🙏🏻🪷🪷🪷🙏🏻
"జ్ఞానదీపిక" (ఆధ్యాత్మిక ప్రశ్నోత్తరమాలిక
- శాస్త్రి ఆత్రేయ.
ప. జీవుడంటే ఎవడు?
గు. సహజంగా తాను చైతన్యస్వరూపుడు అయినప్పటికీ, ఒక దేహాన్ని ధరించి, దేహభ్రాంతికి లోనైనవాడే జీవుడు!
ప. మరి జీవుని స్వరూపం ఎలాంటిది?
గు. జీవుడు చైతన్యమైన ఆత్మకాదు; అలాగని జడమైన దేహం కాదు; ఈ రెండింటి యొక్క మిశ్రమ స్వరూపము! జీవునికి ప్రత్యేకంగా రూపం లేకపోయినా తాను ధరించిన దేహాన్ని తన స్వరూపంగా భావిస్తాడు!
ప. జీవుని స్వభావం ఎలాంటిది?
గు. దేహము నందు మమకారంతో, ఇంద్రియములకు లొంగి, కామమోహాదులకు వశుడై, సత్యాసత్య వివేకము కోల్పోయి, అహమనే భావంతో జీవించుట అతని స్వభావము.
ప. ఉపనిషత్తులో పేర్కొన్న బ్రహ్మము అంటే ఏమిటి?
గు .ఈ సమస్త సృష్టి దేనినుండి పుట్టి, దేనివలన పెరిగి, దేనిలో లయిస్తుందో అదే బ్రహ్మము!
ప. మరి భ్రమ అంటే ఏమిటి?
గు. కంటికి కనిపించేది, చెవులకు వినిపించేది, మనస్సును మైమరపించేది “భ్రమ”!
ప. అలాంటప్పుడు ఏది బ్రహ్మ? ఏది భ్రమ?
గు. అందరి జీవులయందు వున్న ఆత్మే నీలో వుంది! రూపములు వేరైనప్పటికీ ఆత్మవస్తువు ఒక్కటే! అనేకత్వంలో ఏకత్వాన్ని గుర్తించడమే బ్రహ్మం!! ఏకత్వమును అనేకత్వముగా భావించడమే భ్రమ!!
No comments:
Post a Comment