ఓం నమో భగవతే శ్రీ రమణాయ
భక్తుడు :
భగవాన్! అనాదిగా ఉన్న వాసనల వల్ల తప్పులు చేస్తాము. జ్ఞానం కలిగితేనేగాని ఆ వాసనలు పోవు. కాని జ్ఞానం అసాధ్యం అనిపిస్తున్నది. కర్మ క్షయానికి ప్రాయశ్చిత్తం మాత్రం చాలదు. ప్రాయశ్చిత్తం ఎన్నిటికని, ఎంతకని ? ఏమి చేద్దామన్నా కష్టంగా, అసాధ్యంగా తోస్తున్నది. ఈ సమస్యల అన్నిటికి సత్సంగం ఒక్కటే మందుగా ఉంది!
మహర్షి :
ఏమి చేస్తాం? సత్యము ఒక్కటే ఒకటి. దాన్ని సాధించేది ఎట్లా? సిద్ధి అనేది భ్రాంతి. అభ్యాసం కావలసి ఉన్నట్లున్నది! అభ్యసించేది ఎవరు ? కర్తను వెదకితే, కార్యము దాని ఉపకరణాలూ అన్నీ మాయమై పోతాయి.
సిద్ది ఇప్పటికి ఇక్కడే లభించి ఉండక, క్రొత్తగా వచ్చేదైతే, దానివలన ప్రయోజనమూ లేదు. శాశ్వతమైనది ఎల్లప్పుడూ ఉండవలెను. క్రొత్తగా సిద్ధించేదైతే అది కలకాలం ఉండునా?
అందుచేత, ఎప్పటికీ ఇక్కడే ఉండే దాన్ని సాధించు. పూర్వం యోగులు అట్లాగే చేశారు, ఇప్పుడూ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సిద్ధి కలుగుతున్నది కనుక, అది సరికొత్తగా కనిపిస్తుంది. ఒక్కసారి అజ్ఞానం కప్పేసి, అందుండి బయట పడితే, క్రొత్తగా దొరికినట్లు తోస్తుంది. కాని అందులో క్రొత్తగా ఏమీ లేదు.
No comments:
Post a Comment