రామాయణమ్.12
.
తెలతెలవారుతున్నది తూర్పుదిక్కు అప్పుడే విచ్చుకుంటుంన్నది .
గడ్డిపక్కపైన పట్టుపరుపులమీద పడుకున్నంత హాయిగా రామలక్ష్ష్మణులు నిదురిస్తూఉన్నారు.
వారి ముఖాలను కనురెప్పవాల్చకుండా తనివితీరా చూస్తూ ఉన్నారు మహర్షి!
రామునిముఖపద్మంలోని సౌందర్యము అనే మధువును గ్రోలే తుమ్మెదలా ఉన్నారాయన! .
ఆయన రాముడికి మేలుకొలుపు పాడుతున్నారు రామా నిద్దురలే అని!
.
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సన్ధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యమ్ దైవమాహ్నికమ్!
.
కౌసల్యా సుప్రజా ...కౌసల్యయొక్క ఉత్తమ సంతానమైన
రామా.... ఓ రామా
పూర్వా సంధ్యా ప్రవర్తతే...తూరుపు దిక్కున తెలవారబోతున్నది
ఉత్తిష్ఠ.....లెమ్ము
నరశార్దూలా.. మానవులలో శ్రేష్టమైన వాడా!
కర్తవ్యమ్ దైవ మాహ్నికమ్...ప్రతిదినము చేయవలసిన పనులు చేయాల్సిఉన్నది.
.
రామలక్ష్మణులు సంధ్యావందనాది పనులన్నియు చక్కగా ఆచరించి మరల మునివెంట బయలుదేరినారు.
.
అలా నడచినడచి సరయూ,గంగానదుల సంగమప్రదేశం చేరినారు!.
.
అక్కడ వేల సంవత్సరాల నుండి తపస్సుచేస్తున్న ఎంతోమంది ఋషీశ్వరులగుపించారు. ఆప్రదేశాన్ని అంతటిని ఆసక్తిగా చూశారు రామలక్ష్మణులు .
అక్కడ ఒక ఆశ్రమము చూశారు ,అది చూడగనే వారి మనస్సులో ఏదో తెలియని ఆనందం ప్రవేశించింది. కుతూహలంతో మహర్షిని ప్రశ్నించారు!
"మహర్షీ ఈ ఆశ్రమము ఎవ్వరిది?".
.
ఇక్కడ పూర్వము పరమశివుడు తపమాచరించేవాడు!
ఆయనకు అప్పుడే వివాహం జరిగింది. శివుడంతటివాడు వివాహం చేసుకోవటంతో, అది నావల్లనే జరిగింది అని అహంకరించాడు మన్మధుడు ( అప్పుడు మన్మధుడికి శరీరముండేది).
శివుడు ఆతడి అహంకారాన్ని చూసి హుంకరించాడు!
మూడోకన్నుతెరచి మన్మధుని చూశాడు .అప్పుడు మన్మధుడి శరీరంలోని ఒక్కక్క అంగము కాల్చివేయబడింది!
మన్మధుడు దేహము విడిచిన ప్రదేశము కాబట్డి అంగదేశము అని పేరు వచ్చింది!
.
పరమపావనమైన ఈ ప్రదేశంలో ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం .
రేపు తెల్లవారగనే గంగను దాటుదాం అని గంగాస్నానం చేసి శుచిగా ఆశ్రమంలో ప్రవేశించారు!
.
శ్రీ రాముని వెంటపెట్టుకొని విశ్వామిత్రుడు వచ్చాడని తెలిసి ఆశ్రమంలోని మునులందరూ సంతోషంతో పులకరించిపోయారు!.
.
వారికి తగువిధముగా సత్కారాలు చేసి అక్కడ వారు విశ్రమించటానికి కావలసిన ఏర్పాట్లు చేసినారు.
.
ఆ రాత్రి అంతా రాజకుమారులకు మనోహరమైన కధలుచెపుతూ ఆనందింపచేశారు మహర్షి!.
.
తెలవారగనే స్నానసంధ్యాదులు పూర్తిచేసుకొని ఆశ్రమవాసులు ఏర్పాటు చేసిన నావమీద గంగానది దాటుతున్నారు,గంగ మధ్యలోనికి రావడంతోనే నీరు బద్దలవుతున్నట్లుగా గొప్పశబ్దం వినిపించింది ! అదేమిటి? అని ప్రశ్నించాడు రామచంద్రుడు కుతూహలంతో!
.
అప్పుడు మహర్షి ఇలా చెప్పారు ! పూర్వం తన మనస్సులో జనించిన సంకల్పంతో బ్రహ్మదేవుడు కైలాస పర్వతప్రాంతములోఒక సరస్సు నిర్మించాడు ఆయన మనస్సంకల్పంనుండి పుట్టినది కాబట్టి దానికి మానస సరోవరమనిపేరు.
అక్కడ నుండి సరయూనది జన్మించింది! సరస్సునుండి ప్రవహిస్తున్నది కావున" సరయూ" అని పేరు వచ్చింది!
.
ఆ సరయూనది గొప్ప తరంగాల తొ గంగాప్రవేశం చేస్తున్నది అప్పుడు పుట్టే జలఘోషనే నీవు వింటున్నది అని చెప్పారు మహర్షి..
.
గంగదాటగనే ఏ మాత్రము మానవ సంచారంలేని భయంకరమైన ఒక అడవిలో ప్రవేశించారు వారు!
.
ఆ భయంకరమైన ,దుర్గమమైన అడవిని చూసి రాముడు విస్మయంతో మహర్షిని ప్రశ్నించాడు!
.
జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....
*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
No comments:
Post a Comment