*ధర్మం*
ధర్మం గురించి చాలామంది ఆలోచిస్తారు. ధర్మ-అధర్మాల గురించిన చర్చలు జరుగుతూనే ఉంటాయి. వాస్తవానికి ధర్మం అంటే ఏమిటి అని నేను నాలో ప్రశ్నించుకున్నాను? అప్పుడు నాకు తెలిసిన విషయం ఏమిటంటే - ధర్మం అన్నా, దైవం అన్నా, పరమాత్మ అన్నా, ప్రకృతీ-పురుషులు అన్నా, స్వచ్ఛమైన చైతన్యం-స్వచ్ఛమైన శక్తి అన్నా, ఒకటేనని. ఇవన్నీ దైవానికి పర్యాయ పదాలని.
అలాగే నాకు తెలిసిన మరొక విషయం ఏమిటంటే, దైవంలో త్రిగుణాలు సమపాళ్ళలో కలిసి ఏకమై పోయి ఉన్నాయని. అంటే 33.33% రజోగుణం, 33.33% తమోగుణం, 33.33% సత్వగుణం ఉన్నాయి. కాని దైవం సృష్టించిన శక్తి రూపాలలో, గుణాల యొక్క మిశ్రమం అనేది వివిధ రకాలుగా ఉంటుంది. ఇలా మిశ్రమంలో తేడా ఉండడం వలననే ప్రకృతిలో ఎన్నో రూపాలు ఏర్పడ్డాయి. కనుక ప్రకృతిలోని వస్తువులన్నింటిలో కూడా ఈ మూడు గుణాలు అంటే పాజిటివ్-నెగెటివ్-న్యూట్రల్, లేదా ప్రోటాన్-ఎలక్ట్రాన్-న్యూట్రాన్‌లు తప్పక ఉంటాయని గ్రహించండి.
దైవం అంటేనే ఆనందం, పరమానందం. త్రిగుణాలు సమపాళ్ళలో కలిసి ఏకమైపోయి ఉండడం వలననే ఆయన ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. మనం ఈ ఆనంద స్థితికి చేరటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. నేను సూచించిన కరిగిపోండి సాధన లేదా శ్వాస మీద ధ్యాస ద్వారా కూడా మీరు దైవం వద్దకు చేరవచ్చు.
మనం దైవం వద్దకు చేరిన తర్వాత ఆనందానుభూతిని పొందుతున్నాం, కాని కళ్ళు తెరిచిన వెంటనే మళ్ళీ మాయలో పడిపోతున్నాం. అంటే శరీరంలో, మనసులో మరియు హృదయంలో ఆనందాన్ని నిలుపుకోలేక పోతున్నాం. దీనికి కారణం ఏమిటని నాలో ప్రశ్నించుకున్నాను? అప్పుడు నాకు వచ్చిన మెసేజ్ ఏమిటంటే, ధ్యానం నుంచి బయటకు వచ్చిన వెంటనే మీరు త్రిగుణాలలో ఏదో ఒక్క దాన్నే ఎంపిక చేసుకుని మిగతా రెండింటితో యుద్ధం చేస్తున్నారు. దీని వలననే మీరు దైవానుభూతిని శరీరం, మనసు మరియు హృదయంలో పొందలేకపోతున్నారని. కనుక ఈ స్థాయిలలో కూడా త్రిగుణాలను ఎంపిక చేసుకుని ఏకం చెయ్యి అని వచ్చింది.
