Thursday, August 1, 2024

పాశుపతాస్త్రం గొప్ప ధనం ఏమిటీ. ధీనిని అర్జునుడు కురుక్షేత్రంలో ఎందుకు వాడలేదు

 పాశుపతాస్త్రం గొప్ప ధనం ఏమిటీ. ధీనిని అర్జునుడు కురుక్షేత్రంలో ఎందుకు వాడలేదు

పశుపతి ఇచ్చే అస్త్రం పాశుపతాస్త్రం.. బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం పాశుపతాస్త్రం —ఇవి మూడూ మహాశక్తివంతాలు.

వ్యాసమహర్షి ఆదేశం మీద ధర్మ రాజు అర్జునుడికి *ప్రతిస్మృతి* అనే మంత్రాన్ని ఉపదేశించాడు. హిమాలయాలకు వెళ్లి అక్కడ తపస్సాధన చేయమన్నాడు.

అక్కడ నాలుగు నెలల పాటు ఘోర వీరతపం చేశాడు అర్జునుడు. పరమేశ్వరుడు అతని శక్తినీ , నిగ్రహాన్నీ పరీక్షించ దలచాడు . 'మూకుడు' అనే ఒక రక్కసుణ్ణి పంది రూపంలో ప్రవేశ పెట్టి, తాను కిరాతరూపంలో ప్రవేశించాడు.

"శక్తి ఉన్నది గదా "—అని అనవసరమైన చోట్ల వినియోగం చేసేవాడు కాదని , అస్త్రం శస్త్రం ఏది ఎపుడు వాడుకోవాలో తెలిసిన నిగ్రహశాలి అనీ , పాశుపతాస్త్రం ఇవ్వడానికి అర్హత ఉన్న వాడనీ నిర్ధారణ చేశాడు. పంతం వీడని , ధర్మ పథం తప్పని వీరుడని పాశుపతాస్త్రం ఇచ్చాడు. దీని బలంతో భీష్మ ద్రోణులను జయిస్తావు, కర్ణుణ్ణి వధిస్తావు అని చెప్పి ప్రయోగ ఉపసంహారాలతో సంపూర్ణంగా ఉపదేశించాడు.

అంత పెద్ద అస్త్రం తనకుండడం విశేషమనీ, ఒక్క రోజులోనే కురుక్షేత్ర యుద్ధం అంతం చేయగలననీ అర్జునుడికి అపారధైర్యం కలగడం ఈ మంత్రలాభం వల్లనే. అంతటి మేటి భీష్ముడూ అర్జునుణ్ణి జయించడం తన వల్ల కాదు అని చెప్పడం ఈ అస్త్రబలం కలిగి ఉన్నాడనే.

పాశుపతాస్త్ర ప్రదాన ఘట్టం గమనించి చూడవలసిన అంశం. "కేవల ఆటవికుడు- ఈ వచ్చిన వాడు " —అని అనుకొన్నప్పుడు వేటకు వాడే బాణాలు వేశాడు. అవి విఫలం కాగా" ఇది దివ్యభూమి. ఈ రూపంలో ఉన్న ఏ దేవతో ?" అనుకొని అస్తాలు ప్రయోగించాడు. అవీ పర్వతం మీద పడిన తొలకరి వాన లాగా అతడి లోపలే ఇమిడిపోయాయి. మంత్రాలూ స్మరణకు రాలేదు. ఐనా, వింటితోనే కిరాతుడితో పోరాడాడు. ఇంత పంతం ఎందుకు?? అంటే *మృగయాధర్మ విరోధం * చేసిన కిరాతుణ్ణి , తప్పు ఒప్పుకొనని అతణ్ణి శిక్షించటం క్షత్రియుడి విధి — అని అతడు విశ్వసించడమే.

