Thursday, November 20, 2025

 *భగవాన్ స్మృతులు -7*
🪷

​రచన: గుడిపాటి వెంకట చలం

*​సాధుని శాంతమ్మ అనుభవాలు - 4*

*కల*

ఆ రోజుల్లోనే నాకో కల వచ్చింది. గొప్ప కాంతి గల స్త్రీ ఒకామె సోఫాలో భగవాన్ ప్రక్కన కూర్చుని వుంది. భగవాన్ స్వయంగా ఆమెకు అలంకారం చేస్తున్నారు. ఇంకొకామె ఇటూ అటూ తిరుగుతూ ఆశ్రమములో పనులుచేస్తోంది. నేను భగవాన్తో "అదేమిటి,  శాంత సేవ చేస్తున్న ఆమెవంక చూడనన్నా చూడరు? మీ ప్రక్కన కూర్చున్న ఆమెను అంత ముద్దు చేస్తున్నారు!” అన్నాను. అంతలో సోఫామీది దేవిని మేళతాళాలతో పెద్ద పూరేగింపు చేస్తున్నారు, నాకు మెళుకువ వచ్చింది.

ఆ కల అంతా మురుగనార్ తో చెప్పాను. ఆయన చెప్పారు. 'నేను సోఫాపైన చూచిన ఆమె మోక్షలక్ష్మి' అని ఆమె ఎప్పుడూ భగవాన్ ప్రక్కన వుంటుందనీ, ఆ విషయం తాను యిదివరకే పాటల్లో వ్రాశాననీ చెప్పి, ఆ పాటలు నాకు వినిపించారు. మధ్యాహ్నం భగవాన్, నేను, మురుగనార్ పెద్ద పళ్లెం ముందు కూర్చుండి లడ్లు కడుతున్నాము. అప్పుడు నేను మురుగనార్ తో నా స్వప్నం భగవాన్ కి చెప్పమన్నాను. మురుగనార్ చెప్పటం ప్రారంభించారో లేదో "ఆ అమ్మ కోసం నీవేమైనా వకాలత్ వుచ్చుకున్నవా? ఎవరికి కల వచ్చిందో వారినే చెప్పమను” అన్నారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
నేను కల చెప్పాక భగవాన్ అన్నారు: “నాకు చేతవుననే తల దువ్వడం, జడ వెయ్యడం, అలంకారం చెయ్యడం, మొగలి పువ్వులు జడలో పెట్టి కట్టడము అన్నీను. నేను కొండమీద వున్నప్పుడు నాకు ఒకామె భోజనం తీసుకొనివచ్చేది. ఆమె నాకో విస్తరి, నా ప్రక్కన ఖాళీగా రెండో విస్తరి వేసి అన్నం వడ్డించేది. ఎవరికంటే అది తల్లికనేది, ఆ అమ్మకి ఆ విధంగా దర్శనం అయింది” అన్నారు.
📖

*మైసూరు మహారాజా*

ఒకసారి ఆశ్రమములో అనుకుంటున్నారు, మైసూరు మహారాజా వస్తున్నారనీ, ఆయన భగవాన్ని హాలులో దర్శించరనీ, ప్రత్యేకంగా ఎవ్వరు లేకుండా దర్శనం ఏర్పాటు చేయమన్నారనీ, ఎట్లా? భగవాన్ ఏమి మాట్లాడరే? చివరికి భగవాన్ స్నానానికి వచ్చినప్పుడు అక్కడ ఏర్పాటు చేశారు. ఆ మహారాజుగారు ఎన్నో పళ్లాలలో, ఎన్నో పదార్థాలు తెచ్చి భగవాన్ పాదాలముందు పెట్టారు. మేము వాళ్ళని దూరంగా నిలబడి చూస్తున్నాము. పది నిమిషాలు నిలబడి భగవాన్ వంక చూస్తూ వుండి చప్పున కాళ్లు పట్టుకున్నారు మహారాజుగారు. ఆయన కళ్ళవెంబడి ధారలు భగవాన్ పాదాలకి అభిషేకంచేశాయి. ఏదోదీనంగా మాట్లాడారు భగవాన్ తో. అంతే, వెళ్ళిపోయినారు.
📖

తరువాత కొద్ది రోజులలో తిరువాన్కూరు మహారాణి వచ్చారు ఆశ్రమానికి. ఆమెకోసం రోడ్లన్నీ బందోబస్త చేశారు. ఆమె వచ్చి భగవాన్ని ఎన్నో ప్రశ్నలడిగి వెళ్లారు. మర్నాడు భగవాన్ భోజనం చేసి యింకా లేవకుండా విస్తరిముందు కూర్చున్న సమయంలో నేను అడిగాను: "తిరువాన్కూరు మహారాణి వచ్చారే! ఏమన్నారు?” అని.

