సరదా కోసం రాసిన కథ...
ఎవ్వరిని ఉద్దేశించింది కాదు...
తిట్టుకోకండి.... నవ్వుకోండి
కథ : ఫలితం
రచన : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
~~~~~~~~~~~~~~~~~~~~
పొద్దున్న నాలుగు గంటలు.
జనాలు ఇంకా నిద్ర లేవలేదు. తొవ్వెంబడి చెట్లు కూడా నిద్ర లేవలేదు.
కానీ అప్పటికే ఎప్పుడో నిద్రలేచి, అలవాటుగా వాకింగుకు కూడా బయలు దేరింది అరవై ఏండ్ల వరమ్మ. ఆమె చేతిలో పాలిథిన్ కవరు ఒకటి ఉన్నది. ఉంటే ఉండనీ గాని , ఆమె తీరు చూస్తుంటే వాకింగుకి వచ్చినట్టుగా లేదు. వాకింగ్ పేరుతో పూల వేటకు వచ్చినట్టుగా ఉన్నది.
నిద్రలేవని చెట్లను గిల్లి గిచ్చి ఇబ్బంది పెట్టొద్దు అనే సోయి కూడా మరిచిపోయి....దారెంబడి ఇండ్ల ముందు ప్రహరీ గోడల వారగా ఎక్కడ పూల చెట్టు కనిపిస్తే అక్కడ నిలబడి....అటూ ఇటూ చూసి.... తనని ఎవరు గమనించడం లేదని నిర్ధారించుకున్నాక.... చెట్ల కొమ్మల్ని అమాంతం వొంచి.... గబ గబా పూలను తెంపుతున్నది. ఇంకేం... వీధి మలుపు తిరిగేసరికి పాలిథిన్ కవర్ సగానికి పైగా నిండి పోయింది..! అయినా ఆశ చావలేదు. దారికి అటూ ఇటూ ఉన్న అన్ని ఇండ్లను తానే గుత్తకు పట్టుకున్నట్టు పూల కోసం ఎగబడుతూనే ఉన్నది.
వీధి చివరి కంటా వెళ్లి తిరిగి వస్తూ కూడా తిన్నగా వాకింగ్ చేయలేదు. ఏ ఇంటి ముందు అయినా పూలు మర్చిపోయానా అన్నట్టుగా కళ్ళతోనే నిఘా వేస్తూ ముందుకు కదిలింది.
మందార పూలు, గన్నేరు పూలు, నందివర్ధనం పూలు, చక్రమల్లెలు, తీగ మల్లెలు, కవరు నిండి..., తాజాగా.... అప్పుడే నిద్ర లేచి ఒళ్ళు విడుచుకుంటున్న పసిపాపల్లా కనబడుతున్నాయి.
వాటిని చూస్తుంటే వరమ్మకు కడుపు నిండి నట్టుగా తృప్తిగా అనిపించింది.
" రోజుటి కంటే ఇవాళ ఎక్కువ పూలు దొరికాయి. అంతా అమ్మవారి దయ.... " నిండిన పాలిథిన్ కవర్ చూసుకుంటూ మనసులోనే అనుకుంటూ , తెల్లవారకుండానే ఇంటికి వెళ్లింది.
*******
తెల్లవారు జాము ఐదు గంటలు...
నిద్రలేచి, మైకం వీడని కళ్ళను నలుపు కుంటూ ఇంట్లోంచి బయటకు వచ్చి ప్రహరీ గోడ వైపుగా చూసింది పదహారేళ్ల పద్మిని.
రాత్రనగా గుత్తులుగా మొగ్గలు కాసి ఉన్న నందివర్ధనం చెట్టు బోసిగా కనిపించింది.
" అమ్మా... పూలు కోసుకుపోయారే" పూలన్నీ కోల్పోయి తననే దీనంగా చూస్తున్నట్టున్న నందివర్ధనం చెట్టునే చూస్తూ ఇంట్లోకి కేకేసింది పద్మిని.