33.33% త్రిగుణాల సాధన
శరీరం
మనం మామూలుగా శారీరక స్థాయిలో ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటాం. ఇది అధర్మ నిర్ణయమని నాలోపల నుంచి వచ్చింది. ఎందుకంటే ధర్మంలో మూడు వ్యతిరేకాలు సమపాళ్ళలో కలిసి ఏకమై ఉంటాయి. అంటే 33.33% ఆరోగ్యం - 33.33% అనారోగ్యం - 33.33% తటస్థం, ఈ మూడూ సమపాళ్ళలో ఉంటాయి. కనుక ఈ మూడింటినీ ఎంపిక చేసుకో అని వచ్చింది. ఎందుకంటే అనారోగ్య లక్షణాలైన దగ్గు, తుమ్ములు, నొప్పులు, తిమ్మిరెక్కడం, మత్తుగా ఉండడం మొదలైనవి మనకు నిత్యజీవితంలో అవసరం. ఇవి రోజూ పని చేస్తేనే శరీరంలో ఏర్పడే అనవసరమైనవి అన్నీ బయటకు వస్తాయి.
అలాగే ప్రకృతిలో వచ్చే మార్పులకు తగ్గట్టు శరీరం తనను తాను శృతి చేసుకుంటూ ఎల్లప్పుడు ఎదుగుతూనే ఉంటుంది. ఎలాగైతే మొబైల్ 2జి నుంచి 4జికి అప్‌డేట్ కావాలంటే కేవలం సిమ్ మార్చితే సరిపోదు, హార్డ్‌వేర్ అంటే మొబైల్ కూడా అప్‌డేట్ కావాలి. అదే విధంగా మీరు ఎదగాలంటే మీ భాగాలైన శరీరం, మనసు, హృదయం మొదలైనవన్నీ ఎదగాలి. కనుక మీలోని భాగాలలో ఉన్నత స్థితి నెలకొనడానికి - అనారోగ్యం, ఆరోగ్యం మరియు తటస్థ శక్తులు, ఏకకాలంలో కలిసి కట్టుగా పని చేయడం అవసరం. కనుక మీరు శారీరక స్థాయిలో మూడింటిని ఎంపిక చేసుకుని వాటి మధ్య మిత్రత్వాన్ని సృష్టించండి. లేకుంటే శరీరంలో ధర్మ-స్థాపన జరగడం అసాధ్యం, అంటే శరీరంలోకి దైవం ప్రవేశించడం అసంభవం. మరింత సమాచారం కోసం అంతర్ ప్రయాణం మరియు శరీరం అనే టాపిక్‌లను చదవండి.
ఇక్కడ తటస్థం అంటే ఏదైనా ఆటలో గెలుపు ఓటమి ఫలితం తేలని స్థితి (Draw), ఈ మూడింటికి అవకాశం ఉంది. ఇక్కడ డ్రా అంటే ఇద్దరు గెలవడం లేదా ఇద్దరు ఓడిపోవడం. దీన్నే నేను తటస్థం లేదా సత్వగుణం అంటున్నాను. కనుక తటస్థం లేదా సత్వగుణం అంటే అనారోగ్యం ఆరోగ్యం సమపాళ్ళలో కలిసి ఏకమై ఉన్న స్థితి. తమోగుణం రజోగుణం సమపాళ్ళలో కలిసి ఏకమై ఉన్న స్థితి. కాబట్టి ఆరోగ్యం 33%, అనారోగ్యం 33%, ఆరోగ్యం-అనారోగ్యం యొక్క కలయిక 33% ఉండాలి అని భావించండి.
మనసు
మానసిక స్థాయిలో కూడా మూడింటిని ఎంపిక చేసుకోండి. అంటే మనకు మనసులో ఎప్పుడూ ఒకసారి ఒకే ఆలోచన వస్తుంది. అంటే మంచి ఆలోచనో లేదా చెడు ఆలోచనో లేదా తటస్థ ఆలోచనో వస్తుంది. మీరు ఈ ఆలోచనను వెంటనే ఎంపిక చేసుకుంటే మీరు అధర్మం చేసినట్టు అవుతుంది, ఎందుకంటే మీరు మూడింటినీ ఎంపిక చేసుకోలేదు కనుక.
