Thursday, November 20, 2025

 🌴 చిన్న కథ  🌴
******************


లొట్టిపిట్ట: 

ఆనందపురం గ్రామపెద్ద ఏకైక కొడుకు సుందరుడు. పేరుకి తగ్గట్టు చాలా అందగాడు.‌ తండ్రికి కొడుకంటే వల్లమాలిన ముద్దు.

తండ్రి చేసిన అతిగారాబంతో సుందరుడికి చాలా గర్వం వచ్చింది.
వాడికే అన్నీ తెలుసన్న అహంకారం, మిగిలిన వారంటే చిన్నచూపు వచ్చేయి.

పాఠశాలలో తనకోసం అని ఒక్కడు మాత్రమే కూచోడానికి వీలుగా ఉన్న చిన్న బల్ల చేయించుకొని ముందువరసలో వేయించుకొని కూచొనేవాడు.

పెద్దగా పాఠాలు వినకపోయినా సహజంగా తెలివైన వాడు అవడం కొంత నేర్చుకొనేవాడు. 

పరీక్షల్లో వాడు ఏది రాసినా వాడినే మొదటవరసలో ఉంచి పొగిడేవారు.

దాంతో వాడికి మరీ బింకం ఎక్కువ అయింది. వాడి పాఠశాలకి కొత్తగా
'కామేశం పంతులు' అనే గురువు వచ్చేరు. అతనికి మొదటినించీ సుందరం వరస ఆశ్చర్యంగా ఉంది.

మిగతా ఉపాధ్యాయులు మొత్తం చెప్పేరు. అయితే అందరూ 'వాడు స్వతహాగా తెలివైన వాడే తండ్రి అతిముద్దు చేయడమే దీనికి కారణం' అని చెప్పేరు.

కామేశం గ్రామపెద్ద ఇంటికి వెళ్ళి సుందరం గురించి చెప్పబోతే, అతను వినిపించుకోలేదు. "వాడి తెలివిని అంతమందీ పొగుడుతూ ఉంటే, నీ ఒక్కడికే వాడి తప్పు కనిపిస్తున్నాదా? జాగ్రత్తగా గమనించు" అనేసేడు.

కామేశం అప్పటి ఊరుకున్నాడు.

తరగతిలో ఏ ప్రశ్న అడిగినా తెలిసినా, తెలీకపోయినా నోటికి వచ్చినది వాగడం సుందరం అలవాటు.

కామేశం ఆ రోజున ఒకొక్కళ్ళనీ, ఒకొక్క ప్రశ్న అడుగుతున్నాడు.

"రామూ, సింహం తెలుసా? చూసేవా?"

రామూ ఉత్సాహంగా "తెలుసండీ.
మా నాన్న జంతు ప్రదర్శన శాలలో చూపించేడండీ" అన్నాడు.

"పాపారావూ నీకు చిరత తెలుసా?" అడిగేడు.

"తెలుసండీ నేను కూడా జంతు ప్రదర్శనశాల లోనే చూసేనండీ" అన్నాడు పాపారావు.

"సుందరం లొట్టిపిట్టని చూసేవా?" అన్నాడు.

"సుందరం పకపకా నవ్వి "ఇదో ప్రశ్నా? మా ఇంట్లో ఎన్నో రకాల పక్షులని పెంచుతున్నాం. ఎన్నో లొట్టిపిట్టలు ఉన్నాయి. మా పెరట్లో జామచెట్టు మీద రోజూ వాలతాయి" అన్నాడు.

వెనకనించీ మిగతా పిల్లలు నవ్వడం వాడికి తెలీదు.

మర్నాడు ఆదివారం కామేశం మిగిలిన పిల్లలందరినీ తీసుకొని
గ్రామపెద్ద ఇంటికి వెళ్ళేడు. వారు వెళ్ళెటప్పటికి గ్రామ పెద్ద అరుగుమీద కూచొని ఊరి పెద్దలందరితో మాటాడుతున్నాడు.

అందరినీ చూస్తూ ఆశ్చర్యపడి "ఏమిటి పంతులుగారూ! ఇలా అందరితో కలిసి వచ్చేరు?" అన్నాడు.

కామేశం తనచేతిలో ఉన్న పూలగుత్తి గ్రామ పెద్దకి ఇచ్చి, "మీ పెరటి జామ చెట్లమీద రోజూ లొట్టిపిట్టలు వాలతాయట కదా! వాటిని మీరు పంజరాల్లో పెంచుతారట కదా! మా పాఠశాల విద్యార్థులందరూ
చూడాలని ఆశపడుతున్నారు" అన్నాడు. 

గ్రామపెద్ద ఆగ్రహంతో లేచి "ఏమయ్యా పంతులూ! లొట్టిపిట్ట అంటే రామచిలక అనుకున్నావా? జామ చెట్టుమీద వాలడానికి? అది ఎడారిలో తిరిగే ఒంటె. ఆపాటి తెలీదా? అసలు మా ఇంట పంజరంలో ఉన్నాయని నీకు చెప్పిన మూర్ఖుడు ఎవరు?" అన్నాడు.

అప్పుడే బయటకి వచ్చి అంతా విన్న సుందరం భయంగా వెనక అడుగు వేసేడు. అక్కడ ఉన్న ఒకతను పాఠశాలలో సుందరమే అలా చెప్పేడని చెప్పేడు.

నిర్ఘాంతపోతూ చూసేసరికి సుందరం బుర్రదించుకొని "అవును. నేనే అలా చెప్పేను. మన పెరట్లో వాలే పక్షుల్లొ ఉందేమో అనుకున్నాను" అన్నాడు.

గ్రామపెద్దకి మొత్తం బోధపడింది. కామేశం గారితో తన కొడుకుని మన్నించమని అడిగి, తరవాత సుందరానికి మంచీ, చెడ్డా తెలిసేలా రోజూ బోధించడం మొదలెట్టేడు.

కామేశం అందరికీ "ఏ పిల్లలూ జన్మతహా పెంకి వాళ్ళు కాదు. 
వారికి సరిగ్గా తెలిసేట్టు చెప్పకపోతే అది పెద్దలదే తప్పు. పిల్లలు ఎంత 'కళకళ' లాడుతూ ఉంటే దేశం అంత బాగుంటుంది" అని బోధించేవాడు.

సుందరం 'కొంచెం కొంచెం' మారి ఏడాది తిరిగేసరికి కామేశంగారి ప్రియశిష్యుడు అయేడు. పాఠశాలకే ఉత్తమ శిష్యుడు అని పేరు తెచ్చుకున్నాడు.

సౌజన్యం : మంగు కృష్ణకుమారి గారు.

No comments:

Post a Comment