Tuesday, August 13, 2024

భోజనం చెయ్యడం… ఒక శాస్త్రం !

 *భోజనం చెయ్యడం… ఒక శాస్త్రం !*
                   
గత పదిహేనేళ్లుగా జరుగుతున్న పెళ్లిళ్లు చూడండి...

పేరుకు పెళ్లే కానీ వేదిక మీద ఏమి జరుగుతుందో మనకు కనిపించదు ! 

వారికి నలువైపులా ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు చుట్టుముట్టి ఉంటారు.  

మంగళ వాయిద్యాలను బట్టి తాళికట్టే శుభవేళ అయిందని అర్ధం చేసుకోవడమే !

ఆ తరువాత వీలయితే స్టేజ్ ఎక్కి  వధూవరుల మీద నాలుగు అక్షింతలు విసిరివెయ్యడం... తదుపరి పెళ్లిపెద్దలు చెప్పినా చెప్పకపోయినా  భోజనశాలలోకి దూరడం, బరువైన పింగాణీ ప్లేటును పట్టుకుని యాచకుల్లా వరుసలో నిలబడటం, కావలసిన పదార్ధాలు వడ్డించుకోవడం,   చెమటలు కక్కుకుంటూ నిలబడి తినడం, ఎక్కడో దూరాన ఉన్న మంచినీళ్ళకోసం పరుగెత్తడం సర్వసాధారణం.  

అతిధులు ఎవరు వస్తున్నారో, ఎవరు తింటున్నారో ఎవ్వరూ గమనించరు.  

తోసుకుంటూ వెళ్లడం, ఒక్కోసారి బట్టల మీద ఆహారపదార్ధాలు ఒలకడం కూడా చాలామందికి అనుభవమే.  

మనల్ని పెళ్ళికి పిలిచిన కుటుంబం వారు అక్కడ ఒక్కరు కూడా ఉండరు.  

అతిధుల్లో తొంభైతొమ్మిది శాతం మంది మనకు పరిచయం ఉండరు.   

కొంతమంది విలువైన ఆహార పదార్ధాలను ఎంత తిన్నారో అంతకు రెట్టింపు పారేస్తారు.  

ఎవరు ప్లేటును చెత్తబుట్టలో వేస్తున్నప్పుడైనా చూడండి... దానిలో మరో మనిషికి సరిపోయే పదార్ధాలు ఉంటాయి. 

మా చిన్నతనంలో.. అనగా సుమారు ముప్ఫయి అయిదు - నలభై ఏళ్ళక్రితం ఇలా ఉండేది కాదు!

పెళ్లిళ్లకు వెళ్తే భోజనాలు  నేలమీదనే.    కూర్చోడానికి  పంక్తిచాపలు ఏర్పాటు చేసేవారు.  అందరూ వరుసలో చిరుచాపల మీద కూర్చున్న తరువాత అరిటాకులు లేదా మద్ది ఆకులతో కుట్టిన విస్తర్లు  వేసేవారు.  ఆ తరువాత ముందుగా పచ్చడి, పప్పు, కూరలు, లడ్డు లేదా బాదుషా, అరటికాయ బజ్జీలు, కమ్మని పొడి, వడియాలు, అప్పడాలు, ఊరమిరపకాయలు వడ్డించేవారు.  ఆ తరువాత పులుసు, సగ్గుబియ్యం పాయసాన్ని అభికరించేవారు.  అభికరించడం అంటే గరిటెతో పులుసు, పాయసాన్ని విస్తరిలో ఒక చుక్క పడేట్లుగా అంటించేవారు.  అనగా ఆ విందులో ఆ రెండు పదార్ధాలు కూడా ఉన్నాయని అర్ధం!  ఆ తరువాత నెయ్యి కొమ్ముచెంబులతో పోసేవారు.  (వేసేవారు కాదు).

అప్పుడు అక్కడున్న ఒక పెద్దాయన ఔపోసన పట్టి "ఇక కానివ్వండి"  అనగానే అందరూ భోజనాలకు ఉపక్రమించేవారు.  

ముద్ద నోటిలో పెట్టుకునే ముందు చాలామంది కళ్ళకు అద్దుకునేవారు. 

ఇక వడ్డించే వారు (యువతీయువకులు)  యమా హుషారుగా పోటీలు పడి పదార్ధాలను మళ్ళీ మళ్ళీ తెస్తూ "ఇంకొంచెం వేసుకో మామా... ఈ కూర కాస్తేసుకో బాబాయి.. బావా...ఈ గుత్తి వంకాయ వేసుకుంటే ఇక ఇక్కడినుంచి కదలవు"  అని చిన్నా పెద్దా తేడా లేకుండా సరదాగా ఆటలు పట్టిస్తూ  వడ్డనలు చేసేవారు.  

వీరు వడ్డనలు చేస్తుంటే పెళ్లి పెద్ద.. అతిధులమధ్య తిరుగుతూ... ఎలా ఉన్నాయి వంటలు ?  అని ప్రశ్నిస్తూ కుశలప్రశ్నలు వేస్తూ "వడియాలు కాసిని తెండ్రా... అదిగో పెదనాన్నకు రెండు అప్పడాలు వేయి.. తాతకు నెయ్యి ఇంకొంచెం పొయ్యారా"  అంటూ ఆప్యాయతను వడ్డించేవాడు కుటుంబ పెద్ద.  

అక్కడ మనతో భోజనం చేసేవారంతా మన బంధువర్గంలోనివారే అయ్యుంటారు.  
  
