Thursday, November 20, 2025

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ       
                                 
    ఒక సంపన్నురాలు ఆశ్రమం నుండి వెళ్లిన కొన్ని రోజులకే తిరిగి వచ్చి మహర్షికి నమస్కరించి "భగవాన్! పోయినసారి నా భర్తా పిల్లలతో వచ్చాను. ఉన్నకాలమంతా వారి భోజనాదుల విచారింపుతోనే కాలం గడచి పోయింది. ఎక్కువకాలం ఇక్కడ ఉండలేకపోయాను. అంత త్వరగా వెళ్లినందుకు ఎంతో బాధపడ్డాను. ఈసారి అయినా మీ సాన్నిధ్యంలో ఎక్కువకాలం ఉండేటట్లు అనుగ్రహించండి!" అని అన్నది.

    అందుకు మహర్షి చిరునవ్వుతో సుమారుగా ఒక గంటసేపు ఆమె వైపే దృష్టి సారించారు. ఆమె కూడా కదలక మెదలక అట్లే ఉన్నది. 

    ఉన్నట్లుండి ఆమె ఠక్కున పైకిలేచి "సరే భగవాన్! ఇక నేను వెళ్లిపోతాను. బెంగళూరుకు ఇక్కడికీ మధ్య ఒక నది వరద పారుతున్నది. నా ముందే ఒక బస్సు ప్రవాహంలో కొట్టుకుపోయింది. అయినా తమను చూడాలనే తపనతో నదిని దాటడానికి నాకు ఏ భయమూ కలుగలేదు. నా కారు మాత్రం భద్రంగా ఒడ్డు చేరుకుంది. వెలుతురు ఉండగానే నేను తిరిగి వెళ్లవలెను. నేను ఇక్కడికి మరలా వస్తానో, రానో తెలియదు. మహర్షి నాకు మనో బలాన్ని, భక్తిని ప్రసాదించగలరు. ఆత్మానుభవము కూడా నేను అంతగా మెచ్చను" అని అన్నది.
 
    అందుకు మహర్షి "కోరిక అంత బలంగా  ఉన్నప్పుడు నీవు మెచ్చినా, మెచ్చక పోయినా ఆత్మానుభవము బలవంతముగా ఆవహిస్తుంది. నీ మంచి ఆలోచనే ఆత్మ ద్వారపు తలుపు" అని సెలవిచ్చారు.

   అందుకు ఆమె "అలాగే భగవాన్! ఇక మీ ఇష్టం. కానీ వ్యక్తిగతంగా నేను ఎంతో బలహీనురాలిని. క్రితంసారి వచ్చినప్పుడు అనేక ప్రశ్నలతో మిమ్ములను చాలా విసిగించాను. ఈసారి అడగటానికి ప్రశ్నలే రావటం లేదు. అంతా తమ అనుగ్రహం" అని అన్నది. 

      అందుకు మహర్షి "ఇన్నిసార్లు నీవు ఇక్కడికి రావడమే అనుగ్రహమని నీకు అనిపించడం లేదా!" అని అన్నారు. 
        
     మహర్షి నుండి వచ్చిన ఈ ప్రశ్నతో ఆమెకు ఆశ్చర్యంతోపాటు ఆనంద బాష్పాలు జలజలా రాలాయి. నేనే ఈ విషయం మిమ్ములను అడగవలెనని అనుకున్నాను. మీరే  నన్ను ఇక్కడికి రప్పించుకుంటున్నారా! అని. ఉన్నట్లుండి ఈ ఉదయాన్నే నా భర్త  "నాకు రెండు రోజులు సెలవులు! నీకు ఇష్టమైతే మహర్షిని చూచిరా!!" అని అన్నారు. నాకు ఎంతో ఆశ్చర్యమూ, ఆనందమూ కలిగాయి. అది భగవాన్ ఆహ్వానమనే నేను భావించాను. సరే, చివరిగా నేను ఎలా ఉండాలో చెప్పగలరు!" అని అన్నది.

     అందుకు మహర్షి  "బలమైన శక్తి ఒకటి నిన్ను నడుపుతున్నది. అది నడిపినట్లే నడుచుకో! ఏమి చేయవలెనో, ఎలా ఉండవలెనో ఆ శక్తికే తెలుసు. ఆ శక్తిని నమ్ముకో" అని సెలవిచ్చారు.

No comments:

Post a Comment