Thursday, November 20, 2025

 1️⃣0️⃣2️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

     *4. జ్ఞాన యోగము.* 
   (నాలుగవ అధ్యాయము)

*14. న మాం కర్మణి లిమ్పన్తి న మే కర్మఫలే స్పృహాl*
 *ఇతి మాం యాఽభిజానాతి కర్మభిర్న స బధ్యతేll*

ఓ అర్జునా! నాకు ఏ కర్మలు గానీ వాటి ఫలములు గానీ అంటవు. నాకు కర్మ చేయాలనే కోరిక కూడా లేదు. అవసరం అంతకన్నా లేదు. నా లక్షణములను గురించి తెలుసుకున్నవాడు, ఎటువంటి కర్మల చేతా బంధింపబడడు. ఎందుకంటే సాధకుడు ఎల్లప్పుడూ నా యొక్క లక్షణములను అనుకరిస్తాడు, ఆచరిస్తాడు. ఆయన కర్మలు చేసినా నా మాదిరి ఎటువంటి ఆసక్తి లేకుండా, ఫలాపేక్షలేకుండా చేస్తాడు. నేనేమిటో నా లక్షణాలేమిటో, నేను ఏ మాదిరి సంగం లేకుండా కర్మలు చేస్తానో తెలుసుకుంటాడు. నేను కర్మలు చేసినా నాకు కర్మఫలములు ఎందుకు అంటడం లేదో ఆ రహస్యం తెలుసుకుంటాడు. అపుడు అతడు కూడా నా మాదిరే ఈ కర్మల చేతా, కర్మఫలముల చేతా బంధింపబడడు. తుదకు నన్నే పొందుతాడు.

*15. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిఃl*
 *కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్ll*

పైన చెప్పిన విధంగా నన్ను అనుసరించిన ముముక్షువులు, మనులు ఎంతో మంది నిష్కామ కర్మలు ఆచరించి ముక్తిపొందారు. నీవు కూడా నీ పూర్వులు ఆచరించిన మాదిరి ఆచరించు.

ఈ శ్లోకాన్ని పై శ్లోకంతో అన్వయించుకోవాలి. పై శ్లోకంలో పరమాత్మ నేను ఈ విశ్వాన్ని సృష్టించాను, వారి వారి గుణములను, చేసే కర్మలను బట్టి వారు నాలుగు వర్ణములుగా విభజింపబడ్డారు. నేను అందరిలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాను. కాని నేను ఏ కర్మాచేయను. చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే నాకు కర్మలు చేయవలసిన అవసరము, ఆ కర్మల మీద ఆసక్తి లేదు. ఆ కర్మఫలములను నేను ఆశించను. ఒక వేళ నేను కర్మలు చేసినా ఆ కర్మఫలములు నన్ను అంటవు. ఇదీ నా తత్త్వము. నా తత్వమును తెలుసుకొని నన్ను అనుసరిస్తే అంటే నేను చేసినట్టు కర్మలను ఆసక్తి లేకుండా, నిష్కామంగా చేస్తే, వారిని కర్మబంధనములు అంటవు. వారు నిరంతరము నా మాదిరి ఆనంద స్వరూపులుగా ఉంటారు.

ఓ అర్జునా! మరలా చెబుతున్నాను. ఇదేదో నేను నీకు చెబుతున్న తత్వము కాదు. ఈ తత్వము ఈనాటిది కాదు. అతి పురాతనమైనది. ఎంతో మంది ఋషులు ముముక్షువులు అంటే మోక్షం కోసం ప్రయత్నంచేసిన వారు, నేను పైన చెప్పిన తత్వమును తెలుసుకొని, ఆ తత్వము ప్రకారము కర్మలను ఆచరించారు. ముక్తులయ్యారు.

పరమాత్మ ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే, మోక్ష సాధనకు నిష్కామ కర్మ పునాది. నిష్కామ కర్మ ఆచరించడం వలననే మోక్షము అనే భవన నిర్మాణము మొదలవుతుంది. మోక్షము కావాలనుకొనే వారు ముందు నిష్కామ కర్మ ఆచరించాలి. ఇదే మార్గాన్ని కృష్ణుడు అర్జునుడికి కూడా ఉపదేశించాడు. నీవు కూడా ఎటువంటి కోరికలు, మమతానురాగములు లేకుండా, ఎటువంటి ఫలితమును ఆశించకుండా, ఎటువంటి ఆసక్తి లేకుండా, నీ స్వధర్మము, నీ కర్తవ్యము అయిన యుద్ధము చేసి కీర్తి గడించు. నీ పూర్వీకులు కూడా ఇదే మాదిరి చేసారు. వారు నీ మాదిరి సన్యాసం తీసుకుంటాను అని అనలేదు. వారూ రాజ్యపాలన చేసారు. నిష్కామ కర్మలు చేసారు. ఎటువంటి సంగం లేకుండా కర్మలు చేసారు. ముక్తిని పొందారు. నీవు కూడా వారి మార్గాన్నే అనుసరించు, అని ఉపదేశించాడు.