90 శాతం మంది భోజనాలు ముగించాక....ఇంకా ఎవరైనా భోజనం చేస్తూ కనిపిస్తే...అతిధులు కొందరు పాండవోద్యోగ విజయాలు, కురుక్షేత్రం, చింతామణి  నాటకాలలోని పద్యాలను రాగయుక్తంగా, శ్రావ్యంగా ఆలపించేవారు.  అయిదారు పద్యాలు అయ్యాక అంతలో ఒకాయన "భోజనకాలే హరినామస్మరణ... గోవిందా గోవిందా"  అనేవాడు.  అప్పుడు మాత్రమే  అందరూ లేచేవారు.   

మనం కూర్చున్న వరుసలో ఇంకా ఎవరైనా పెరుగన్నంలోనే ఉంటే వారు పూర్తిగా భుజించాకే లేచేవారు.  

భోజనాలు చేసిన తరువాత వారు తిన్న విస్తళ్ళన్నీ  కడిగారా అన్నట్లుగా శుభ్రంగా ఉండేవి.  ఒక్క మెతుకు కూడా కనిపించేది కాదు.  

చేతులు కడుక్కోగానే అక్కడే ఏర్పాటు చేసిన నులకమంచాల మీద కూర్చుని పళ్ళాలలో సిద్ధంగా ఉంచిన తమలపాకులు, వక్కపొడి, సున్నం ఎవరికి కావలసిన మోతాదులో వారు తీసుకుని మళ్ళీ పెళ్లిపనులలో మునిగిపోయేవారు.  

ఈ భోజనం చెయ్యడం అనే మహత్తర కళ అతి కొద్దిమందికే తెలుసు. కొందరు తింటుంటే చూడముచ్చటగా ఉంటుంది.  సున్నితంగా మునివేళ్లతో కలిపి తింటారు.  కొందరు చపాతీ పిండిని పిసికినట్లు చెయ్యి మొత్తం ముంచి కసకసా అన్నం మీద కక్ష కట్టినట్లుగా పిసుకుతారు.  చేతివేళ్ళమధ్యలోని అన్నం బయటకి వస్తుంది.  చూస్తుంటే కంపరం కలుగుతుంది.  కొంతమంది తిన్న తరువాత విస్తరి ఎలా ఉంటుందంటే... అది కొత్త విస్తరి అంటే నమ్మాలి.  ఒక్క మెతుకు కనిపించదు.  పదార్ధాల తాలూకు అవశేషం కూడా కనిపించదు.  అలా ఎలా తింటారో నాకు ఆశ్చర్యం కలుగుతుంది.  

మరికొందరు తిన్న తరువాత విస్తరి చూస్తే ఆ అన్నాన్ని మనుషులు తిన్నారా లేక ఎలుకలు తిన్నాయా అన్నట్లు చిందరవందరగా, విస్తరిని ఎత్తేసేవారికి కూడా అసహ్యం కలుగుతుంది.  

కొందరు భోజనం చేస్తున్నప్పుడు గ్లాసులు గ్లాసులు నీళ్లు తాగుతుంటారు.  

కొంతమంది పెరుగన్నం తిన్నదాకా గ్లాస్ ముట్టుకోరు.  నిజానికి భోజనం చేసే మధ్యలో మంచినీరు తాగకూడదు.  కొందరు వడ్డించిన పదార్ధాలన్నీ  భుజిస్తారు.  

కొందరు అన్నీ వేయించుకుంటారు.
సగం కూడా తినకుండా వ్యర్ధంగా వదిలేస్తారు.  

భోజనం చేసే పద్ధతిని బట్టి కూడా వ్యక్తుల మనస్తత్వాన్ని అంచనా వెయ్యవచ్చు.  

కావలసిన పదార్ధాలను మాత్రమే వడ్డించుకుని, శుభ్రంగా తినేవారు జీవితంలో పొదుపరులు అని, అవసరం లేనివాటిని కూడా వడ్డించుకుని మొత్తం అవతలపారేసేవారు అతిపెద్ద దుబారా మనుషులుగా అంచనా వెయ్యవచ్చు అంటారు పెద్దలు.  

భోజనం చేయడము ఒక పెద్ద శాస్త్రం. ఎప్పుడైతే…  బఫె సిస్టం వచ్చిందో... అప్పటినుంచి పెళ్ళిభోజనం అనే మాటకు విలువ లేకుండా పోయింది.  అలనాటి మధుర దృశ్యాలు మాయమై పోయాయి.  

ఒకప్పటి పెళ్ళిభోజనం అంటే షడ్రసోపేతమైన విందు.    పదార్ధాలు నాలుగైదే ఉన్నా అది కడుపుకు మహాపసందు. కడుపారా తిని త్రేన్చుతాము.  

ఇప్పటి పెళ్ళిభోజనం అంటే మొక్కుబడి.  వందల రకాల పదార్ధాలు కనిపిస్తుంటాయి.  నాలుగు రకాలు కూడా తినలేము.  మనల్ని తినమని అడిగేవారే ఉండరు. భోజనం చేశారా అని అడిగే దిక్కు ఉండదు...

సంఖ్య ఎక్కువ అయింది..   నిజమే. కూచోబెట్టి పెట్టే అవకాశం లేదు. వచ్చిన వాళ్లకు అంత టైమూ లేదు.. 

కానీ ఏదో ఒకటి చేయాలి. పెళ్లి మన పద్ధతుల్లో కేవలం బంధువులతో... 

ఆపై అందరికీ ఇదుగో ఈ పైన చెప్పుకున్నట్లుగా బావుంటుందేమో.

No comments:

Post a Comment