర్య పోయినాడు. అంతలో వానికి వాళ్ల నాయన చెప్పిన 'కప్పలగువు' అనే మాట మతికి వచ్చింది. 'సంసారంలో ఎప్పుడు ఎటువైపు నుంచి హఠాత్తుగా ఏ సమస్య వచ్చి మీద పడుతుందో ఎవరికీ తెలియదు. కానీ నెత్తిమీదికి ఎంత ఆపద ముంచుకొచ్చినా సరే ఏమాత్రం తొణక్కుండా కప్ప గదా అంత పెద్ద కాలువను అవలీలగా ఒక్క లగువుతో దాటినట్లు సమస్యను దాటగలగాల అని నాన్న చెప్పిన మాటకు వెనుక వున్న అర్థం బోధపడింది. చేతులు ఎత్తి నాన్నకు మనసులోనే దండం పెట్టుకున్నాడు.
మరలా ముందుకు సాగినాడు. అట్లా అనేక దేశాలు తిరుగుతా వున్నాడు. ఏడాది పూర్తవుతా వుంది గానీ 'మనిషి మాటకారితనం' అనే మాటకు మాత్రం అర్థం మాత్రం దొరకలేదు. దానిని తెలుసుకోకుండా ఎట్లా ఇంటికి పోవాల, ఏ మొగం పెట్టుకొని పెళ్లి చేయమని అడగాల అనుకుంటూ దిగులుగా ఒక ఊరి ముందున్న మంచినీటి చెరువు కాడ కూర్చుని ఆలోచనలో పడినాడు. చానామంది ఆడోళ్ళు, మొగోళ్ళు నీళ్లకోసం వస్తా వున్నారు, పోతా వున్నారు కానీ ఎవరూ వాని గురించి పట్టించుకోవడం లేదు.
ఆ ఊరిలో ఒక అమ్మాయి వుంది. చానా తెలివైనది. మాటకారి. ఆ అమ్మాయికి కొత్తగా ఆరు నెలల కిందనే పెళ్లయింది. నీళ్లకోసం బావి దగ్గరికి వచ్చింది. నీళ్లు మంచుకుంటా ఈ అమాయకున్ని చూసింది. 'ఎవరబ్బా ఇతను. ఈ ఊర్లో ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదే' అనుకుంది. బిందె తీసుకొని వెళ్ళిపోయింది. మళ్ళా కాసేపటికి నీళ్లకోసం వచ్చింది. ఇంకా అతను అక్కడే కూర్చొని కనబడినాడు. 'పాపం... ఎవరికోసమో ఎదురు చూస్తా ఉన్నట్టున్నాడు చానాసేపటి నుంచి' అనుకుంటూ బిందె తీసుకొని వెళ్ళిపోయింది. మరో గంటకు మళ్ళా నీళ్లకోసం వచ్చింది. ఆ అమాయకుడు ఇంకా అక్కడే కనబన్నాడు. 'ఎవరబ్బా ఇతను పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నాడు. ఏంది సంగతి?' కనుక్కుందామని వాని దగ్గరికి వచ్చి "ఎవరు నువ్వు? ఎక్కడినుంచి వచ్చినావు? ఎవరికోసం పొద్దున్నుంచీ ఎదురు చూస్తా వున్నావు? ఏమి నీ సమస్య?" అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది.
దానికి వాడు జరిగిందంతా చెప్పి "ఈరోజుతో నేను దేశాటనకి బయలుదేరి ఏడాది పూర్తవుతా వుంది. ఇంక రేపు మా ఊరికి పోవాల. కానీ చీమ బిగువు, కప్ప లగువుల గురించి తెలుసుకున్నా కానీ మనిషి మాటకారితనం గురించి మాత్రం తెలుసుకోలేకపోయినా. మా నాయనకు నా ముఖం ఎట్లా చూపించాల" అన్నాడు బాధగా.
ఆమె చిరునవ్వు నవ్వి "సరే... నా వెంట రా. అక్కడ నోరు తెరిచి ఒక్క మాటా మాట్లాడొద్దు. మనిషి మాటకారితనం ఎట్లా వుంటుందో నీకు అర్థం అయ్యేలా చేస్తా. ఒక మనిషి పెళ్ళికి సాయం చేస్తే వంద బావులు తవ్వించినంత పుణ్యం వస్తాదంట" అనింది. వాడు 'సరే' అని గమ్మున మూగోని లెక్క ఆమె వెంట బయలుదేరినాడు.