" అయ్యో ఇంకా తెల్లవారనే లేదు.. అప్పుడే కోసుకుపోయారా...! " అంటూ పద్మిని తల్లి పుష్పమ్మ ఇంట్లోంచి పరుగున బయటకు వచ్చి , మొండి తలలు పైకెత్తి చూస్తున్నట్టున్న నందివర్ధనం చెట్టును చూస్తూ.....
" ఏంది ఇది? వాళ్ళ మొహాలు మండ...! దిన్నాం ఇదే తంతు అయిపోయింది..! వాళ్ల కోసమే మనం పూలను ఎరువులేసి నీళ్లు పోసి పెంచుతున్నట్టుంది..! ఇయ్యాలా పండుగ! కనీసం ఈరోజైన దేవుడికి ఇంట్లో కాసిన పూలు పెట్టుకుందామంటే కూడా ఈ పూలదొంగల మీద మన్ను బడా.. ఇట్లా జేస్తున్నరు.. " నిస్సహాయంగా కసితీరా తిట్టుకుంది.
అంతలో ఇంట్లో నుండి ~
"' వాళ్ళు ఎవరో తెలివైన దొంగలు. దిన్నాం పూలు పోతున్నాయి ఈరోజు ఐదు గంటలకే లేచి దొంగల్ని పట్టేద్దాం అనుకున్నావ్.. వాళ్ళేవరో మూడు గంటలకే వచ్చి పని గాయించుకుని యెళ్ళిపోయారు..! సర్లే! ఇంట్లోకి యెళ్ళండి. బయట చటాక్ పూలు కొనుక్కు వస్తాను...." చెప్పాడు పుష్పమ్మ మొగుడు... పద్మిని తండ్రి...
*********
కైలాసంలో శివ పార్వతులు కూర్చుని ఉన్నారు. భూలోకంలో జరుగుతున్న పర్వదిన వేడుకలను తిలకిస్తున్నారు.
వరమ్మ ఇంట్లో దేవుడి గది, గదిలో దేవుళ్ళ పటాలు, రక రకాల పులతో సర్వాంగ సుందరంగా అలంకరించి ఉన్నాయి. సాక్షాత్తు దేవుళ్లే అక్కడ కొలువై ఉన్నారేమో అన్నంత ప్రశాంతత అక్కడ నెలకొని ఉన్నది.దానికి తోడుగా వరమ్మ కూడా ఇష్టకా పూజ జరుపుతూ... సహస్ర నామాలు చదువుతూ... నామ నామానికి పూలను సమర్పిస్తున్నది.
మరోవైపు పుష్పమ్మ ఇంట్లో కూడా పూజలు జరుగుతున్నాయి.కానీ దేవుడి గది అర కొర పూల అలంకరణతో ఉన్నది. పుష్పమ్మ కూడా అష్టోత్తరాలు చదువుతూ పూలని కాకుండా పూలను విడదీసిన రేకుల్ని దేవుడికి సమర్పిస్తున్నది.
అదంతా శివపార్వతులు గమనిస్తున్నారు.
******
సాయంత్రం నాలుగు గంటలు కావోస్తుంది.
" అప్పు ఎప్పటికైనా ముప్పే " అనుకుంటూ వరమ్మతో పదివేల రూపాయలు అప్పు తీసుకున్న
సుగుణ, నెమ్మదిగా వరమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరింది. ఇంట్లో కోడలు పిల్ల ఒక్కతే ఉంది. అప్పటికే వరమ్మ గుడికి వెళ్ళినట్టుగా తెలిసింది.
" సర్లే...! నేను కూడా దేవుడిని దర్శించుకున్నట్టుగా ఉంటుంది " మనసులో అనుకుంటూ సుగుణ కూడా వరమ్మ వెళ్ళిన గుడి వైపు బయలుదేరింది.
గుడి దగ్గర వరమ్మను కలిసి 10000 రూపాయలు అప్పగించింది. ఎప్పటిదో మొండిబాకి తీరడంతో వరమ్మ సంతోషం అంతా ఇంతా కాదు...
