🕉️అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18
శ్లోకం 57
శ్లో॥ అకుర్వన్నపి సంక్షోభాత్ వ్యగ్రస్సర్వత్ర మూఢధీః ! కుర్వన్నపి తు కృత్యాని కుశలో హి నిరాకులః ||
మూఢుడు ఏ పనీ చేయకున్నా తనలోని ఆందోళనలతో సతమత మవుతూనే ఉంటాడు. తెలివైనవాడు పనిచేస్తున్నా సత్యమయిన నిశ్చయ జ్ఞానంతో అంతరంగంలో శాంతంగా ఉంటాడు.
జీవన్ముక్తునికి కర్తవ్యమూ విహిత కర్మలూ ఉండవని క్రిందటి శ్లోకంలో చెప్పబడింది. అంటే జ్ఞాని ఏపనీ చెయ్యకుండా తుమ్మమొద్దులాపడి ఉంటాడని అర్థం కాదు. అనంతమైన తన కొత్తవ్యక్తిత్వం ఇచ్చిన పూర్తి స్వతంత్రంతో తనకు తోచిన విధంగా అతడు సమాజాన్ని సేవిస్తూనే ఉంటాడు. జ్ఞానీ, మూఢుడూ ఆచరించే కర్మలలో బాహ్యంగా తేడా ఏమీ ఉండదు. ఉన్నతేడా అంతా వారి అంతరంగాలలోనే. జ్ఞాని సదా శాంతుడై ఉంటాడు, మూఢుడు ఏ పనిచేసినా, మానినా సదా వ్యాకులతాంతరంగుడై ఉంటాడు! అట్టివాడు ధ్యానానికి కూర్చున్నా అంతరంగం మాత్రం అనేక విషయాలపై ఆకర్షణ వికర్షణలతో అల్లకల్లోలమయి ఉంటుంది.
అంతరంగంలో సదా శాంతుడై, సత్త్వగుణ ప్రధానమయిన అహంకా రంతో వ్యవహరిస్తూ, మనోబుద్ధులతో ఆత్మజ్ఞానానందం ప్రతిఫలిస్తుండగా, జ్ఞాని అనేక కర్మలను చేపట్టగలడు. అవి మానవాళికి మహోన్నత పథాన్ని చూపి మహా వర్షాలై భాసిస్తాయి. అనేక వ్యవస్థలను పూర్తి సేవాభావంతో స్థాపించి అహోరాత్రాలు శ్రమించి అశేష మానవాళికీ మార్గదర్శకుడూ ఆనందదాయకుడూ అయినప్పటికీ అంతరంగంలో నిరహంకారిగా, బాలునివలె, క్రీడా వినోదాలలో పాల్గొన్నట్టుగా హాయిగా ఉండగలడు. అట్టివారి చేష్టలు అసాధారణంగా, మానవాతీతంగా, మానవాళికి మహోపకారంగా, అద్భుతంగా, అనన్యసామాన్యంగా, అందరికీ ఆశీస్సు పరిణమిస్తాయి.
ఈ భావమే భగవద్గీతలో మరొకవిధంగా వ్యక్తం చెయ్యబడింది. సమస్త కర్మలను విసర్జించి అడవిలో తపస్సు చేస్తానని అర్జునుడన్నప్పుడు భగవాన్ కృష్ణుడతనిని పరిహసిస్తాడు. జీవితాన్నీ కర్మలనూ విడచిపెట్టి దూరంగాపోవడమే మతమూ ధర్మమూ బోధిస్తున్నాయా? అది కేవలం అసమర్థుల లక్షణం. ఉన్న చోటనే నిలబడి సత్యాన్ని తెలుసుకొని తాను చేస్తున్న పనులకుగల కారణాన్నీ ప్రయోజనాన్నీ అర్థాన్నీ తెలుసుకుని జీవిత పరమార్థాన్ని గుర్తించాలి. భగవాన్ కృష్ణుడు తన తత్త్వజ్ఞానాన్నంతటినీ, మంత్రించినట్టుగా అతి చిన్నమాటలలో ఇమిడ్చి ఇలా అంటాడు. "సమత్వం యోగ ఉచ్యతే" (భగవద్గీత 2-48) సమత్వాన్ని కలిగి ఉండడమే యోగం, "యోగః కర్మసు కౌశలమ్" -"కర్మలను సమర్థవంతంగా నిర్వహించగలగడమే యోగం, నిజమైన జ్ఞాని కర్మలను విడిచి పెట్టి భీరువై పారిపోడు. తనకు ప్రాప్తించిన వానిని ఎంతో సమర్థతో అద్భుతంగా నిర్వర్తించి అందరికీ ఆదర్శప్రాయుడౌతాడు.🙏🙏🙏
No comments:
Post a Comment