"ఏదో వచ్చిందిలే - ప్రశ్నలడిగి వెళ్లింది. అంతకన్న ఏముంది?”

"మైసూరు మహారాజా...?”

“అతనా? అతని కేం? పండిన పండు" అని భగవాన్ ఏమి జరిగిందో. అతనేమన్నారో అంతా అనుకరించి చూపారు. అతని మాటలూ, నమ్రతా, ఆపుకోలేని అతని దుఃఖమూ అన్నీ.

“నన్ను ఓ మహారాజా అని కూర్చోపెట్టారు. అందువల్ల నేను మీ వద్ద ఒక సాధారణ పరిచారకుణ్ణయి మీ సేవచేసే భాగ్యం నాకు లేకపోయింది. ఇక్కడ వుండను వీలులేదు. మళ్ళీ మిమ్ము చూడడానికి రానూ లేను. ఈ పది నిమిషాల్లో నాకు సంపూర్ణానుగ్రహం దయచెయ్యండి అన్నాడు" అని ఎంతో కదిలిపోయి మాట్లాడారు భగవాన్.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
అటు తరువాత మైసూరు మహారాజా స్వదస్తూరితో పెట్టి ఉత్తరం రాశాడు భగవాన్ కి, ఉత్తరం చివర భగవాన్ దగ్గర వెలిగించే వూదువత్తులు ఎక్కడ దొరుకుతాయో చిరునామా రాయించమన్నారు, అవి మైసూరు వత్తులే. ఆ మహారాజా అంతకన్న పరిమళమైన, విలువైన అగరువత్తుల్ని అనుభవించ లేదా? కాని, ఎంత చేసినా భగవాన్ హాలులో పరిమళం ఏ వత్తులకి, ఎట్లా వస్తుంది? అసలు ఆ పరిమళం ఆ వత్తులదైతే కదా..?
📖

*ఆవు దూడ*

ఎవరో పల్లెటూరి ఆయనకు కల వచ్చింది: "నీ ఆవుకి పుట్టబోయే దూడని రమణాశ్రమా నికి అర్పించ”మని. అట్లానే ఆవునీ, దూడనీ తెచ్చి భగవాన్ కి అర్పించుకున్నాడు కాని, ఇక్కడ అంతా అడవి. పెద్దపులులు తిరిగేవి. హాలుతప్ప ఇంకో గట్టి ఇల్లులేదు. అందుచేత ఆశ్రమం వారు "మా చేతకాదు. అవునీ, దూడనీ తీసుకొనిపో” అన్నారు. కాని అతను “నాకు స్వప్నం వచ్చింది, తీసుకుపోను" అన్నాడు.

అందుచేత అతని అర్పణని స్వీకరించి, వూళ్ళో ఒక అతనికి పెంచమని ఇచ్చారు ఆవునీ, దూడనూ. ఆ దూడే గోవు లక్ష్మి. అది పెద్దదై మూడు దూడల్ని పెట్టేదాకా అతని దగ్గరే వుంది. ఈలోపల ప్రతిరోజూ స్వామిని చూడడానికి ఆశ్రమానికి వచ్చి - రాత్రులు వూళ్ళోకి వెళ్ళేది, తక్కిన స్త్రీల మల్లేనే. ప్రొద్దున్నే రావడం ఆశ్రమంలోనే ఉండడం గడ్డి మేసుకుంటూ; మధ్యాహ్నం ఆశ్రమంలో భోజనం చెయ్యడం, మధ్య మధ్య స్వామిని దర్శించుకొనడం— యివి ప్రతిరోజు లక్ష్మిగారి కార్యక్రమం.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment