సందేహాలకు సమాధానం
భగవంతుణ్ని తలచుకోగానే కొందరు సంశయాత్ములకు ఎన్నో సందేహాలు మనసును పట్టిపీడిస్తుంటాయి. అసలు భగవంతుడు ఉన్నాడా లేడా అనే సందేహం తరచుగా కలుగుతుంది.
కలడు కలండనెడువాడు కలడో లేడో అని మొసలి నోట చిక్కిన గజేంద్రుడూ సందేహించాడు. మళ్లీ అంతలోనే భగవంతుడి ఉనికిని సందేహించడమెందుకు, ఆయన అందరికీ అండగా ఉంటాడని శరణు వేడాడు. చివరికి శ్రీహరి మొసలిని సంహరించి గజరాజును కాపాడాడు.
కష్టాలను అనుభవిస్తున్నవారు భగవంతుడే ఉంటే ఆదుకోడేమని నిరాశలో కూరుకుపోతారు. మనసు అటూ ఇటూ ఊగిసలాడుతూ ఉంటుంది. తమ కర్మఫలాన్ని అనుభవించేదాకా భగవంతుడు కరుణించడని అర్థం చేసుకోలేరు. కష్టాలు తొలగిపోయినప్పుడే భగవంతుడున్నాడన్న నమ్మకం కలుగుతుంది.
భగవంతుడున్నాడన్న నమ్మకం కలిగాక ఎక్కడున్నాడన్న సందేహం పుడుతుంది. భగవంతుడు ఒకచోట ఉన్నాడని, మరొకచోట లేడనీ సందేహించ వద్దు. భగవంతుడు లేని చోటు ఈ విశ్వంలో లేదు. సముద్రంలో ఉన్నాడు. ఆకాశంలో ఉన్నాడు. సూర్యుడిలో, చంద్రుడిలో ఉన్నాడు. వ్యక్తుల్లో ఉన్నాడు. సర్వేశ్వరుడు అంతటా నిండి ఉన్నాడు. ఎక్కడెక్కడ వెతికితే అక్కడక్కడ కనిపిస్తాడనన్న ప్రహ్లాదుడి బోధను అర్థం చేసుకుంటే భగవంతుడు సర్వాంతర్యామి అని గ్రహించగలుగుతాం.
భగవంతుడుంటే ఆయన రూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపిస్తే భగవద్గీత అందుకు దారి చూపుతుంది.
మహాభారత యుద్ధం ప్రారంభించబోతున్న సమయంలో అర్జునుడి మనోళ్లేశాన్ని తొలగించేందుకు భగవంతుడు అతడికి దివ్యదృష్టిని ప్రసాదించి తన పరమ దివ్య స్వరూపాన్ని చూపాడు. అర్జునుడు చూసిన ఆ విరాట్ రూపంలోని ముఖాలు అనంతాలు. నేత్రాలు ఆసంఖ్యాలు. ఆ రూపం దివ్యాభరణ శోభితం. భగవంతుడు అనేక దివ్యాస్త్రాలు ధరించాడు. ఆ దివ్య శరీరం నుంచి దివ్య చందన పరిమళాలు దశదిశలా గుబాళిస్తున్నాయి. ఆ రూపం సర్వాశ్చర్యకరం, అనంతం, ఆకాశంలోని వేలకొలది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే వచ్చే కాంతిపుంజాలు ఆ విరాట్ రూప తేజస్సునకు సాటిరావు.
అద్భుతమైన ఆ విశ్వరూపాన్ని దర్శించి అర్జునుడు ఆశ్చర్యచకితుడై భక్తి శ్రద్ధలతో సాష్టాంగ ప్రణామం చేశాడని భగవద్గీత వర్ణించింది. సామాన్య నేత్రాలతో చూడలేని ఆ విశ్వరూపాన్ని మనసులోనే ప్రతిష్ఠించుకోగల భక్తులు తమ మనోనేత్రాలతో భగవంతుణ్ని దర్శించుకోగలుగుతారు. మరి భగవంతుడి అనుగ్రహం సంపాదించడానికి మార్గమేమిటన్న ప్రశ్న ఉదయిస్తుంది.
భక్తి ఒక్కటే ఆ స్వామిని పొందే సాధనం. ఆ భగవానుడు భక్తికి చిక్కినట్లుగా మరి దేనికీ చిక్కడు. దానవులు, సురులు, నరులు... ఎవరైనా లక్ష్మీపతి అయిన శ్రీమహావిష్ణువు పాదపద్మాలను సేవిస్తే పుణ్యాత్ములు అవుతారని భాగవతం చెబుతోంది.
చంచలమైన మనసును కట్టడి చేయలేకపోతే అనేక సందేహాలు పీడిస్తూనే ఉంటాయి. భగవంతుడు ఉన్నాడని దృఢంగా విశ్వసించినప్పుడు మనసు నిర్మలమై సందేహాలు తొలగిపోతాయి.
ఆంజనేయుడు శ్రీరాముణ్ని తన హృదయంలో నిలుపుకొన్నట్లు మన గుండెల్లో భగవంతుణ్ని ప్రతిష్ఠించుకోవాలి. సర్వకాల సర్వావస్థలయందు నిరంతరం భగవంతుణ్ని స్మరించాలి. భగవద్భక్తి అనే అమృత సాగరంలో మునిగినవారికి మరణభయం ఉండదన్నారు శ్రీరామకృష్ణ పరమహంస.
No comments:
Post a Comment