*16. కిం కర్మ కిమకర్మేతి కవయోఽప్యత్ర మోహితాl*
 *తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్||*

కర్మ అంటే ఏమిటి? అకర్మ అంటే ఏమిటి? అర్జునా ఈ విషయంలో వేదములు శాస్త్రములు చదువుకున్న పండితులు కూడా ఏమీ తెలుసుకోలేక పోయారు. తెలిసీ తెలియని మోహంలో, భ్రాంతిలో ఉన్నారు. ఏది తెలుసుకుంటే నీకు ఈ కర్మబంధనముల నుండి విముక్తి కలుగుతుందో, దాని గురించి చెబుతాను. శ్రద్ధగా విను.

ఈ కర్మ రహస్యం చాలా నిగూఢమైనది. బాగా శాస్త్రజ్ఞానము కలిగిన వారికే పూర్తిగా తెలియదు. అందరికీ అసలే తెలియదు. దీనిని తెలుసుకుంటేనే కానీ సంసార బంధనముల నుండి విముక్తుడు కాలేడు. ఈ సంసార బంధనముల నుండి బయటపడటానికి ప్రయత్నిస్తున్న ప్రతి వాడూ ఈ కర్మ రహస్యాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఆ కర్మరహస్యమును నేను నీకు చెబుతాను శ్రద్ధగా విను.

మనం ఇంతకు ముందు జ్ఞానయోగం గురించి తెలుసుకున్నాము. మనకు ఎటువంటి జ్ఞానం కావాలి అనే విషయం ఇక్కడ చెబుతున్నాడు. మనకు కర్మకు సంబంధించిన జ్ఞానం కూడా అవసరమే. కర్మ అంటే ఏమిటి? అది ఎలా చేయాలి? దాని స్వరూప స్వభావాలు ఏమిటి? అకర్మ అంటే ఏమిటి? ఏ పని చేయాలి. ఏ పని చేయకూడదు. చేస్తే ఎందుకు చేయాలి. ఎలా చేయాలి. చేయకూడని పని ఎందుకు చేయకూడదు. చేస్తే ఏమవుతుంది. దీనికి సంబంధించిన జ్ఞానం గురించి ఇక్కడ చర్చించబోతున్నాడు పరమాత్మ. కాబట్టి మానవునికి ఆత్మజ్ఞానముతో పాటు కర్మల గురించి జ్ఞానం కూడా అవసరమే అని తెలుస్తూ ఉంది. ఎందుకంటే అందరూ ఎన్నో కర్మలు చేస్తారే కానీ, దాని గురించి ఎవరూ తెలుసుకోలేదు. తెలుసుకోడానికి కనీసం ప్రయత్నించలేదు. బాగా చదువుకున్న పండితులుకూడా దీని గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు. కర్మ గురించిన జ్ఞానం నీవు తెలుసుకుంటే, నీకు శ్రేయస్సు కలుగుతుంది. అజ్ఞానం నుండి, అన్ని రకముల దుఃఖముల నుండి బయట పడతావు. అని కర్మల గురించిన జ్ఞానాన్ని అర్జునుడికి ఉపదేశించాడు కృష్ణుడు.

పూర్వం చెట్టు కింద కూర్చున్న వ్యక్తి చెట్టుమీదినుండి ఒక యాపిల్ పండు కిందపడగానే అందరి మాదిరి దొరికింది కదా అని, దానిని తీసుకొని తినలేదు. అది ఎందుకు కింద పడింది అని ఆలోచించాడు. అలాగే ఒక కుర్రాడు టీ కెటిల్ లో నీరు మరుగుతూ ఆవిరి బయటకు వచ్చి కెట్టిల్ మీద పెట్టిన మూతను పైకి ఎగరకొడుతుంటే, ఆ మూత అలా ఎందుకు ఎగురుతూ ఉంది అని నీటి ఆవిరికి ఉన్న శక్తిని గురించి ఆలోచించాడు. మరొకాయన నీటి తొట్టిలో పడుకున్న తన శరీరం తేలికగా ఉండటం గమనించాడు. మరొకాయన పక్షులు ఆకాశంలో రెక్కలు విప్పుకొని ఎలా తిరగగలుగుతున్నాయి అని ఆలోచించాడు. ఈ ఆలోచనలే నేడు మానవసమాజ వికాసానికి, పురోభి వృద్ధికి తోడ్డడ్డాయి. అలాగే కర్మల గురించిన జ్ఞానం తెలుసుకుంటే, ఆ కర్మల వలన కలిగే బంధనముల నుండి విడివడి, మోక్షము పొందడానికి శాశ్వతానందము పొందడానికి మార్గం తెలుస్తుంది.

అందుకే కృష్ణుడు అంటున్నాడు ఓ అర్జునా! కర్మ అంటే ఏమిటో, కర్మ చేయకుండా ఉండటం అంటే ఏమిటో, నీకే కాదు, బాగా చదువుకున్న పండితులకు కూడా సరిగా అర్థం కాలేదు. కాబట్టి, ఆ విషయాలన్నీ నీకు వివరిస్తాను. ఇవన్నీ నీకు పొద్దుపోక చెప్పడం లేదు. ఇవి తెలుసుకుంటే నీవు చేయవలసిన కర్మలు చేసి, కర్మల గురించిన జ్ఞానం పొంది, ఈ ప్రాపంచిక విషయముల నుండి విముక్తి పొంది, తుదకు మోక్షం పొందుతావు. అని అన్నాడు.
(సశేషం)

*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                           P241

No comments:

Post a Comment