నీళ్లకని పోయిన పెళ్ళాం ఎవరో కొత్తవ్యక్తిని వెంటబెట్టుకొని రావడం చూసి ఆమె మొగుడు ఆశ్చర్యంగా "ఎవరే ఈయన... ఇట్లా ఇంటికి పిలుచుకోని వచ్చినావు" అని అడిగినాడు. దానికామె చిరునవ్వు నవ్వి "ఈయన నాకు వరుసకు బావ అవుతాడు. పుట్టు మూగ. మన మాటలు వినబడతాయి గానీ నోరు తెరిచి ఒక్క మాటా మాట్లాడలేడు. మన పెళ్లి జరిగే సమయంలో దేశాటనకు పోయినాడు. అందుకే అప్పుడు కనపడలేదు. ఊరూర్లు తిరుగుతా... తిరుగుతా... ఈరోజు మన ఊరికి వచ్చినాడు. అనుకోకుండా చెరువు కాడ కనపడితే గుర్తుపట్టి ఇంటికి పిలుచుకొని వచ్చినా. మధ్యాన్నం అన్నం తిని వెళ్ళిపోతాడు" అని చెప్పింది. ఆ మాటలు విని అత్తామామలు, బావమరదులు సంబరంగా "అట్లాగా... అయితే వెంటనే మధ్యాన్నం బాగా మసాలా యేసి కమ్మని కోడి కూర, పలావు చెయ్. తిని పోతాడు. మళ్ళా ఎప్పుడు చూస్తామో ఏమో" అంటూ కాసేపు విశ్రాంతి తీసుకోమని గది చూపించినారు. వాడు ఉడుకుడు నీళ్లతో స్నానం చేసి హాయిగా మంచం మీద నిద్రపోయినాడు.
మధ్యాన్నం గుమగుమలాడేలా కోడికూర చేసినారు. గురకలు బెడతా నిద్రపోతా వుండడంతో లేపడం ఎందుకని అందరూ భోజనం చేసి ఇంటి బయట కూర్చుని మాటల్లో పడినారు. కాసేపటికి గదిలో ఆ అమాయకుడు నిద్ర లేవడంతో ఆ అమ్మాయి కోడికూర, జొన్నరొట్టె, పలావు, నీళ్లు తీసుకొని గదిలోనికి పోయింది. ఆ అమాయకుడు అన్నీ తిని నీళ్లు తాగుతా వుంటే ఉన్నట్టుండి గట్టిగా "పట్టుకుండే పట్టుకుండే... రండి కాపాడండి... కాపాడండి" అంటూ కప్పెగిరి పోయేటట్లు గట్టిగా అరిచింది. ఆ అరుపులు వినగానే బయట కూర్చున్న అత్తామామలు, ఆమె మొగుడు అదిరిపడినారు. లోపల వాడు అమ్మాయి చేయి పట్టుకున్నాడేమో అని భయపడి దొరికిన కత్తులు, కట్టెలు తీసుకొని వేగంగా లోపలికి బుసలు కొట్టుకుంటా దూసుకొచ్చినారు. వాళ్ల చేతుల్లోని ఆయుధాలు చూడగానే ఆ అమాయకుని పైప్రాణాలు పైన్నే పోయినాయి. భయంతో వణికిపోయినాడు.
వాళ్లు చూస్తే ఇంకేముంది వాళ్ళ కోడలు ఆ అమాయకుని గొంతు నెమ్మదిగా పట్టుకొని కిందికి మీదికి నిమురుతా కనబడింది. వాళ్ళు అర్థంకాక "ఏమ్మా ఏమైంది. అట్లా అరిచినావు" అని అడిగినారు. దానికి ఆమె "మా బావ ముక్క మింగుతా వుంటే గొంతుకు అడ్డంపడి పట్టేసింది. ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటా వుంటే బెదపడి అరుస్తి" అనింది. ఆ మాటలకు వాళ్ళు "అంతేనా... తినేటప్పుడు కొంచెం జాగ్రత్త నాయనా. నెమ్మదిగా మధ్యమధ్యలో నీళ్లు తాగుతా తిను. లేకుంటే గొంతు ఎండిపోయి మద్ద దిగక పట్టుకుంటాది" అని చెప్పి నీళ్లు తాపి పోయినారు. అప్పటికే భయంతో ఆ అమాయకుని ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దయింది.
అప్పుడు ఆమె "ఇప్పుడు అర్థమైందా... మనిషి మాటకారితనం అంటే ఏమిటో. మాట రెండు వైపులా పదునైన కత్తి లాంటిది. ఒక్క నిమిషంలో చంపించనూ గలదు. మరుక్షణమే బతికించనూ గలదు. ఇంక పోయి మీ నాయనకు అన్నీ చెప్పి హాయిగా పెళ్లి చేసుకో. ఈ చెల్లిని మరిచిపోక గుర్తు పెట్టుకో" అనింది నవ్వుతూ. ఆ అమాయకుడు ఆమెకు దండం పెడతా "అమ్మా... ఏమో అనుకుంటి గానీ నీవు చానా గొప్పదానివి. మనిషి తన మాటకారితనంతో ఎప్పుడు ఎట్లా ఆపదలు సృష్టిస్తాడో, ఎట్లా బయట పడేస్తాడో కళ్ళకు కట్టినట్టు చూపించినావు. చావు చివరి అంచు దాకా పోయి వచ్చినట్లు అనిపించింది. జీవితంలో మనచుట్టూ ఉండే మనుషులతో ఎంత జాగ్రత్తగా మసులుకోవాలో అర్థమైంది" అంటూ అందరికీ మౌనంగా దండం పెట్టి సంబరంగా ఊరికి బయలుదేరినాడు.
**************************
డా.ఎం.హరికిషన్-కర్నూల్ -9441032212
**************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.

No comments:

Post a Comment