Thursday, November 20, 2025

 🕉️అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18 
శ్లోకం 59

శ్లో॥ సుఖమాస్తే సుఖం శేతే సుఖమాయాతి యాతి చ | సుఖం వక్తి సుఖం భుంక్తే వ్యవహార్వేపి శాస్త్రధీః 11


జీవిత నిత్యకృత్యాలలో కూడా జ్ఞాని శాంత మనస్సుతో సుఖంగా కూర్చొనగలడు. సుఖనిద్రపోగలడు. హాయిగా తిరుగగలడు. ఆనందంగా భాషించగలడు. సంతోషంగా భుజించగలడు.

మహాత్మునికి అంతరంగంలోని అత్మానుభవమూ బాహ్యప్రపంచంలోని అనుభవాలూ వేరుకావు. అనంతమైన చైతన్యమే ఏకంగా నేననే భావంతోనూ, బహుళంగా ప్రపంచ భావాలుగానూ సర్వత్రా అనుభవిస్తున్నాననుకోవడాన్ని సదా ఆనందంగా వీక్షిస్తూ ఉంటాడు. సర్వత్రా ఒకే చైతన్యం అనేక భావాలుగా వ్యక్తమవుతూ ఉండడాన్ని చూస్తున్న అతని మనస్సు శాంతంగా సంతోషంగా మాయా వినోదమగ్నమయి ఉంటుంది. అందుకే అతడు సర (జీవులనూ సమ బుద్ధితో చూడగలడు. ఎటువంటి పరిస్థితీకూడా అతని అంతరంగ శాంతిని హరింప జాలదు.

ప్రారబ్ధానుగుణమయిన వాసనలతో నేను వేరుగా జీవుడుగా ఉన్నానని భ్రమించే అహంకారమే మనోబుద్దులతో తాదాత్మ్యం చెంది. రాగద్వేషాలతో ప్రపంచాన్ని చూసి, అనేక సమస్యలను సృష్టిస్తుంది. అహంకారాన్ని అధిగ మించిన జ్ఞానికి కేవలమయిన ఆత్మతత్త్వమే సర్వత్రా స్ఫురిస్తుంది. అట్టివానిలో విషయి విషయపరమైన విభేదం ఉండదు. ద్వంద్వాతీతమయిన ఆ దృష్టికి, ద్వంద్వానుభవాలయిన సుఖదుఃఖాలూ, శీతోష్ణాలూ, ధర్మాధర్మాల మొదలయిన వేవీ ఉండవు.

బాహ్యంగా కనిపించే నానాత్వ ప్రపంచం నిస్సందేహంగా, దాన్నిచూసే నాకంటే భిన్నంగా వేరుగా అనిపిస్తుంది. సాధారణంగా ఈ రెండూ రెండు విభిన్న విషయాలని, ఎట్టి పరిస్థితులలోనూ అవి ఏకం కావడానికి వీలులేదనీ మనం భావిస్తుంటాం. ఈ దురదృష్టకరమయిన ఆలోచనే, ఈ విషయి-విషయ పరమైన విభేదమే మనలోని సర్వసమస్యలకు మూలకారణమవుతోంది. దీనితో బాహ్య ప్రపంచం మహాబలవంతంగా దుర్బేధ్యంగా శత్రుదుర్గంలా అనిపిస్తుంది.

ఒక ఆవు ముఖం దాని పృష్ట భాగంకంటే నిశ్చయంగా వేరు విధంగా కనిపిస్తుంది. అంతమాత్రంచేత తెలివైన వాడెవడూ అవి రెండు జంతువులని అనుకోడు! ఆవుకు హాని కలిగించకుండా అందులో ఏ ఒక్క భాగాన్నీ మనం నశింపజేయలేము! విషయి, విషయాలూకూడా ఆత్మైచన్యం యొక్క విభిన్న వ్యక్తరూపాలే. ఏకమయిన ఆత్మ అనేకంగా గుర్తింపబడుతూ ఉందన్న సత్యాన్ని అనుక్షణమూ జ్ఞాని అనుభవపూర్వకంగా తెలుసుకంటూ ఉంటాడు. అందుకే అతని మనస్సు అన్ని పరిస్థితులలోనూ శాంతంగా ఉండగలుగుతుంది. 'శాంతధీః'

ఆత్మానుభవంతో అహంకార రహితులై, స్వార్థపూరితమయిన ఆలోచనలు లేనివారై జ్ఞానులు జీవితాన్ని జీవిస్తారు. సర్వకాల సర్వావస్థలలోనూ హాయిగా ఆనందంగా ఉండగలుగుతారు! 'సుఖం ఆస్తే, శేతే, వక్తి, భుంక్తే --- అన్ని వ్యవహారాలనూ సుఖంగా చెయ్యగలుగుతాడు. సుఖం కోసం దేననీ చెయ్యడు. భగవద్గీతలో (4-22) చెప్పినట్టుగా--- 'యదృచ్ఛాలాభసంతుష్టః'--- యధేచ్ఛగా లభించిన దేనితోనయినా సంతోషంగా ఉండగలడు.🙏🙏🙏

No comments:

Post a Comment