Thursday, November 20, 2025

 💐15శ్రీ లింగ మహాపురాణం💐

🌼భక్తి భావం గొప్పదనం  - విశిష్టత🌼

    #పదహేనవ భాగం#
"శౌనకాది మునులారా! భక్తి వలన కలుగుఫలమువేలకొలది చాంద్రాయణవ్రతములు,వందలకొలదిప్రాజపత్యయజ్ఞములు, నెలలకొలదిఉపవాసవ్రతములు, సర్వ శుభ కర్మలు చేయుట వలన లభించు పుణ్యఫలంతో సమానము. పైగా వ్రతములు, అనుష్టానములు చేయడం వలన పరమేశ్వరుని పై భక్తి తగ్గిపోతుంది.

అటువంటి వారు పర్వత గుహలలో తపస్సులు చేసు కుంటూ వేలసంవత్సరాలు గడుపతారుకానీఈశ్వరఅనుగ్రహం లభించదు.కానీభక్తియొక్క గొప్పదనంగమనించండి.ఈశ్వరా నుగ్రహం పొందిన మహా భక్తులను దర్శించిన సాధారణ మానవునికి స్వర్గసుఖాలు పొందే అధికారం లభిస్తుంది అంటే భక్తి యొక్క గొప్పదనం అర్థం చేసుకోండి.

బ్రహ్మ విష్ణు ఇంద్రాది సర్వ దేవతలు, మునులు పరమేశ్వరుని పై భక్తి ద్వారానే తమ స్థానములు స్థిరపరచుకుని  సుఖములు, శక్తులు, సౌభాగ్యములు పొందుతున్నారు. ఈ విషయము కాశీ క్షేత్రంలో పరమేశ్వరుడు పార్వతీదేవి అడిగిన ప్రశ్నకు సమాధానంగా వివరించి చెప్పారు.  ఆ వృత్తాంతం వివరిస్తాను. వినండి.

ఒకసారి కాశీనగరంలో విశ్వనాథుడిగా ప్రజల చేత పూజలందుకుంటున్న పరమేశ్వరుని చూసి అన్నపూర్ణ యైన ఉమాదేవి "ప్రభూ! నిన్ను పొందుటకు భక్తులు ఏ విధానము అవలభించాలి? భక్తి చేతనా లేక తపము చేతనా లేక జ్ఞానము చేతనా లేక యోగము చేతనా! ఏ పద్దతి అనుసరించడం వలన నీ అనుగ్రహం లభిస్తుంది" అని ప్రశ్నించింది.

పరమేశ్వరుడు నవ్వుతూ "శైలరాజపుత్రీ! పూర్వము బ్రహ్మ కూడా నన్ను పంచ కల్పాలలో పంచ రూపాలలో దర్శించి ఇదే ప్రశ్న అడిగాడు. శ్వేతకల్పంలో నన్ను సద్యోజాత రూపములో దర్శించాడు. రక్తకల్పంలో ఎఱ్ఱని రూపంలో వామదేవునిగా దర్శించాడు. పీత కల్పంలో పసుపురంగులో తత్పురుష రూపంలో దర్శించాడు. అసిత(కృష్ణ) కల్పంలో నల్లని రూపంలో అఘోర రూపంలో ఈశ్వరునిగా దర్శించాడు. విశ్వరూప కల్పంలో బహు వర్ణములలో గల ఈశాన రూపంలో దర్శించిన తరువాత బ్రహ్మ ఇలా అడిగాడు.

"మహేశ్వరా! సద్యోజాతా! వామదేవా! తత్ఫరుషా! అఘోరా! ఈశానా!  నిన్ను గాయత్రితో కూడి ఉండగా దర్శించే భాగ్యం నాకు లభించింది. ప్రభూ! నిన్ను ఏ విధానము పాటించి వశము చేసుకొనవచ్ఛును? ఏ ప్రదేశములో నిన్ను ధ్యానించాలి? నీవు తప్ప నా సందేహములను ఎవరు తీర్చలేరు!"

నేను నవ్వి "కమలసంభవా! నన్ను భక్తి శ్రద్థలతో ధ్యానము చేసినవారికి వశీభూతుడను అవుతాను. లింగ రూపములో నన్ను భక్తులు ధ్యానించ వచ్చును. నీవు విష్ణువు నా లింగ రూపమును మహాసముద్రంలో ఇంతకు ముందే దర్శించారు కదా!

నా దర్శనము, అనుగ్రహం కోరువారు లింగ రూపంలో, పంచముఖ రూపంలో, పంచాక్షరి మంత్రం ద్వారా నన్ను సేవించవచ్చును. బ్రహ్మదేవా! నీవు కూడా భక్తి ద్వారానే నా దర్శనం పొందగలుగుతున్నావు! ఎవరు నన్ను భక్తిభావన నిండిన మనస్సుతో ప్రార్ధన చేస్తారో, వారిని నేను సంతోషంగా అనుగ్రహించి  దర్శనం ఇస్తాను.

ఉమాదేవీ! బ్రహ్మదేవుడు నా పట్ల గల భక్తిని మనస్సంతా నింపుకోవడం వలనే నన్ను చూడగలిగాడు. నన్ను భక్తి శ్రద్థలతో మనస్సు నిండినవారు మాత్రమే చూడగలరు. నన్ను లింగ రూపములో దర్శించ వచ్చును. ద్విజుల ద్వారా దర్శించవచ్చును.  శ్రద్ద అనునది సూక్ష్మమైన ధర్మము.  శ్రద్దయే జ్ఞానము తపము! శ్రద్దయే స్వర్గము మోక్షము. అందువలన భక్తి శ్రద్ధల వలన మాత్రమే నా దర్శనం, అనుగ్రహం పొందగలరు" అని పరమేశ్వరుడు ఉమాదేవి సంశయం తీర్చాడు.

మునులారా! శంకరుడు భోళా శంకరుడు. భక్తి శ్రద్థలతో పరమేశ్వరుని ప్రార్థిస్తే చాలు! అనుగ్రహిస్తాడు. ఆయన పై అచంచలమైన భక్తి శ్రద్థలు ఏర్పడటానికే లింగ రూపంలో మనకు కనపడుతున్నాడు"

అన్న సూత మహర్షి భాషణం విన్న శౌనకాది మునులు "మహాత్మా! బ్రహ్మదేవుడు మహేశ్వరుని సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన రూపాలలో చూశాడు అని చెప్పారు కదా! ఆ సందర్శనాలు ఎలా ఎక్కడ జరిగాయి? మాకు వివరించి చెప్పండి" అని అడిగారు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట 
కరణంగారి సౌజన్యంతో🌹
💜   ఓం శ్రీఉమా 
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః 
సుఖినోభవన్తు🙏 
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
     (సర్వం శ్రీశివార్పణమస్తు) 
                🌷🙏🌷

శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

No comments:

Post a Comment