అంటే మనసులో తిట్టరా అని ఆలోచన వచ్చిన వెంటనే మీరు దానిని ఎంపిక చేసుకోకుండా, నేను 33.33% తిట్టు - 33.33% పొగడ్త - 33.33% తటస్థం మూడు సమపాళ్ళలో కలిసి ఉన్న స్వచ్ఛమైన శక్తిని ఎంపిక చేసుకుంటున్నానని అనుకోండి. అలాగే పొగుడరా అని ఆలోచన వచ్చినప్పుడు కూడా మీరు వెంటనే దానిని ఎంపిక చేసుకోకుండా, నేను తిట్టు-పొగడ్త-తటస్థం మూడు సమపాళ్ళలో కలిసి ఉన్న స్వచ్ఛమైన శక్తిని ఎంపిక చేసుకుంటున్నానని అనుకోండి. అలాగే నేను ఆత్మను అని ఆలోచన వస్తే, నేను ఆత్మను 33% దేహాన్ని 33%, న్యూట్రల్ 33% అనుకోండి. ఇది ప్రపంచం అని ఆలోచన వస్తే, ప్రపంచం 33%, పరమాత్మ 33%, న్యూట్రల్ 33% అనుకోండి.
ఇలా రోజూ ఏ ఆలోచన వచ్చినా దానికి సంబంధించిన మూడింటినీ ఎంపిక చేసుకుని కొద్ది సేపు వేచి ఉండండి. ప్రశాంత స్థితికి సమస్థితికి వచ్చిన తర్వాతే ఏదైన చేయడానికి పూనుకోండి. అంటే ఇలా చేయడం వలన మానసిక స్థాయిలో ఉన్నప్పుడే మీకు దైవంతో కనక్షన్ ఏర్పడుతుంది. ఇలా నిరంతరం మానసిక స్థాయిలో సాధనను కొనసాగిస్తే మీరు తప్పక మనసులోనే ధర్మ-స్థాపన చేయగలుగుతారు. మనసును వదిలేసి దైవం వద్దకు చేరాల్సిన అవసరం లేకుండానే దైవం మీ మనసులోకే ప్రవేశిస్తాడు. ఎందుకంటే త్రిగుణాల కలయిక వలన మీ మనసు స్వచ్ఛంగా ప్రశాంతంగా తయారైంది కనుక.
హృదయం
హృదయంలో మంచి-చెడు-తటస్థ అనుభూతులు ఉంటాయి. మీకు భయం కలిగిన వెంటనే అది పూర్తిగా పోవాలని అనుకుంటే మీరు అధర్మం చేసినట్టు అవుతుంది. కనుక భయం నువ్వు తప్పక నాలో ఉండాలి కాని 33.33% మాత్రమే. మిగతా శక్తిని మిగిలిన రెండింటికి పంచి ముగ్గురు సమంగా ఉండి కలిసి ఏకమై పొమ్మని చెప్పండి. అలాగే ధైర్యం ఎక్కువ ఉన్నప్పుడు కూడా దానిని 33.33% మాత్రమే ఉండమని చెప్పండి. ఇలా 33.33% కంటే తక్కువ ఉంటే పెరగమని, 33.33% కంటే ఎక్కువ ఉంటే తగ్గమని సూచించి త్రిగుణాలను సమపాళ్ళలో నిలుపుకుని హృదయంలో ధర్మ-స్థాపన చేయండి.
కాని దీని వలన పాత స్థితే కొనసాగుతుంది. అలా కాకుండా పైన చెప్పినట్టు 2జి నుంచి 4జికి అప్‌డేట్ కావాలంటే దానిలో ఉన్న అన్నీ ఎదగాలి. అంటే దానిలో ఉన్న పాజిటివ్ నెగెటివ్ న్యూట్రల్ మూడూ ఎదగాలి. కనుక ఏది ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టు మిగతా రెండింటినీ పెంచండి. అంటే భయం ఎక్కువ ఉంటే దానిని అలానే ఉండమని చెప్పి, దానికి సమానంగా ధైర్యాన్ని న్యూట్రల్నిపెరగమని చెప్పండి. అలాగే ధైర్యం ఎక్కువ ఉన్నప్పుడు, దానిని అలానే ఉండమని చెప్పి, భయాన్నిన్యూట్రల్ని దానికి సమానంగా పెరగమని చెప్పి హృదయంలో ధర్మ-స్థాపన చేయండి.
