Tuesday, August 13, 2024

****👁 అంతర్నేత్రం 👁 *చూపు మారితే…* *సర్వస్వమూ మారుతుంది!*

 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః
🚩🚩నమః శుభోదయం 🚩🚩
విమలానంద బొడ్ల మల్లికార్జున్

       👁 అంతర్నేత్రం 👁

              *చూపు మారితే…*
       *సర్వస్వమూ మారుతుంది!*
              
`అన్ని పనులూ అయిపోయాక, కొన్ని క్షణాలు కళ్లు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవటం సాధారణంగా మనలో చాలామందికి అలవాటు ఉండదు. చక్కగా కళ్లు మూసుకుని కూర్చోవడం ఒక కళ. ఆ కళను అభ్యసించాలి.
ఈ గందరగోళ జీవితంలో ప్రశాంతంగా కూర్చోవడం సాధ్యపడటంలేదు. నిర్మలమైన ఆకాశాన్ని చూడటం మరిచిపోయాం. నిశ్చలమైన మనసును అనుభూతి చెందటం మనకు తెలియటం లేదు.

కళ్లు మూసుకున్నంత మాత్రాన ప్రపంచం మనల్ని వదలిపోదు. బాహ్య ప్రపంచాన్ని విడిచిపెట్టి అంతరంగ ప్రపంచంలోకి ప్రవేశిస్తాం. లోపల ఎన్నో అద్భుతాలు.             ఓ చిన్న కనురెప్ప రెండు ప్రపంచాలను వేరుచేస్తూ, కలుపుతూ ఉంటుంది.

కళ్లు మూసుకుని లోపలికి వెళుతున్న కొలది, కళ్లు తెరుచుకుని చూస్తున్నప్పుడు కనిపించేదంతా ఓ కలగా, మాయగా చివరికి శూన్యంగా మారిపోతుంది. అక్కడ గొప్ప ప్రశాంతత ఉంటుంది.

ఒక గురువు కళ్లు మూసుకుని కూర్చుని ఉన్నాడు. అతణ్ని ఓ వ్యక్తి సమీపించి 'మీరు చేస్తున్నది ఏమిటి?'అని అడిగాడు.

'లోపల చూస్తున్నాను' అని ఆ గురువు చెప్పాడు. 

ఆ వ్యక్తి గందరగోళంలో పడిపోయాడు.
'కళ్లు మూసుకుని చూస్తున్నారా?' ఆశ్చర్యపోతూ అడిగాడు.

'అవును... అదే నిజమైన చూపు'

కళ్లు తెరుచుకున్నప్పుడు అవి అనంతంలోకి చేరుకోగలవు. కాని అవే కళ్లు మూసుకుని లోపలికి చూసినప్పుడు అనంతత్వపు ద్వారాలు తెరుచుకుంటాయి. అక్కడ మన స్వస్వరూపం కనిపిస్తుంది. అప్పుడే విశ్వరూపం బయటపడుతుంది.

కనిపిస్తున్న దృశ్యాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని అనుకుంటారు. 
ఆ దృశ్యాన్ని ప్రదర్శిస్తున్నవాణ్ని (భగవంతుని)’చూడాలని అనుకోరు. ఈ అందాలకు, ఆనందాలకు, అనుభూతులకు కారణం... లోపల ఉంది.

రబియా అనే ఒక యోగిని ఉండేది. ఓ సుందరమైన ప్రభాతవేళలో ఎవరో 'రబియా! కుటీరంలో ఏం చేస్తున్నావు? బయటికి రా, ఇక్కడికొచ్చి చూడు. ఎంత అందమైన ఉదయాన్ని సృష్టించాడో దేవుడు!' అన్నారు.

కుటీరం లోపలి నుంచి రబియా ఇలా అంది. 'నీకు బయట కనిపిస్తున్న ఆ సుందర ఉదయాన్ని సృష్టించిన వాణ్ని నేను ఇక్కడినుంచే చూస్తున్నాను. ఓ మిత్రుడా! నువ్వే లోపలికొస్తే మంచిది. బయట ఉన్న ఏ అందమూ అందం అనిపించుకోదు- ఇక్కడున్న అందం ముందు!'

దర్శింపజేస్తున్నవాణ్ని దర్శించాలి!

కాని, కళ్లు మూసుకునే ఉంటాం. లోపల ఉండం. ఎప్పుడూ బయటే ఉంటాం. మూసుకున్నంత మాత్రాన కళ్లు మూతపడతాయా? కళ్లు మూసుకున్నా బయట దృశ్యాలు వేదిక మీద ప్రదర్శించే దృశ్యాల్లా అలా వెంటాడుతూనే ఉంటాయి...

కనురెప్పలు మూతపడటం- కళ్లు మూసుకోవడం కాదు. కళ్లు మూసుకోవడం అంటే లోపలికి దిగి వస్తున్న కలల నుంచి, ఆలోచనల నుంచి స్వేచ్ఛను పొందడం.

కళ్లు మూసుకోవడం అంటే- దృశ్యాలన్నీ మాయమైపోయి అంతరంగంలో నిశ్చలంగా ఉండిపోవడం. కళ్లు మూసుకోవడం అంటే, నిశ్చలానందాన్ని అనుభవించడం. కళ్లు మూసుకోవడం అంటే, దివ్య చైతన్యాన్ని నీ ముందర సాక్షాత్కరింపజేసుకోవడం. అదే సత్యం. అదే బ్రహ్మానంద పారవశ్యం. అదే జగత్తును ఆడిస్తున్న క్రీడ. అదే శివం. అదే సుందరం.```

చూపు మారితే సర్వస్వమూ మారుతుంది!

జై గురుదేవ్ 👏

No comments:

Post a Comment