Tuesday, June 28, 2022

మనసులోని నిర్మ్యాల్యం తొలగించుకొనేది ఎలా...????

మనసులోని నిర్మ్యాల్యం తొలగించుకొనేది ఎలా...????

💠🌺💠🌺💠🌺💠🌺💠


మనం నిత్యమూ ఆనందం, సుఖ సంతోషాలు కలుగాలని కోరుకుంటాము...
కానీ ఇవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోలేక ఎక్కడెక్కడో వెతుకుతున్నాము...
మనలోనే ఉండిన వీటికోసం ఎక్కడెక్కడికో తిరుగుతున్నాము...
రోగము వలన కలిగే బాధలు ఎక్కడ నుండి వచ్చాయి? కాశీ నుండా? రామేశ్వరం నుండా?!
అవి మన నుండియే వచ్చాయి కదా!!!
బాధలు మన నుండియే వచ్చినపుడు సుఖ సంతోషాలు కూడా మన నుండియే రావాలి కానీ ఎక్కడో బయట నుండి ఎలా వస్తాయి!??

కాలికి ముల్లు గుచ్చుకుంటె బాధ అంటున్నాం.
అదే రోడ్ మీద ఐదు వందల నోటు దొరికితే సంతోషిస్తున్నాము...
అంటే సుఖ దుఃఖాలు దొరికే వస్తువు బట్టి మనలో నుండియే వస్తున్నాయి కదా!
అంటే బాధలు, సంతోషాలు అన్నీ మనలోనే ఉన్నాయి.
మరి మనలో ఉండిన వాటికోసం బయట ఎందుకు వెతకడం?!

ఇది కేవలము భ్రమ, నిజమునకు మనలో లేనిదేది బయట లేదు.
పాలలో అంతరముగా ఉన్న వెన్న రావాలంటే కవ్వం పెట్టి చిలకాలి.
అలానే మనస్సును భగవన్నామము అనే కవ్వం పెట్టి చిలికితే అపుడు అనందమనే వెన్న రావడం జరుగుతుంది.

లోపల సాధన చేయనిదే బయట తిరుగుతూ అది కావాలి ఇది కావాలి అంటే ఏమొస్తుంది?!.

"మనస్సుకు పరిమితమైనవాడు జీవుడు, మనోమూలంలోనికి వెళ్ళినవాడు దేవుడు. మనోమూలంలోనికి వెళ్ళినవారి దేహమే దేవాలయమౌతుంది."
దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం దీని
లోపల ఆత్మయే దైవం.

భగవంతుడ్ని చిత్రాలలో వెతకొద్దు చిత్తములో వెతకండి అని రమణమహర్షి అంటారు.

దీనిని బట్టి మనకి తెలుస్తుందేమిటంటే భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. కానీ మనకి కానరావడం
లేదు.
ఎందుకనీ?
మన మనస్సులో ఉన్న మాలిన్యాల వలన.!
మనలో ఉన్న దేవుడు కనబడకపోవడానికి ప్రధాన
కారణాలు రెండే రెండు తలంపులు!

మొదటిది ' నేను' అనే తలంపు.
రెండవది ' నాది' అన్న తలంపు.

మొదటిది అహంకారం, రెండవది మమకారం!
ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు.

మన హృదయములో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు. ఆ పరమపవిత్రుడుని
పరికించాలంటే మనమూ పవిత్రం కావాలి..
ఎలా?

ప్రతిరోజూ పూజగదిలో పూజకు ముందు మనం మొదట చేసే పని, ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదట చేసే పని ఒకటే. అది ముందురోజు నిర్మాల్యములను తీసేసి పుజాసామగ్రిని పూజగదిని శుభ్రపరిచి అన్నీ శుద్ధి
చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం. ఈ రీతిలోనే హృదయమునందున్న భగవంతుడిని అవలోకించాలంటే ముందుగా మనోమాలిన్యాలను తొలగించాలి. అజ్ఞానమును నిర్మాల్యమును తీసేయాలి. ముందురోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలను తొలగించాలి.
(కర్తృత్వ భావనను తొలగించుకోవాలి).

మనలో ఉన్న అజ్ఞాన నిర్మాల్యమును తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనెడి ఆరుఅడ్డంకులు ఉన్నాయి, వాటిని తొలగించాలి.

సత్కర్మాచరణ, సత్సంగీయుల సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సదవగాహన, సత్వగుణ సాధన, సేవాతత్పరత, శుద్ధాహారములతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు. శుద్ధ ఆహారమంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, పంచేంద్రియాల ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది.

మనస్సునూ, బుద్ధిని సంస్కరించుకుంటూ ఇంద్రియా
లను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి. మన సద్గతికి, దుర్గతికి కారణం మన మనస్సే, మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం. మన కర్మలే మన సుఖదుఃఖాలకు కారణం.

మనలో అనేక బలహీనతలుంటాయి. అలాగే లోకంలో అనేక ఆకర్షణలుంటాయి. ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి.


హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసినా దానిని
గురించి ఆలోచించం.

ఇదే మాయ. శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, ఋషి రుణాలు తీర్చుకుంటూ ఈ దేహం శిధిలమవ్వక ముందే హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి.

మానవుడు ఆనందమును అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి. అవి ఒకటి ప్రేమ, రెండుజ్ఞానం. ఈ రెండు ఉన్నప్పుడే ఏకత్వస్థితి వస్తుంది🙏🤝👍🤝🙏

సేకరణ

No comments:

Post a Comment