Tuesday, June 28, 2022

స్ఫూర్తిదాతలు

స్ఫూర్తిదాతలు

రాదు, కాదు, లేదు జరగదు, చేతకాదు, తెలియదు. ఇలాంటివి పలాయన వాదులు చెప్పే మాటలు. కాబట్టి 'దు' చివరగా ఉండే ఇలాంటి పదాలు చేదు అన్నాడొక కవి.

అవయవాలు, అవకాశాలు, అవస్థలు లాంటివన్నీ సరిగ్గా ఉన్నా ఏదో ఒక నెపం పెట్టి పనుల్ని వాయిదా వెయ్యడం, తప్పించుకోవడం లాంటివి చేస్తూంటారు చాలా మంది. పైగా తాము చేయని పనులను సమర్ధించుకోవడానికి ఏవో సాకులు చెబుతూ ఉంటారు. నిజానికి ఏ అవకాశం లేని వారు, అన్ని దారులూ మూసుకుపోయిన వారు సైతం అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించారు. "మనసుంటే మార్గం ఉంటుంది ఆలోచన ఉంటే అవకాశం కనబడుతుంది" అనే నానుడిని నిజం చేశారు.

తినగ తినగ వేప తియ్యగా అనిపించినట్టే, పాడగా పాడగా రాగం వినసొంపుగా వస్తుంది. కావలసిందల్లా 'సాధన. అది ఉంటే 'అన్ని పనులు జరుగుతాయని వేమన ఒక పద్యంలో వివరించాడు.

సుందరకాండలో సీతమ్మవారి తెలుసుకోవడం కోసం హనుమంతుడు ఎన్నో ఇక్కట్లు పడ్డాడు. అనుభవించిన వేదన, పొందిన అవమానాలు- నైరాశ్యాలు, ఆమె జాడ తెలియక పోవడంతో ప్రాణ త్యాగం చేసుకోవాలని తీసుకున్న నిర్ణయాలు... వీటన్నింటినీ అధిగమించి తనకు తానే స్ఫూర్తి పొంది సీతమ్మవారి జాడ తెలుసుకోవడంలో కృతకృత్యుడయ్యాడు.

బాలుడైన వరదరాజ్' మందబుద్ధి. గురువు చెప్పినవి ఏవీ తలకెక్కని కాదు. చదువు రాదని నిరాశ చెంది ఇంటిదారి పట్టాడు. తోవలో దాహం తీర్చుకునేందుకు నూతి దగ్గరకు వెళ్ళాడు రాపిడి వల్ల ఏర్పడిన తాళ్ల జాడలున్న నూతి గట్టు, కుండల అడుగు భాగపు రాపిడి వల్ల అరిగి జాడలు ఏర్పడ్డ రాళ్లను చూసి నేను వీటికంటే మందబుద్ధినా!' అనుకుని గురువు దగ్గరకు తిరిగి వెళ్ళి పట్టుదలతో విద్యాభ్యాసం చేశాడు. పాణినిగా పేరు మారిన అతడు సంస్కృత భాషకు ప్రామాణిక వ్యాకరణమైన 'పాణినీయం' రచించాడు.

ఏకలవ్యుడికి విద్య నేర్పడానికి నిరాకరించాడు ద్రోణుడు. అయినా ఆయన మూర్తిని ఏర్పాటు చేసుకుని దాన్నే గురువుగా నిలిపి విలువిద్యలో ప్రవీణుడయ్యాడు.

స్టీఫెన్ విలియం హాకింగ్ సుప్రసిద్ధ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. 21 ఏళ్ల వయసులో నాడీ మండలానికి సంబంధించిన జబ్బు మొదలై క్రమేపీ అతడి అవయవాలన్నీ పూర్తిగా చచ్చుబడేలా చేసింది. మెదడు మాత్రం చక్కగా పనిచేస్తూ ఉండేది. ఆ స్థితిలోనే కృష్ణబిలాలకు(బ్లాక్ హోల్) సంబంధించిన అనేక అంశాలు మొదలుకొని, సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశాడు. శరీరం కదల్చడానికి కుదరని స్థితిలోనూ చేసిన పరిశోధనా కృషి ఆయనకు ప్రపంచ ప్రఖ్యాతిని తెచ్చిపెట్టింది.

లక్కోజు సంజీవరాయ శర్మ జన్మతః అందుడు, బ్రెయిలీ లిపి కానీ, అందుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేని కాలమది. అతడి అక్క పాఠశాలలో చదివిన విషయాలను ఇంటి దగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే, వాటిని విని, గుర్తు పెట్టుకుని, గణితంలో అపార విజ్ఞానం సాధించాడు. గణిత మేధావిగా గణనకెక్కాడు. ఇలా... ఎన్నెన్నో ఉదంతాలు, ఉదాహరణలు ఇవన్నీ అమిత స్ఫూర్తి దాయకాలు.

- అయ్యగారి శ్రీనివాసరావు

సేకరణ

No comments:

Post a Comment