ప్రశాంత తపోవనంలో అడవిపంది ప్రవేశించింది. దాని పీడ తొలగడానికి అర్జునుడు బాణం వేశాడు. ఇతడు వేసిన తర్వాత ఎదుటి వైపు నుంచి ఒక కేక.. "ఏయకు ఏయకు" అంటూ ఒక బాణం దానిమీదనే వేశాడు కిరాతుడు. అది కాస్తా చచ్చి అదృశ్యమైపోయింది.

నేను వేసిన జంతువుమీద నీవెందుకు బాణం వేశావు? తప్పు చేశావు —అని నరుడు.
అది నాది..ఎంతో దూరం నుంచి తరుముకొంటూ ఒక పంతంగా ఎట్లైనా దీన్ని ఈ రోజు కొట్టాలి అని ఉత్సాహంగా దాని వెంట వస్తూ ఉంటే నీవు నా ఎరపై బాణం వేశావు. నీదే తప్పు అని హరుడు.

హరుడు అసత్యం చెప్పలేదు . ఆయనే సజీవాస్త్రం మూకుణ్ణి అర్జునుడిపై ప్రయోగించాడు . తన బాణంతోనే అది చచ్చి అదృశ్యమయింది . మధ్యలో ఒక తుస్సు బాణం వేశాడు అర్జునుడు. దానితో గాయపడవచ్చు గానీ చచ్చి అదృశ్యమౌతుందా?

అర్జునుడు : నేను ముందు బాణం వేసిన దాని మీద నీవు బాణం వేయగూడదు. ఒకరు వేటాడే దాని మీద ఇంకొకరు వేయవచ్చా? తప్పు ఒప్పుకోని వెళ్లి పో—అని.

చిలికి చిలికి గాలివాన ఐంది.

చివరికి ఏ ఆయుధమూ లేకపోయినా భుజశక్తితో కిరాతుణ్ణి శిక్షించి ఒప్పుకొనేట్టు చేయ తలపడ్డాడు అర్జునుడు.

ఇది ఉత్తమ క్షత్రియ లక్షణం అని పరమేశ్వరుడు ప్రహర్షమందాడు.

హరుడి గాత్ర స్పర్శ మంత్ర స్వీకరణార్హత కలిగించడమే కాక , అనంత దివ్యశక్తినీ తనువులో నింపింది. హరి అనుగ్రహం హరుడి కటాక్షానికి కారణమయి నరుణ్ణి ఉత్తమోత్తమ ధానుష్కుణ్ణి చేసింది.

శక్తి ఉంది. సంయమనం ఉంది.

అందుచేతనే సంక్లిష్టమైన సైంధవ వధ సందర్భంలో మాత్రమే అర్జునుడా అస్త్రం ప్రయోగించాడు.

వృద్ధక్షత్రుడు కొడుకు మీద ప్రేమతో తన కొడుకు తలను నేలగూల్చిన వాడు వెంటనే తలిపగిలి చచ్చేట్టు వరం పొందాడు. సూర్యుడు అస్తమించే వేళలో ఎక్కడో నదీతీరంలో ఉన్న ఈ వృద్ధక్షత్రుని ఒడిలో సైంధవుడి తల కచ్చితంగా పడేట్టు బాణం వేయాలి. ఆ పెద్ద కష్టం వచ్చినపుడు మాత్రమే పాశుపతాస్త్రం ప్రయోగించాడు అర్జునుడు .

బ్రహ్మాస్త్రం గూడా కృష్ణుడు చెప్పగా అశ్వత్థామ అస్త్రానికి విరుగుడుగా మాత్రమే ప్రయోగించాడు.

తపస్సు ఏ విధంగా సంరక్ష్యమో, విద్యలు గూడా ఆ విధంగా ఉపాస్యములే. సర్వత్ర ప్రయోగించడం వాటిని అవమానించడమే ఔతుంది.

పాశుపతం పశుపతి స్వరూపము. అది పూజ్యము, పవిత్రము. [ఈ మహా మంత్రం లభించిన తర్వాత మిగిలిన దేవతలున్నూ అనుగ్రహించి దివ్యాస్త్రాలిస్తారు].

No comments:

Post a Comment