మామూలుగా చెడు గుణాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు మనలో కలిగినప్పుడు - ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగటం లేదని, సాధన సరిగా చేయడం లేదని, తప్పు చేస్తున్నాననే భావన మనలో ఏర్పడి, బాధితుడిననే అనుభూతి అధికమౌతుంది. కాని అన్నీ సమపాళ్ళలో ఉండాలి అనే భావనతో నేను సూచించిన సాధన చేస్తే, మీలోని అపరాధ భావన మాయమౌతుంది.
ఎందుకంటే ఒకటిగా ఉన్న స్వచ్ఛమైన శక్తిని మాయ మూడుగా విభజించి చూపిస్తోంది. కనుక మూడు తప్పక ఉండాలి కాని సమపాళ్ళలో ఉండాలి. కనుక నేను మూడు గుణాలకు ప్రతినిధిని, నేను త్రిగుణాలకు అధిపతిని కావాలి, నేను మూడు గుణాలను జయించాలి, అనే తపన మీలో పెరుగుతుంది. దీని వలన నాకు 33.33% చెడు గుణాలు ఉండడం తప్పు కాదు అనే భావన మీలో స్థిరమౌతుంది.
5 వేళ్ళు విడిగా ఉన్నప్పటికీ వాటి మధ్య సఖ్యతను ఏర్పర్చి ఏకకాలంలో ఉపయోగించుకోవచ్చు. లేదా కలిపి ఒకటి చేసైనా ఉపయోగించుకోవచ్చు. అప్పుడే వాటికి బలం చేకూరుతుంది. అలాగే మూడు వ్యతిరేకాలు విడిగా ఉన్నప్పుడు వాటి మధ్య మిత్రత్వాన్ని సృష్టించి ఒకేసారి ఉపయోగించుకోండి. లేదా మూడింటిని కలిపి ఒకటి చేసి ఉపయోగించుకోండి. ఇలా కలయిక వలన, మిత్రత్వం వలన ఏర్పడే శక్తినే నేను న్యూ ఎనర్జీ అని అంటున్నాను.
అలాగే మూడు గుణాల యొక్క మిశ్రమం ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కనుక ఇలా చేస్తే, ఇలా కలిపితే, ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించకుండా, అంతరంలో ఉన్న మూడు గుణాలను కలపడం ఎలా అనే దాని మీదనే మీ దృష్టిని నిలపండి. ఇలా మీలోని మూడు వ్యతిరేక శక్తులను కలుపుతూ ఉంటే మీకు బాహ్యంగా మూడు రకాల ఫలితాలు వస్తాయి. వాటిని దివ్యంగా అనుభవిస్తూ, బాహ్యంగా ఫలించిన శక్తులను మీలోపల ఉన్న మిశ్రమంలో కలిపితే, మీ మిశ్రమంలో మార్పు వస్తుంది. ఇలా సాధనను కొనసాగిస్తే మూడు గుణాలు సమపాళ్ళకు చేరి ఏకమైపోతాయి.
మరో విషయం ఏమిటంటే, గతంలో మూడు గుణాల యొక్క అనుభవాలు విడివిడిగా పొందిన వారే, నేను సూచించే ఈ జ్ఞానాన్ని ఆచరించడానికి అర్హులు. కనుక కేవలం తమో గుణ అనుభవాలు పొందుతున్న వారి ధర్మం ఏమిటంటే, ఆ గుణానికే ప్రాధాన్యతనిస్తూ మిగతా రెండింటిని పట్టించుకోకపోవడం. కేవలం రజో గుణ అనుభవాలు పొందుతున్నవారి ధర్మం ఏమిటంటే, ఆ గుణానికే ప్రాధాన్యతనిస్తూ మిగతా రెండింటిని పట్టించుకోకపోవడం. అలాగే కేవలం సత్వ గుణ అనుభవాలు పొందుతున్నవారి ధర్మం ఏమిటంటే, ఆ గుణానికే ప్రాధాన్యతనిస్తూ మిగతా రెండింటిని పట్టించుకోకపోవడం. కనుక ఇక్కడ ధర్మం అనేది వారి వారి స్థితులను బట్టి మారుతుందని గ్రహించండి.