" అంతా ... ఆ దేవుడి దయ " గర్భగుడిలో దేవుడిని చూస్తూ అనుకుంటూ....దక్కిన పదివేల రూపాయలు కళ్ళకు అద్దుకొని వెంట తెచ్చుకున్న చేతిపరుసులో పెట్టేసుకుంది వరమ్మ.
అంతలో....
పరిసరాల్లో తిరుగాడుతున్న కోతల మందలోని ఒక కోతి, అనూహ్యంగా వచ్చి వరమ్మ పర్సును లాక్కొని ఇకిలిస్తూ.... అక్కడే ఉన్న చెట్టు ఎక్కి కూర్చుంది.
అప్రమత్తమైన భక్తులు ఆ కోతిని భయపెట్టి పర్సును దక్కించుకునే ప్రయత్నం చేశారు. ఆ హడావిడికి కోతి బెదిరిపోయి అక్కడి నుండి మరో చెట్టు మీదకి దూకి.... అక్కడి నుండి తిన్నగా ఊర్లోకి వెళ్లిపోయింది. సరిగ్గా పుష్పమ్మ వాళ్ళ ఇంటి ముందు ఉన్న గోడమీద కూర్చొని నందివర్ధనం చెట్ల వారగా పర్సును జారవిడుచుకుంది. అదంతా గమనిస్తున్న పుష్పమ్మ వెంటనే వెళ్లి చూడగా రూపాయలకట్ట ఆమె కళ్ళను మెరిపించింది.
*******
కైలాసంలో....
" అదేమీ నాథా! విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు...! " భూలోకంలో జరిగిన తతంగాన్ని అంతా గమనించిన అమ్మవారు శివుడిని ప్రశ్నించింది.
" విచిత్రంగా ఏమీ లేదు దేవీ! . అంతా సజావుగానే సాగిపోయింది! నా లీలా మహత్యం నీకు తెలియదా ఏమి?! " అన్నాడు శివుడు.
" ఆ పదివేల రూపాయలు నిజాయితీగా వరమ్మవే కదా నాథా! ఆయాచితంగా పుష్పమ్మకు దక్కించావు ...." అంది అమ్మవారు.
అందుకు శివుడు చిన్నగా నవ్వి ~
" నీకు తెలియంది ఏముంది దేవీ! నన్ను మాట్లాడించాలని నన్ను ప్రశ్నిస్తున్నావు కదూ!? " అని కాసేపు ఆగి ~ " పరమ భక్తురాలైన వరమ్మకు తన పదివేలరూపాయలతో పాటుగా, మరో 10 వేల రూపాయలు అదనంగా దొరికే అదృష్టం ఉన్నది. దొంగతనం మహాపాపం కదా... ఆ దొంగతనం చేసిన పూలతో మనల్ని పూజించిన పాపానికి దొరకాల్సిన పదివేల రూపాయలతో పాటుగా తన పదివేల రూపాయలు కూడా పోగొట్టుకున్నది...!
ఇక పుష్పమ్మ విషయానికి వస్తే.... ఏ పండుగకో పర్వదినాలకో తప్ప ఆమె మనల్ని పూజించడం లేదు. ఆయనప్పటికీ ఆమె పెంచిన పూలతో మనకు నిత్యం పూజ జరుగుతున్నది కదా...!? అందుకే ఆమెకు పుణ్యం దక్కుతూ పదివేల రూపాయలు సొంతమయ్యాయి... ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా కరుణించాలో నాకు తెలుసు.. సమయానుకూలంగా కరుణిస్తాను..." చెప్పుకొచ్చాడు శివుడు.
అమ్మవారు ఇంకేం మాట్లాడలేదు.
నీ లీలలు అర్థం కానివి నాథా...అన్నట్టుగా శివుడి కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది..
( సరదా కథ.. అయిపోయింది..)
~~~~~~~~~~~
No comments:
Post a Comment