Friday, September 20, 2024

మహాభారతం లో… *శక్తివంతులు:

 మహాభారతం లో…

               *శక్తివంతులు:*
            
మహాభారతంలోకెల్లా అత్యంత శక్తివంతుడైన వ్యక్తి ఎవరు? వారి శక్తికి కారణం ఏమిటి?


నా దృష్టిలో మహాభారతం మొత్తంలో వివిధ అంశాల్లో అత్యంతశక్తివంతులైన, ప్రభావశీలురైన పాత్రలు ఇవే..!

మానసికంగా ధృడమైన వ్యక్తి "ద్రౌపది".

శౌర్య పరాక్రమాలలో అఖండులు భీష్ముడు, కర్ణుడు, అర్జునుడు.

బుద్ధిబలంలో తిరుగులేని వాడు.         “శ్రీ కృష్ణుడు.”

ధర్మ ఆచరణలో “విదురుడు.”

యజ్ఞఫలముగా ఉద్భవించిన ద్రౌపది తన జీవితం మొత్తం మరెవరికీ స్వప్నసాదృశమైనా కాని విషమ పరిస్థితులను ఎదుర్కొని, పోరాడి, మానసికంగా అత్యంత ధృడత్వాన్ని సాధించింది. శ్రీ కృష్ణుని తోడ్పాటు ఆమె మనుగడలో అత్యంత కీలకం.

గంగా తనయుడైన భీష్మ పితామహుడి అసలు పేరు దేవవ్రతుడు. ఆయనను ఎదిరించి నిలువగల సత్తా, సామర్థ్యం మహాభారతంలో మరెవరికీ లేవు. ఎందుకంటే ఆయన ధర్మనిరతి, కర్తవ్యదీక్ష అచంచలమైనవి. నిరంతరం రాజ్యసంక్షేమానికై, తండ్రికిచ్చిన మాటకై నిండు జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడాయన.

కర్ణుడు అసమాన ధనుర్ధారి. సమాజ కట్టుబాట్లను సహించలేక, శూద్రవర్ణాన్ని దాచి ఓ అసత్యం పునాదిగా సాధించుకున్న జ్ఞానానికి, విద్యకు      లెక్క లేనన్ని శాపాలు తోడవడంతో కృంగిపోయాడుగానీ.., అతడిని ఎదిరించగల వీరుడు దాదాపుగా లేడు. చెడ్డవారితో స్నేహం, శాపభారం, ఈర్ష్య, ద్వేషం.. ఇలా కర్ణుడి పతనానికి కారణాలు అనేకం. అతడి దానగుణం మాత్రం అద్వితీయం. తన స్వీయ రక్షణను సైతం లెక్కజేయక సహజ కవచ కుండలాలను కూడా అలవోకగా దానం చేయగలిగాడు కాబట్టే అతడిని దానవీరశూరకర్ణుడు అని అంటుంటారు.

అర్జునుడు మహా పరాక్రమశాలి మరియు ధర్మ పరాయణుడు. ద్రోణునికి ప్రియ శిష్యుడైన కారణంగా ఏకలవ్యుడు, కర్ణుడు ల విద్య పరంగా కొన్ని కళంకాలను కూడా ఎదుర్కొన్నాడు. తన శక్తిపై సరియైన అంచనా కలవాడు మరియు బుద్ధితో పాటు మనసు మాటకూడా వినే సహృదయుడు. సొంతవారిని చంపే ధైర్యం చేయజాలక, శ్రీకృష్ణుని భగవద్గీతకు కారణమైన కారణజన్ముడు.

ఏ కార్యము ఎంత చాకచక్యముగా చేయాలో, ఎవరెవరిని పావులుగా వాడాలో‌, ఎక్కడెక్కడ ధర్మసంస్థాపన అవసరమో, దుష్టశిక్షణ, శిష్టరక్షణ బాగుగా తెలిసినవాడు.. మహాభారతాన్ని అంతా తానై నడిపించిన అసమాన పురుషోత్తముడు శ్రీ కృష్ణుడు. విష్ణుమూర్తి అవతారం అయిన శ్రీకృష్ణుడికి సమానమైన వాడు మహాభారతం మొత్తంలో మరొకరు లేరనే చెప్పాలి.

ఇక ధర్మాన్ని ఆచరించడం కోసం ఎంతటి వారినైనా ఎదుర్కోగల వాడు విదురుడు. నిరంతరం సామ్రాజ్య సంరక్షణకై పాటు పడుతూ, ప్రతి విషయాన్ని మానవతా విలువలతో ఆలోచించగల మేధావి మరియు నీతిమంతుడు. పాండవుల ధర్మానికి సహకారియై, అధర్మవాదులైన కౌరవుల వినాశనాన్ని ముందుగానే హెచ్చరించిన ధీరోదాత్తుడతడు.

No comments:

Post a Comment