ఫలితాలు
ఇలా కళ్ళు మూసుకున్నప్పుడు కరిగిపోవడం సాధన, కళ్ళు తెరిచి ఉన్నప్పుడు త్రిగుణాలను ఎంపిక చేసుకోవడం వలన చాలా మందికి అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. వైజాగ్‌లో దంపతులిద్దరూ నెల రోజులు ఇలా చేయడం వల్ల పదేళ్ళ నుంచి అమ్ముడు పోని భూమి అమ్ముడైంది. వైజాగ్‌లో ఒకరికి పోయిన బంగారం దొరికింది. ఒకామెకు ప్రతీ నెలా భరించలేనంతగా వచ్చే మెన్‌సెస్ నొప్పి, నొప్పి నువ్వు 33శాతం ఉండు అని అనడం వలన నొప్పి చాలా తక్కువ వచ్చింది. ఒకతను బంగారానికి ఆకర్షితుడయ్యే వాడు. కాని ఈ సాధన చేయడం వలన అతనికి బంగారం పట్ల ఉన్న వ్యామోహం తగ్గింది.
రోజు 20 కి.మి అప్ అండ్ డౌన్ చేయమని బలవంతం చేసేది భార్య. బలవంతం చేయడాన్ని భర్త ద్వేషించేవాడు. ఈ జ్ఞానం తెలుసుకుని బలవంతం ఎనర్జీ నువ్వు 33 శాతం ఉండు అని అంతరంలో భర్త అనుకోవడం వలన, బాహ్యంగా భార్యలో మార్పు వచ్చి, అవును రోజు ప్రయాణం చేయడం వలన మీరు అలసిపోతారు, కనుక సెలవు ఉన్నప్పుడు రమ్మని చెప్పిందట. అలాగే చాలా మందికి అంతరంలో ప్రశాంతంగా ఆనందంగా ఉంటున్నదని చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా అంతరంలో ధర్మ-స్థాపన చేసి అన్ని రకాల సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనండి.
16.66% లేదా 50:50 సాధన
ఇలా కొన్ని రోజులు మీరు పైన సూచించిన విధంగా 33.33% త్రిగుణాల సాధన చేసి, వ్యతిరేకాల మధ్యలో సమన్వయం ఏర్పర్చడంలో నిష్ణాతులైన తర్వాత, జీవాత్మ ఆత్మ పరమాత్మలు కూడా ఉన్నాయని మీరు అనుభవంలో తెలుసుకుంటారు. అప్పుడు మీరు 16.66% లేదా 50:50 సాధనను ఆరంభించండి.
ఇక్కడ జీవాత్మ అంటే మీలో ఉన్న ఒక్క గుణాన్నే పట్టుకుని దానిని మాత్రమే వ్యాపించి మిగతా వాటిని తిరస్కరిస్తుంది. ఆత్మ అంటే మీలో ఉన్న అన్నింటినీ కలిసికట్టుగా ఉపయోగించుకుంటూ, మీలో ఉన్న అన్ని శరీరాలను, అన్ని భాగాలను, అన్ని అవస్థలను వ్యాపించి ఉంటుంది. పరమాత్మ అంటే నిరాకారం మరియు సర్వవ్యాపకం కూడా, ఇది విశ్వమంతా అలాగే విశ్వంలోని అన్ని రూపాలలో కూడా వ్యాపించి ఉంటుంది, అలాగే ఈ విశ్వంలోని అన్ని రూపాలు కూడా తానై ఉంది.
