Saturday, June 18, 2022

జన్మలన్నింటిలోకీ ఉత్తమమైనది మానవజన్మ.

 జన్మలన్నింటిలోకీ 

ఉత్తమమైనది మానవజన్మ. 


సకల జీవరాశులలో ఉన్నతమైన జీవి.. మనిషి. 

ఏది శాశ్వతమో.. 

ఏది కాదో తెలుసుకొని, వివేకంతో ధర్మబద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తేనే మానవ జన్మ సార్థకమవుతుంది.

 

సదా ఆనందమయుడైన భగవంతుని అంశగా ఈ భూమి పైకి వచ్చిన మనమంతా పుట్టుకతోనే ఆనందస్వరూపులం. కానీ ఆధునిక పోకడలతో సహజత్వానికి భిన్నంగా బ్రతికేస్తున్నాం. 


అభ్యుదయం పేరుతో ఐహిక భోగభాగ్యాలపైనే దృష్టిపెట్టి సిసలైన జీవిత మాధుర్యాన్ని కోల్పోతున్నాం. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు.. విద్యార్జనలో ఇతరుల కంటే మిన్నగా ఉండాలనే తాపత్రయంతో,  తాను కృతకృత్యుడనవగలనా లేదా అనే భయంతోనే సమయమంతా గడిచిపోతుంది.


గృహస్థుగా.. ఎప్పుడూ ఏదో తెలియని భయం, నిర్వచించలేని అలజడి, అంతులేని కోరికలు, అసూయ, అనుమానం, ద్వేషం, క్రోధం, డబ్బు సంపాదన మీద విపరీతమైన ఆసక్తి, తుచ్ఛమైన ఇతర కోరికల మీద వ్యామోహంతో మనిషి జీవితంలో ఎన్నో మధుర క్షణాల్ని కోల్పోతున్నాడు. తృప్తి లేని కృషి దుర్వినియోగమవుతుంది. ఈ విధంగా జీవితమంటే సరైన అవగాహన లేకుండానే జీవిత ప్రయాణం పరిసమాప్తమౌతోంది. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి అయి ఉండి..తన అశక్తత తనకి తెలిసీ.. అంతా తనకే, తన వారికే దక్కాలనే అత్యాశతో బతికాడు. కొడుకు మరణించే వరకూ కూడా తన కిరీటాన్ని వదలుకోలేదు, అంతటి రాజ్యకాంక్ష. ఇక శకుని.. అనుకూల శత్రువులా ఆత్మీయులకే ఘోరవిపత్తు తెచ్చిపెట్టాడు. మదాంధుడైన దుర్యోధనుడు విపరీతమైన స్వాభిమానంతో సర్వనాశనానికి కారకుడయ్యాడు. తనది కాని దాన్ని తనదిగా చేసుకోవాలనే స్వార్థచింతన, అహంకారం, భౌతిక సంపదల మీద మితిమీరిన వ్యామోహం, ఆశ్రిత పక్షపాతం, తప్పులు చేయటానికి వెనుకాడకపోవడం వంటి లక్షణాలతో తాను నాశనమైపోయాడు.


అలాంటి చెడ్డవారే కాదు.. మంచివారు, గొప్పవారుగా కీర్తిగాంచిన ఎందరో చక్రవర్తులు, మహారాజులు, కారణజన్ములు, పురాణ పురుషులు సైతం కాలానికి తలవంచి కాలగర్భంలో కలిసిపోయారు. వారితో పోలిస్తే మనమెంత? ఎంతటివారికైనా మరణం అనివార్యం. ఇది సర్వకాలీన సత్యం. చనిపోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేమని ఎందరో మహనీయులు చెప్పారు. ఇవన్నీ తెలిసినా మారని మానవ నైజమే అన్ని కష్టాలకూ కారణం. పసిపాప నవ్వులో ఉండే ఆనందాన్ని, ఆకాశంలో ఎగిరే పక్షి స్వేచ్ఛాకాంక్షను, అప్పుడే విరిసిన పువ్వులోని అందాన్ని, వర్షపునీటిలో స్వచ్ఛతను, సూర్యకాంతిలో నిర్మలత్వాన్ని, చంద్రుని చల్లదనాన్ని, పీల్చే గాలిలోని జీవత్వాన్ని ఎన్ని కోట్లు ఇచ్చినా కొనగలమా? ఇవి లేకుండా బ్రతకగలమా? వాటిని ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా నిర్విరామంగా ఇస్తూ మన ప్రాణాల్ని నిలబెడుతున్న ఆ పరమాత్మకు కనీసం రోజూ కృతజ్ఞత కూడా మనం చెప్పం.


ఇలాంటప్పుడే మనిషి ఎంత అల్పుడా అని అనిపిస్తుంది. మనిషి సంతోషంగా ఉండాలంటే.. కోర్కెలను అదుపులో ఉంచుకోవాలి. పగ, ఆవేశం, కోపం, అనుమానాలకు దూరంగా ఉంటూ.. తనకు కలిగిన దానితో సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. ఇతరులకు వీలైనంత సహాయం చేస్తూ,  తన ఉనికికి కారణమైన ఆ పరమాత్మను సదా స్మరించాలి. ఇలా జీవించడం అలవరచుకుంటే సంతోషాలకు కరువే ఉండదు. అయితే, సంతోషం కోరుకుంటే రాదు.. సంతోషాన్ని తెలుసుకున్న వారికే అది దక్కుతుంది.

.

No comments:

Post a Comment