Monday, June 27, 2022

నేటి చిట్టి కథ

 ✍️........ 🌻 *నేటి చిట్టి కథ🌻*


🥀పూర్వం ఓ గ్రామంలో ఒక లక్షాధికారి ఉండేవాడు. అతడికి ఒక్కగానొక్క కొడుకు. గారాబంగా పెరిగాడు. చెడు సావాసాలతో కొరకరాని కొయ్యలా తయారయ్యాడు.


🥀కొడుకు బుద్ధి మార్చాలని తండ్రి ఎంతో ప్రయత్నించాడు. అయినా అతడి తీరు మారలేదు. 


🥀రోజులు గడుస్తున్నాయి. లక్షాధికారికి ముసలితనం వచ్చింది. కొడుకేమో ఆస్తిని నాశనం చేయసాగాడు.


🥀కొడుకును దారిలో పెట్టడానికి ఒక ఉపాయం ఆలోచించాడు తండ్రి. తన ఆస్తినంతటినీ అమ్మి.. బంగారం, వజ్రాల రూపంలోకి మార్చాడు. వాటిని రెండు రాగి బిందెల్లో ఉంచి.. ఎవరికీ తెలియకుండా పెరట్లో ఒక చోట గోతి తవ్వి అందులో దాచిపెట్టాడు. 


🥀కొన్నాళ్లకు లక్షాధికారి మరణించాడు. రోజులు గడుస్తున్నా కొద్దీ కొడుకు పరిస్థితి దీనంగా తయారైంది. తిండి లేక పస్తులుండే పరిస్థితి దాపురించింది. తనకు ఎవరూ సాయం చేయరని అర్థమైంది. చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టాడు. ‘నాన్న మాట విని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా!’ అని బాధపడేవాడు. 


🥀జీవితం నేర్పిన పాఠాలతో మనిషి పూర్తిగా మారిపోయాడు. కష్టపడి పని చేయసాగాడు. నలుగురిలో మంచివాడు అన్న గుర్తింపు తెచ్చుకున్నాడు.


🥀ఇలా ఉండగా, ఒకరోజు.. లక్షాధికారి స్నేహితుడు ఒకరు వీళ్లింటికి వచ్చాడు. ‘నాయనా! మీ తండ్రి గొప్పవాడు. ఎంతో కష్టపడి ఆస్తి సంపాదించాడు. నువ్వు ఇలా కష్టపడటం నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది. ఈ ఇల్లు అమ్మివేసి ఏదైనా వ్యాపారం చేసుకో!’ అన్నాడు.


🥀దానికి అతడు..అయ్యా! మా నాన్న సంపాదించిందంతా నేను నాశనం చేశాను. ఈ ఇల్లు ఒక్కటే మిగిలింది. ఇది వారి జ్ఞాపకం. ఇల్లు అమ్మలేను. ఇకమీదట నా కష్టం మీద నేను బతుకుతాను’ అని బదులిచ్చాడు.


🥀ఆ మాటలు విన్న పెద్ద మనిషి ఎంతో సంతోషించాడు. ‘బాబూ! ఈ రోజు కోసమే మీ నాన్న ఎదురు చూశాడు. ఇక నీకు కష్టాలు ఉండవు. మీ పెరట్లో మీ నాన్న బంగారం, వజ్రాలు దాచి పెట్టాడు. వాటిని వెలికి తీసి.. ఏదైనా వ్యాపారం మొదలుపెట్టు. వృద్ధిలోకి రా!’ అని దీవించి వెళ్లిపోయాడు.

 

🥀ఆ స్నేహితుడు చెప్పిన చోట తవ్వాడు. రెండు బిందెల బంగారం, వంద వజ్రాలు దొరికాయి. ఎంతో సంతోషించాడు. కొంత బంగారం అమ్మి వ్యాపారం మొదలుపెట్టాడు. నిబద్ధతతో పని చేసి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు.


ఈ కథ మనుషులందరికీ వర్తిస్తుంది. ఇక్కడ కలిమి (ఆత్మ) అందరికీ ఉంటుంది. అది గుర్తించకుండా... దారిద్య్రం (దుఃఖం) అనుభవిస్తుంటాం. 


🥀ఆ కలిమి ఉనికిని కనుగొన్న నాడు.. దారిద్ర్యాన్ని అధిగమించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందగలుగుతాం.

 


☘️☘️🌼🌼🌼🌺🌼🌼🌼☘️☘️

No comments:

Post a Comment