ఇలా నెగటివ్ పాజిటివ్ న్యూట్రల్ జీవాత్మ ఆత్మ పరమాత్మలు ఉన్నాయని తెలుసుకున్నప్పుడు, మీరు 16.66% లేదా 50:50 సాధనను ఆరంభించండి. అంటే మీకు 50% పరమాత్మకు సంబంధించినవి, 50% ప్రపంచానికి సంబంధించినవి శరీరం మనసు హృదయంలో ఉండాలి. అలాగే ఇక్కడ పరమాత్మకు సంబంధించిన 50% వాటిలో - 16.66% జీవాత్మగా ఉన్న నాకు సంబంధించినవి, 16.66% నా ఆత్మకు సంబంధించినవి, 16.66% పరమాత్మకు సంబంధించినవి ఉండాలని; అలాగే ప్రపంచానికి సంబంధించిన 50% వాటిలో - 16.66% పాజిటివ్, 16.66% నెగెటివ్, 16.66% న్యూట్రల్ కు సంబంధించినవి ఉండాలని ఇక్కడ గ్రహించండి.
ఇలా లోపలా-బయటా, ప్రపంచం మరియు పరమాత్మకు సంబంధించినవి ఎల్లప్పుడూ అనుభవంలో ఉండాలని, అంటే పాజిటివ్-నెగెటివ్-న్యూట్రల్-జీవాత్మ-ఆత్మ-పరమాత్మ ఈ ఆరు సమపాళ్ళలో కలిసి ఏకమై ఉన్న స్వచ్ఛమైన శక్తి-చైతన్యం లోపలా-బయటా ఎల్లప్పుడూ అనుభవంలో ఉండాలని ఆకాంక్షించండి.
99%:1% సాధన
ఇలా మీరు 16.66% సాధనలో నిష్ణాతులైన తర్వాత, 99%:1% సాధనను ఆరంభించండి. మానవులతో సహా ప్రపంచంలోని ప్రతిదీ అణువులతో తయారైంది. క్వాంటం ఫిజిక్స్ ప్రకారం మన శరీరంలో 99% ఖాళీయే ఉంది. మిగిలిన 1% మాత్రమే పదార్థంగా లేదా రూపంగా ఉంది. కాబట్టి ఈ విశ్వంలోని ప్రతీది (పాజిటివ్, నెగటివ్, న్యూట్రల్) 1% రూపంతో మరియు 99% నిరాకార స్వచ్ఛమైన శక్తి చైతన్యంతో తయారైనాయని అనుభూతి చెందండి. దీని గురించి మరింత సమాచారం కోసం నమ్మకాలు అలాగే ద్వంద్వం శూన్యం ఏకత్వం అనే టాపిక్ లను చదవండి.
త్రిగుణాల సాధన
మనం మామూలుగా తలరాతలో ఏది ఉంటే అది మన దగ్గరికి వస్తుంది అని భావిస్తాం. అంటే మంచి ఉంటే మంచి లేదా చెడు ఉంటే చెడు వస్తుంది అని భావిస్తాం. కానీ ఇప్పటి నుంచి ఈ నమ్మకాన్ని కూడా మార్చేయండి. అన్ని వ్యతిరేకాలు లేదా త్రిగుణాలు సమపాళ్ళలో కలిసి ఏకమై ఉన్న స్వచ్ఛమైన శక్తిచైతన్యం అనేది తలరాత నుంచి అందరి నుంచి నా దగ్గరకు వస్తుంది అని భావించండి. అలాగే నేను కూడా త్రిగుణాలు (మంచి చెడు తటస్థం) సమపాళ్ళలో కలిసి ఏకమై ఉన్న స్వచ్ఛమైన శక్తిచైతన్యాన్ని అందరికీ పంపిస్తాను అని భావించి, ఈ స్థితితో ఏకమై ఉన్నప్పుడే మనకు సంకల్ప స్వేచ్ఛ ఉంటుంది. అంటే లోపల బయట ఉన్న అన్నింటి నుంచి అన్నింటికీ స్వచ్ఛమైన శక్తి చైతన్యం ప్రవహించాలని భావించండి.
No comments:
Post a Comment