Sunday, September 1, 2024

"మధురమైన కృష్ణతత్త్వం” - శాస్త్రి ఆత్రేయ

 🌼🌼
"మధురమైన కృష్ణతత్త్వం”
- శాస్త్రి ఆత్రేయ
శ్రీకృష్ణుని అవతారమే ఎంతో మధురం. అతని పుట్టుక సత్యానికి, అతని నీలివర్ణ శరీరఛాయ అఖండ చైతన్యానికి, చేసే మురళీగానం బ్రహ్మానందానికి, కిరీటంలో ధరించే నెమలి పించం బ్రహ్మచర్యానికి, వెంటవచ్చే ఆవు నిష్కామకర్మకు, ఇష్టపడే పాలు స్వచ్ఛతకు, జతకలిసే గోపికామణులు ఇచ్చా-జ్ఞాన-క్రియా శక్తులకు, వేలితో పైకెత్తే గోవర్ధన గిరి చేష్ట విశ్వసంరక్షణకు, పాదాలతో త్రొక్కే సర్పలీల దుష్టసంహారానికి, వెన్నను దొంగిలించే తత్త్వం యోగుల హృదయ చోరత్వానికి, ఇద్దరు తల్లుల వైనం ఆత్మా-పరమాత్మల కలయికకు ఇలా చెప్పుకుంటూ పోతే కృష్ణతత్వమంతా మధురమే! 🙏🙏🙏
ఎంత మాయలో వున్నా జ్ఞానంతో ఆలోచిస్తే సృష్టి మధురం, జన్మ మధురం, కర్మ మధురం, జ్ఞానం మధురం, ధ్యానం మధురం, యోగం మధురం, అనుభూతి మధురం. అదే జగద్గురు శ్రీకృష్ణుని మధురమైన సందేశం. 
నాతోపాటు ప్రతీ జడజీవ పదార్ధము మధురమైన పరమాత్మ స్వరూపమే! అదే అతడు బోధించిన గీతామాధుర్యం. 
మామిడిపండులో తియ్యదనం, నిమ్మకాయలో పులుపుదనం, నీళ్లలో జీవశక్తి, పాలలో పౌష్టికశక్తి, పువ్వుల్లో అందం, ఇనుములో గట్టిదనం, తైలములో మండెగుణం, విప్పపువ్వులో మత్తెకించేగుణం, సింహంలో ధైర్యం, ఏనుగులో బలం, ఉడుముకి పట్టుగుణం, జలగకు పీల్చేగుణం, చేపలకు ఈదేగుణం, పక్షులకు ఎగిరేగుణం, మనిషికి సంపూర్ణ జ్ఞానం. ఇవన్నీ కూడా మధురమైన పరమాత్మ విభూతి.
ఇలా అన్ని జడజీవవస్తువులలో వ్యాపించివున్న మధురమైన చైతన్యాన్నే నేను. అలాంటి నా మధురమైన విభూతిని అన్నిటియందు గుర్తించడమే జ్ఞానానికి నిదర్శనం. అలానే ప్రతి జీవుడు తనలో నెలకొనియున్న పరమాత్మను గ్రహించడం విజ్ఞానానికి నిదర్శనం. 
ఆహా! ఎంత మధురమైన కృష్ణబోధ! 🙏🙏
అంతేగాని మధురాతి మధురమైన పరమాత్మ ఎక్కడో ఎవ్వరికి అంతుచిక్కని ప్రదేశంలో వున్నాడని, అతని దర్శనం దుర్లభమని, ఏ జడజీవపదార్ధం అతని స్వరూపం కాదని, అనుకుంటూ పొతే అది అజ్ఞానానికి నిదర్శనమే అవుతుంది. అన్నింటినీ వాడుకుంటూ వాటి మాధుర్యాన్ని గుర్తించకపోవడం జీవుడు చేస్తున్న అన్యాయమే అవుతుంది.
అందుకేనేమో శ్రీ వల్లభాచార్యులవారు మధురాష్టకంతో శ్రీకృష్ణుని ముగ్దమనోహర రూపాన్ని దర్శించి మనకు అందించేరు 🙏🙏
అధరం మధురం వదనం మధురం | నయనం మధురం హసితం మధురమ్ |
హృదయం మధురం గమనం మధురం | మధురాధిపతేరఖిలం మధురమ్ ||
వచనం మధురం చరితం మధురం | వసనం మధురం వలితం మధురమ్ |
చలితం మధురం భ్రమితం మధురం | మధురాధిపతేరఖిలం మధురమ్ ||
వేణు-ర్మధురో రేణు-ర్మధురః| పాణి-ర్మధురః పాదౌ మధురౌ |
నృత్యం మధురం సఖ్యం మధురం | మధురాధిపతేరఖిలం మధురమ్ ||
గీతం మధురం పీతం మధురం | భుక్తం మధురం సుప్తం మధురమ్ |
రూపం మధురం తిలకం మధురం | మధురాధిపతేరఖిలం మధురమ్ ||
కరణం మధురం తరణం మధురం | హరణం మధురం స్మరణం మధురమ్ |
వమితం మధురం శమితం మధురం | మధురాధిపతేరఖిలం మధురమ్ ||
గుంజా మధురా మాలా మధురా | యమునా మధురా వీచీ మధురా |
సలిలం మధురం కమలం మధురం | మధురాధిపతేరఖిలం మధురమ్ ||
గోపీ మధురా లీలా మధురా | యుక్తం మధురం ముక్తం మధురమ్ |
దృష్టం మధురం శిష్టం మధురం | మధురాధిపతేరఖిలం మధురమ్ ||
గోపా మధురా గావో మధురా | యష్టి ర్మధురా సృష్టి ర్మధురా |
దలితం మధురం ఫలితం మధురం | మధురాధిపతేరఖిలం మధురమ్ ||
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు! 🙏🙏🙏

No comments:

Post a Comment