Saturday, August 17, 2024

నేటి కథ ✍🏼* *జింక-పులి*

 *✍🏼 నేటి కథ ✍🏼*


*జింక-పులి*

ఆవు-పులి కథ తెలుసా, మీకు?! ఇది కూడా ఆ కథే, మరో రకంగా చెప్పింది ఈ పాప!

అనుసరణ: పి.మమత, పదవ తరగతి, కస్తూరిబాగాంధీ బాలికా విద్యాలయ, ఝరాసంగం, మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం.


అడవిలో ఒంటరిగా వెళ్తున్న జింకను, అప్పుడే వేటకు వెళ్ళి వస్తున్న ఒక పులి చూసి, దాని వెంట పడింది.

గర్భిణి అయిన జింక వేగంగా పరుగెత్తలేక, దానికి దొరికి పోయింది: ఇంక తప్పించుకునే అవకాశం లేకుండా ఇరుక్కుపోయింది.
పులి తన పంజా ఎత్తి దాన్ని ఒక్క దెబ్బ కొట్టబోయేంతలో అది "దయచేసి నన్ను చంపొద్దు. నేను కడుపుతో ఉన్నాను. కడుపులో ఉన్న ఆ పిల్ల కూడా నాతోపాటు నిష్కారణంగా చచ్చిపోతుంది. ఇంకా కళ్ళు తెరవని కూనను చంపడం పాపం: నీకు ఆ అవసరం లేదు. కాన్పు కాగానే, ఆ పిల్లను ఓసారి కళ్ళారా చూసుకుని, మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తాను- కాదనకు" అని దణ్ణం‌పెట్టింది.


"గర్భంలో ఉన్న పిల్ల లేతగా, మరింత రుచిగా ఉంటుంది. నేను మీ‌ ఇద్దరినీ ఒకేసారి తినేస్తాను" అన్నది పులి.

"దయచేసి నా మాట విను. నువ్వు ఎప్పుడైనా నీకు దొరికిన జంతువుల తల్లుల్ని, తండ్రుల్ని తినచ్చు; కానీ పిల్లలను మటుకు తినకు. పిల్లల వల్ల జంతువుల సంతతి నిలబడుతుంది" అన్నది జింక.

"నేను కాకపోతే మరే మృగమైనా నిన్ను తింటుంది. నీ మాటలు నమ్మేదెలా?" అన్నది పులి.

"నన్ను నమ్ము పులి రాజా ! నాకు బిడ్డ పుట్టగానే నీ దగ్గరకు వచ్చేస్తాను" అని ఏడ్చింది జింక.

"సరే వదిలేస్తున్నాను. వెళ్లు! నా గుహకు తలుపులు లేవు. పిల్ల పుట్టగానే నువ్వు నేరుగా నా గుహలోకే వచ్చేయాలి" అని దాన్ని వదిలేసింది పులి.

"మాట తప్పను పులిరాజా! కృతజ్ఞతలు!" అంటూ తన మందను చేరుకున్న జింక, ఈ కథనంతా తోటి జింకలకు చెప్పుకొని,"బిడ్డ పుట్టగానే దాన్ని వదిలేసి పోతాను నేను. పులికి ఆహారమైపోతాను. నా బిడ్డను ఇక మీరే సాకాలి" అని అభ్యర్థించింది. తోటి జింకలన్నీ కంట తడి పెడుతూ సరేనన్నాయి.


కొద్ది రోజులకు దానికి ఒక బుజ్జి జింక పిల్ల పుట్టింది. ఆ పిల్లను దగ్గరకు తీసుకుని కన్నీరు కార్చిందది. కానీ ఇక ఆలసించకుండా ఆ బిడ్డను తోటి జింకలకు అప్పగించి, తాను నేరుగా పులి గుహలోకి పోయింది.

ఇచ్చిన మాట ప్రకారం తిరిగి వచ్చిన జింకను చూసి పులి చాలా ఆశ్చర్య పోయింది. "మాట కోసం తిరిగి వచ్చావు నువ్వు. చాలా గొప్పదానివి. నాకు ప్రస్తుతం ఆకలిగా కూడా లేదు. నిన్ను చంపను- పో" అని పులి దాన్ని చంపకుండా వదిలేసింది.

దానికి కృతజ్ఞతలు చెప్పుకొని, పిల్లను తిరిగి చూడాలన్న ఉత్సాహంతో గబగబా ఇంటికి పరుగు పెట్టింది జింక."

No comments:

Post a Comment